నా తెలంగాణ స్వచ్ఛంగా.. పాటలా.. తేటగా..
నవ తెలంగాణ: పల్లె కన్నీరు పెడుతుందో..కనిపించని కుట్రల.. నా తల్లి బందీ అవుతుందో.. కనిపించని కుట్రల.. అని గ్రామాల్లో జరుగుతున్న దుర్మార్గాలను, కనుమరుగు అవుతున్న పల్లె సంస్కృతిని చూసి బాధతో గొంతు పెకిలించినోడు ప్రజాకవి గోరటి వెంకన్న. తన గొంతు నుంచి సమస్త తెలంగాణ దుఃఖాన్ని, నిరసనను, ధిక్కారాన్ని పలికించినోడు. గోరటి పాటలను భుజాన వేసుకుని జనాన్ని చైతన్యం చేసే కళాకారులు వందలు.. వేలల్లో ఉన్నారు.అలాంటి వెంకన్న.. నవ తెలంగాణ నిర్మాణంపై కోన సుధాకర్ రెడ్డికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని ఆవిష్కరించారు.
ప్రజల కల సాకారమైంది. దశాబ్దాల పోరాటం ఫలించి తెలంగాణ రాష్ట్రం ఆవిష్కృతమైంది. ఇక కొత్త రాష్ట్రంలో అన్ని విషయాల్లోనూ పునర్నిర్మాణం జరగాలి. గ్రామీణ సంప్రదాయ కళా ైవె భవాలకు పునర్వైభవం తీసుకురావాలి. సెజ్‌ల పేరుతో తెలంగాణ గడ్డన భూములకు పడ్డ కంచెలు తొలగిపోవాలి. వివక్షకు అసలు కారణం భూమే కాబట్టి ఎవరికీ 20 ఎకరాలకు మించి ఉండకూడదు. భూమిలేనివారందరికీ ప్రభుత్వ భూమి ఇవ్వాలి. ప్రభుత్వమే చెరువులు తవ్వించాలి.
అవసరం అనుకుంటే బోర్లు వేయించాలి. నీటి యాజమాన్యం పంపిణీపై ప్రభుత్వం శ్రద్ధపెట్టాలి. అభివృద్ధి దిశగా ఆలోచించాలి. రెండు జీవనదుల మధ్యనున్న గడ్డ తెలంగాణ. సంపూర్ణంగా నీరు రావాలి. పెట్టుబడుల్లేని వ్యవసాయం, నీటి వాడకం తక్కువగా ఉన్న పంటలు రావాలి. పంటలు రైతులకు వెన్నుదన్నుగా ఉండాలి. ఉద్యోగ సంఘాల జేఏసీలు ఈ రోజు నుంచి కొత్త తెలంగాణ రాష్ట్రం కోసం కంకణబద్ధులమై పనిచేస్తామని ప్రతిజ్ఞ చేయాలి. లంచం తీసుకోబోమని, అవినీతి జోలికి వెళ్లబోమని ఉద్యోగులు ప్రతిజ్ఞ చేయాలి. ఎన్నికల్లో రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా గెలవాలి. అధికారులు అలసత్వం వీడాలి. తెలంగాణ స్వచ్ఛంగా, సంపూర్ణంగా ఉండాలి.
పల్లెల బాగు కోసం..
సరళీకరణ ఆర్థిక విధానాలతో పల్లెల్లో చాలా మార్పులు వచ్చాయి. ఊహించని సదుపాయాలతోపాటు రాజకీయ దళారీ వ్యవస్థలూ వచ్చి చేరాయి. పల్లెలు బాగుపడాలంటే ఆదర్శవంతమైన ఉద్యమాలు రావాలి. ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం మద్య నిషేధం చేయడంతోపాటు ప్రతీ కుటుంబానికి మూడెకరాల భూమి ఇవ్వాలి. ప్రజలను పిప్పిచేస్తున్న వైద్య, విద్య రంగాలను ప్రభుత్వమే నిర్వహించాలి. పోలీసులు సోషల్ వర్కర్ల లాగా పనిచేయాలి. కుల వృత్తులను ఆధునికీకరించాలి. అప్పుడే తెలంగాణ పల్లెల్లో అభివృద్ధి సిరిమల్లెచెట్లు మొలకెత్తుతాయి.
విడిపోయిన మనమొక్కటే..
తెలంగాణ అంటే కరువు..కన్నీళ్లే. నీరు, కొలువుల విషయంలో బాగా అన్యాయం జరిగింది. ఇప్పుడు విడిపోయినా మంచిగానే విడిపోవాలి. భౌగోళికంగానే విడిపోతున్నాం తప్ప మన సంస్కృతి, జాతి ఒక్కటే కదా. ఇక సాంస్కృతికంగా తెలంగాణకు చాలా అన్యాయం జరిగింది. వలసవాదులు మొదట తెలంగాణ భాషపైనా, ఈ ప్రాంతపు సొగసులపైనా పడ్డారు. కళను మార్కెట్ చేసుకుని ఆ తర్వాత అందమైన తెలంగాణ సృజనాత్మకతను మింగేశారు.
అందుకే.. ఆ పాట రాశా
ఎందరో వలసవాద రాజకీయనేతలు, పెట్టుబడిదారులు ఇక్కడి వందలాది ఎకరాల పచ్చటి నేలను ఆక్రమించేశారు. ఉద్యోగాలను కొల్లగొట్టారు. మా తెలంగాణ బిడ్డలు యాడికిపోవాలి. వందలాది మంది మిసమిసలాడే మీసకట్టు కలిగిన యువకులు తెలంగాణ కోసం ప్రాణాలు విడుస్తుంటే ఏమీ ఎరగని వారిలాగా ఆంధ్రావాళ్లు ఉంటే మాకు మండదా. అందుకే కడుపు మండి ‘పొమ్మంటే పోవేందిర ఓ ఆంధ్ర దొర’ అనే పాట రాశా.
ఏ ఉద్యమానికైనా పాటే ఊపిరి
పాటలేని ఉద్యమాన్ని ఊహించుకోలేం. ఆఫ్రికా జాతి ఉద్యమంలోనూ, నిజాం వ్యతిరేక పోరాటాల్లోనూ ప్రజల పక్షాన నిలిచింది పాటే. ప్రగతీ శీల ఉద్యమాలకు ముందే పాట ఉంది. హింసకు, పెత్తనానికి, బాంచన్ దొరలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పాటను ఆయుధంగా చేసుకున్నారు. ఆనందం, బాధ కలిగినప్పుడు పాట దానంతట అదే పుట్టుకొస్తుంది. ఉద్యమం ఉవ్వెత్తున ఎగసేందుకు పాట అనేకరకాలుగా దోహదం చేసింది. కోస్తాలో పౌరాణిక నాటకం, రాయలసీమలో తత్వ పద్యం, తెలంగాణలో జానపద పాటలు.. మూడు ప్రాంతాల్లో మూడు రకాలు.
పల్లెనుంచి వచ్చాను కాబట్టే ఆ వాసన
మాది మహబూబ్‌నగర్ జిల్లా తెలకపల్లి మండలంలోని గౌరారం. మధ్యతరగతి కుటుంబం. నాలుగో తరగతి నుంచి పది వరకు రఘుపతిపేటలో, ఇంటర్ కల్వకుర్తిలో చదివాను. తల్లి ఈరమ్మ, తండ్రి నర్సింహ. టీచరు వెంకటరెడ్డి ప్రభావంతో విద్యార్థి దశలో ఎస్ఎఫ్ఐ వైపు కొంతకాలం మొగ్గాను. మా ఊరంతా ప్రకృతి రమణీయంగా ఉంటుంది. అందరూ ఒకే కులంగా కలిసిమెలసి బతికేవారు. పల్లె నుంచి వచ్చిన వాణ్ణి కనుక నా పాటలో పల్లె వాసన ఉంటుంది. నిజాం రాక్షసత్వం, ప్రపంచీకరణ పరిస్థితులు చూశాను. పుచ్చలపల్లి సుందరయ్యలాంటి వామపక్షనేతల్ని, సర్వోదయ ఉద్యమాల్ని గమనించాను. దీంతో మనుషులంతా సమానం అన్న అభ్యుదయం నా రక్తంలో జీర్ణించుకుపోయింది. 1985-86లో నీ పాట ఏమాయెరో అనే పాట రాశాను. సోషలిజం, సమానత్వం, సాటి మనిషికి సాయం చేయాలనేదే ఇప్పటికీ నా ఆలోచన.
ఆ పార్టీ రాకముందే అన్యాయంపై పాటరాశా
తెలంగాణపై మొత్తంగా 22పాటలు రాశా. సందర్భోచితంగా పాడినవి మరికొన్ని ఉన్నాయి. ‘రేలదూల తాలెల్లాడే తెలంగాణ నే’, తల్లి తెలంగాణ , ఎలమంద ఎలమంద, కంపతారు చెట్లు...ఇలా ఎన్నో రాశాను. పారుతున్న నదీజలాల పంపకంలో జరిగిన అన్యాయానికి మొగ్గతొడిగిన ఉద్యమం నుంచే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. టీఆర్ఎస్ పార్టీ రాకముందే తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై పాట రాశా. బషీర్‌బాగ్ కాల్పులపై 12 పాటలు రాశాను. అమరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాబట్టి ముందుగా వారి కుటుం బాలు బాగుపడాలి. ఇకనుంచి తెలుగు ప్రజల దుఃఖం గురించి పాడతా.
వైఎస్ అభినందించారు
నేను రాసిన ‘పల్లె కన్నీరు పెడుతుందో..’ పాట రాష్ట్రంలో ఓ పార్టీ అధికారం కోల్పోవడానికి కారణమైందని చాలామంది అంటుంటారు. నిజానికి నాకైతే ఆ విషయం తెలియదు. 1996-97లో రాసిన ఆ పాటను ‘కుబుసం’ సినిమాలో వాడుకున్నారు. ఆ తర్వాత గత ఎన్నికలకు ముందు ‘పార్టీ’ వాళ్లు ప్రకటనగా వాడుకున్నారు. అది అలా దోహదకారిగా అయిందని చాలామంది అప్పట్లో చెప్పారు. అధికారంలోకి వచ్చిన మూడో రోజే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నన్ను, మరికొందరిని పిలిపించి అభినందించారు.
నా ఊరే ప్రేరణ..
1996-97లో ‘పల్లె కన్నీరు పెడుతుందో...’ అనే పాట రాశాను. దీనికి ప్రేరణ నా ఊరే. సంస్కరణల ప్రభావంతో ఊళ్ల నుంచి వలసలు మొదలైన కాలం. ప్రతి ఏటా మా ఊళ్లో మొహర్రం బాగా జరుగుతుంది. అలాంటిది ఆ ఏడాది మా ఊరికి పోతే ఊళ్లో జనాలే లేరు. రైతుల వ్యధలు, పల్లె ఉనికి కోల్పోతున్న వైనం నన్ను కదిలించింది. అదేపాటగా మారింది. ఆధునికతకు దూరమవుతున్న మనుషుల గురించి రాశాను. ఏ ఊళ్లో చూసినా కలవృత్తులు మూలనపడ్డాయి. ఒక సంవత్సర కాలం పట్టిందీ పాటకు. బాలసంతుల యక్షగానం స్ఫూర్తితో నేనీ పాటను రాశా.