పులి మాంసం కోసం డిష్యూం డిష్యూం
శ్రీకాకుళం: పులి మాంసం వాటాలుగా పంచుకునే క్రమంలో గ్రామస్తుల మధ్య వివాదం చోటు చేసుకుంది. అది కాస్త పెద్దదై పోలీసు స్టేషన్ చేరింది. ఆ సంఘటన శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం బకిరికొండ ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఒడిశా నుంచి దారితప్పి ఉత్తరాంధ్రలో ప్రవేశించిన ఓ పులి రైవాడ కొండ ప్రాంతంలో సంచరిస్తుండేది. రైతులు అనధికారికంగా ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె వల్ల గత రాత్రి ఆ పులి విద్యుత్ షాక్తో మృతి చెందింది. దీంతో ఆ పులి మాంసాన్ని గ్రామస్తులు పంచుకోవాలని నిర్ణయించారు.
ఆ మాంసం పంచుకునే క్రమంలో గ్రామస్తుల మధ్య వివాదం చోటు చేసుకోవడంతో సదరు వ్యక్తులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పులి మృతి చెందిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించి... గ్రామస్తుల్లో పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పులి చర్మం, గోళ్లు ఏమైనాయి అనే అంశంపై మాత్రం గ్రామస్తులు పెదవి విప్పడం లేదు. దీంతో పోలీసులు తమదైన శైలిలో గ్రామస్తులను విచారిస్తున్నారు.