ఫిడెల్ క్యాస్ట్రో బయటకొచ్చారు!
హవానా: క్యూబా పోరాట యోధుడు, మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో 14 నెలల తర్వాత తొలిసారిగా బయట కన్పించారు. తన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న ఊహాగానాలకు ఆయన తెరదించారు. హవానాలో విల్మా ఎస్పిన్ స్కూల్ ను గత సోమవారం ఆయన సందర్శించారు. కారులో కూర్చునివున్న క్యాస్ట్రో ట్రాక్ సూట్, టోపీ ధరించివున్నారు.
దాదాపు గంటన్నరసేపు అక్కడ గడిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చాయి. పలు మీడియా సంస్థలు ఈ వార్తను ప్రచురించాయి. అయితే శనివారం ఈ విషయాన్ని అధికారిక మీడియా ధ్రువీకరించింది. 2013లో ఈ పాఠశాలను క్యాస్ట్రో ప్రారంభించారు.