ఆందోళనతో దద్దరిల్లిన నిట్
నిట్‌క్యాంపస్ : కాజీపేటలోని నిట్‌లో సెక్యూరిటీ గార్డులు, నాన్ టీచింగ్ ఉద్యోగులు చేపట్టిన ఆందోళన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ జోక్యంతో మంగళవారం రాత్రి ముగిసింది. నిట్ స్టోర్ అసిస్టెంట్ ఎండీ.అక్బర్‌పై దాడిచేసిన ఇన్చార్జ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఖురేషి, ఉద్యోగి బాలసుబ్రహ్మణ్యంపై చర్య తీసుకోవాలని నిట్ ఉద్యోగ జేఏసీ, సెక్యూరిటీ గార్డులు సోమవారం ఆందోళన దిగిన విషయం తెలిసిందే. మంగళవారం కూడా కొనసాగిన వారి ఆందోళనకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మద్దతుగా నిలిచారు.
తీవ్ర వాగ్వాదాలు, నిరసనల అనంతరం మంగళవారం రాత్రి నిట్ డెరైక్టర్‌తో ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ చర్చలు ఫలించారుు. మూడు గంటలపాటు మూడు దఫాలుగా జరిగిన చర్చల అనంతరం దాడికి బాధులైన నిట్ ఇన్చార్జ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎఎ ఖురేషి, నిట్ ఉద్యోగి బాలసుబ్రమణ్యంను సస్పెండ్ చేస్తున్నట్లు నిట్ డైరక్టర్ టి శ్రీనివాసరావు ప్రకటించారు. దీంతో వారు ఆందోళన విరమించారు.
ఫ్యాకల్టీ అసోసియేషన్ లెటర్‌పై ఎమ్మెల్యే ఆగ్రహం
ఇదిలా ఉండగా ఎమ్మెల్యేలు, ఎంపీలు నిట్ అకడమిక్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ నిట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ లేఖ విడుదల చేయడంపై ఎమ్మెల్యే వినయ్ మండి పడ్డారు. ఒక సెంట్రల్ ఇనిస్టిట్యూట్‌లో ఏం జరిగినా ఊరుకోవాలా అంటూ నిట్ డెరైక్టర్‌ను నిలదీశారు.
ఆ ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్ : నిట్ డెరైక్టర్ శ్రీనివాసరావు
నిట్ పూర్వ విద్యార్థిగా నిట్‌కు ఉన్న గుర్తింపును నిలబెట్టడం కోసం నిట్ ఇన్చార్జ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఖురేషి, నిట్ ఉద్యోగి బాలసుబ్రమణ్యంను సస్పెండ్ చేస్తున్నాం. ఎమ్మెల్యే, ఉద్యోగ సంఘాలు ఇచ్చిన డిమాండ్లపై కమిటీ రిపోర్టు వచ్చాక తగిన చర్యలు తీసుకుంటాం.
పోలీసుల అదుపులో ఖురేషి
నిట్‌లో ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిట్ ఇన్చార్జ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఖురేషిని కాజీపేట పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.