సోదరుడి కొడుకుపై హత్యాయత్నం
- క్వాలీస్తో బైకును ఢీకొన్న చిన్నాన్న
- ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు
- భూ తగాదాలే కారణం?
- పరారీలో నిందితుడు
- మొయినాబాద్ మండలం వీరన్నపేటలో ఘటన
మొయినాబాద్: ఓ వ్యక్తి తన అన్న కొడుకుపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. క్వాలీస్ వాహనంతో వెనకనుంచి బైక్ను ఢీకొట్టి హతమార్చేందుకు యత్నించాడు. భూ తగాదాల నేపథ్యంలో జరిగిన ఈ ఘటన మండలంలో తీవ్ర కలకలం రేపింది. మండల పరిధిలోని వీరన్నపేటలో ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. వీరన్నపేటకు చెందిన బట్టు దశరథ, విఠల్ సొంత అన్నదమ్ములు. వీరు మూడు నెలలుగా భూ వివాదమై గొడవపడుతున్నారు.
ఈనేపథ్యంలో బట్టు దశరథ కొడుకు బట్టు రాజమల్లేష్పై విఠల్ కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా అతడిని చంపేందుకు పథకం వేశాడు. ఈక్రమంలో ఆదివారం ఉదయం వీరన్నపేట వద్ద తన సొంత క్వాలీస్ వాహనం రోడ్డుపక్కన నిలిపి మాటువేశాడు. మండలంలోని రెడ్డిపల్లిలో రాజమల్లేష్ ఓ ప్రైవేటు షాపులో పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం పనికోసం తన బైక్పై వరుసకు సోదరుడైన శ్రీశైలంను ఎక్కించుకుని ఇంటి నుంచి బయలుదేరాడు. రోడ్డుపైకి వెళ్లగానే అప్పటికే మాటువేసి ఉన్న విఠల్ క్వాలీస్ వాహనంతో వెనకనుంచి వేగంగా రాజమల్లేష్ బైక్ను ఢీకొట్టాడు.
దీంతో రాజమల్లేష్, శ్రీశైలం రోడ్డుపై పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. రాజమల్లేష్ తలకు బలమైన గాయమైంది. వెంటనే స్థానికులు వారిని చికిత్సకోసం స్థానిక భాస్కర ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి వివరాలు సేకరించారు. నిందితుడు విఠల్ పరారీలో ఉన్నాడు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. రాజమల్లేష్, శ్రీశైలం పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
పోలీసుల నిర్లక్ష్యం..
పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే రాజమల్లేష్పై హత్యాయత్నం జరిగిందని గ్రా మస్తులు ఆరోపిస్తున్నారు. మూడు నెల ల క్రితమే విఠల్, రాజమల్లేష్ గొడవపడ్డారు. ఈ వివాదం అప్పట్లో ఠాణా వర కు వెళ్లింది. విఠల్ నుంచి తమకు ప్రాణహాని ఉందని రాజమల్లేష్ పోలీసులకు చెప్పినా వారు పట్టించుకోలేదు. భూవి వాదం గురించి మీరే మాట్లాడుకోండని వదిలేయడంతోనే విఠల్ మరింత రెచ్చిపోయి హత్యాయత్నానికి పాల్పడ్డాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అప్పుడే స్పందించి ఉంటే ఘటన హత్యాయత్నం వరకు వచ్చి ఉండేది కాదని చెబుతున్నారు.