హిమాచల్ సీఎంకు అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ (86) ఛాతీ సంబంధిత సమస్యతో ఆదివారం అర్ధరాత్రి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సీఎం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని సోమవారం వైద్యులు తెలిపారు. మరో 24 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని చెప్పారు. ఆ రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవ్ వ్రత్ ఆస్పత్రికి వెళ్లి ముఖ్యమంత్రిని పరామర్శించారు. పలువురు రాష్ట్ర మంత్రులు ఆస్పత్రికి వెళ్లి సీఎం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వీరభద్ర సింగ్ సొంత ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఛాతీనొప్పి రావడంతో అస్వస్థతకు గురయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, జేపీ నద్దా కూడా పాల్గొన్నారు. సీఎంను వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. ఆదివారం రాత్రి మళ్లీ అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలించారు.