visakha express
-
‘విశాఖ’కు బాంబు బెదిరింపు
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: భువనేశ్వర్ – సికింద్రాబాద్ విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పెట్టారంటూ బెదిరింపు కాల్ రావడంతో రాజమహేంద్రవరంలో రైల్వే అధికారులు బెంబేలెత్తారు. పోలీసుల కథనం ప్రకారం, భువనేశ్వర్‌లో ఎస్–6 బోగీలో కొందరు యువకులు ఎక్కారు. వీరిలో దిలీప్‌కుమార్ అనే యువకుడు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నాడు. బోగీ లోపల ఖాళీ లేకపోవడంతో వీరు గేటువద్ద కూర్చున్నారు. అప్పటికే మద్యం తాగి ఉన్నవారి మధ్య విశాఖలో వివాదం మొదలైంది. సామర్లకోట చేరువలో దిలీప్‌కుమార్‌కు, మిగిలిన యువకులకు మధ్య ఘర్షణ ముదిరింది. రైలు నడుస్తుండగానే పరస్పరం నెత్తురు వచ్చేలా దాడులు చేసుకున్నారు. ఆ సందర్భంగా ఒక వర్గం యువకులు బాంబులు పెట్టి రైలును పేల్చివేస్తామంటూ బెదిరించారు. దీంతో బెంబేలెత్తిన ప్రయాణికులు కొందరు రైల్వే పోలీస్ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న దిలీప్‌కుమార్ చైన్ లాగి, రైలును నిలిపివేశాడు. దీంతో ఘర్షణ పడ్డ వారిలో కొందరు యువకులు రైలు దిగి పరారయ్యారు. వారు బాంబులు పెట్టారని దిలీప్‌కుమార్ అనడంతో బోగీలోని ప్రయాణికులు మరింత భీతిల్లారు. సమాచారం అందుకున్న సామర్లకోట రైల్వే పోలీసులు వెంటనే రైలును తనిఖీ చేసి, రాజమహేంద్రవరం తీసుకువచ్చారు. రాత్రి 8.20 గంటలకు రాజమహేంద్రవరం వచ్చిన ఆ రైలును రైల్వే స్టేషన్లో గంటపాటు నిలిపివేశారు. రాజమహేంద్రవరం మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ భరత్ మాతాజీ ఆధ్వర్యాన టూ టౌన్ ఇన్స్పెక్టర్ ముక్తేశ్వరరావు, రైల్వే ఏఎస్పీ నగేష్ నోయల్, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ రమణయ్యలు బోగీ మొత్తం డాగ్, బాంబు స్క్వాడ్లతో తనిఖీలు చేశారు. బాంబు లేదని నిర్ధారణ అయిన అనంతరం రైలును వదిలారు. ఘర్షణకు దిగిన యువకుల్లో దిలీప్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న అతడు పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడని డీఎస్పీ భరత్ మాతాజీ తెలిపారు. నిందితులపై ప్రభుత్వ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో చైన్ స్నాచింగ్
-
విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల హల్చల్
సాక్షి, పశ్చిమ గోదావరి : విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. నిడదవోలు సమీపంలోని కాల్దరి - సత్యవాడ స్టేషన్ల మధ్య రైలు చైన్ లాగిన దొంగలు మహిళల మెడలో బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఎస్ 6 నుంచి ఎస్ 13 వరకూ గల బోగీల్లో దుండగులు దోపిడికి పాల్పడినట్లు తెలిసింది. దోపిడి సమయంలో 28 నిమిషాల పాటు రైలు మార్గం మధ్యలో రైలు నిలిచిపోయిందని బాధితులు తెలిపారు. సుమారు 170 గ్రాముల బంగారాన్ని దుండగులు అపహరించుకెళ్లినట్లు సమాచారం. దాదాపు 10 మంది దుండగులు ఈ దోపిడిలో పాల్గొన్నట్లు తెలిసింది. నిడదవోలు రైల్వే స్టేషన్ పీఎస్‌లో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్వగ్రామాలకు గల్ఫ్ బాధితులు
సాక్షి, ముంబై: గల్ఫ్ ఉపాధి పేరుతో మోసపోయిన వారంతా స్వగ్రామాల బాట పట్టారు. ముంబైలోని లోకమాన్య తిలక్ టర్మినస్ (ఎల్టీటీ) నుంచి విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వీరందరు తిరుగు ప్రయాణమయ్యారు. గల్ఫ్ ఉపాధి పేరిట ఏకంగా 48 మంది మోసపోయిన సంగతి తెలిసిందే. మోసపోయిన వారిలో ముగ్గురు మినహా మిగిలిన వారంతా గురువారం ఉదయం ఎల్టీటీ నుంచి భీమవరానికి బయలుదేరినట్టు బాధితుడు దుర్గారావ్ తెలిపారు. కరీంనగర్ జిల్లాకు చెందిన భూమేష్, వరంగల్ జిల్లా బి వినోద్ వ్యక్తులు తమను మోసం చేసినట్టు వీరు ఆరోపిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు పోలీసు స్టేషన్లో మోసం చేసిన వారిపై ఫిర్యాదు చేస్తామని బాధితులు చెప్పారు. స్థానిక ప్రజా ప్రతినిధులు తమకు సహాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. -
రైలు బోగీలో అస్థిపంజరం
సికింద్రాబాద్ : రైలు బోగీలో అస్థిపంజరం బయటపడ్డ ఉదంతం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం ఈనెల 16న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులోని రెండు బోగీలను మరమ్మతు కోసం అదేరోజు షెడ్డుకు తరలించారు. మరమ్మతు చేసేందుకు ఇద్దరు కార్మికులు సోమవారం ఆ బోగీల వద్దకు వచ్చారు. బోగీలోంచి దుర్వాసన రావటంతో వారు పోలీసులకు సమాచారం అందించాచు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బోగీలోకి వెళ్లేందుకు యత్నించగా తలుపు లోపలి నుంచి గడియపెట్టి ఉంది. దీంతో కిటికీలోంచి పరిశీలించగా అస్థిపంజరం కనిపించింది. గ్యాస్ కట్టర్‌తో తలుపును తెరిచి లోపల ఉన్న పురుషుడి అస్తిపంజరాన్ని బయటకు తీశారు. ఒంటిపై ఖాకీ చొక్కా మాత్రమే ఉంది. అస్థిపంజరాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలేవీ లభించలేదు. ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేక గుండెపోటుతో చనిపోయాడా అనేది తేలాల్సి ఉంది. కేసు దర్యాప్తులో ఉంది.