సాక్షి, ముంబై: గల్ఫ్ ఉపాధి పేరుతో మోసపోయిన వారంతా స్వగ్రామాల బాట పట్టారు. ముంబైలోని లోకమాన్య తిలక్ టర్మినస్ (ఎల్‌టీటీ) నుంచి విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వీరందరు తిరుగు ప్రయాణమయ్యారు. గల్ఫ్ ఉపాధి పేరిట ఏకంగా 48 మంది మోసపోయిన సంగతి తెలిసిందే. మోసపోయిన వారిలో ముగ్గురు మినహా మిగిలిన వారంతా గురువారం ఉదయం ఎల్‌టీటీ నుంచి భీమవరానికి బయలుదేరినట్టు బాధితుడు దుర్గారావ్ తెలిపారు.
కరీంనగర్ జిల్లాకు చెందిన భూమేష్, వరంగల్ జిల్లా బి వినోద్ వ్యక్తులు తమను మోసం చేసినట్టు వీరు ఆరోపిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు పోలీసు స్టేషన్‌లో మోసం చేసిన వారిపై ఫిర్యాదు చేస్తామని బాధితులు చెప్పారు. స్థానిక ప్రజా ప్రతినిధులు తమకు సహాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు.