ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్
ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు): దేశంలో సేంద్రియ రైతులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరాన్ని ‘ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్’గా ప్రకటించిందని కేంద్ర విదేశీ, పార్లమెంట్ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్ తెలిపారు. విశాఖలోని గాదిరాజు ప్యాలెస్ వేదికగా జరుగుతున్న విశాఖ ఆర్గానిక్ మేళా–2023ను శుక్రవారం ఆయన సందర్శించారు. మిల్లెట్ ఫుడ్ స్టాళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మురళీధరన్ మాట్లాడుతూ చిరుధాన్యాల ఉత్పత్తి, మార్కెటింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.
దేశంలో 10 వేల ఫార్మింగ్ కంపెనీలను సేంద్రియ వ్యవసాయం దిశగా కేంద్రం ముందుకు నడిపిస్తుందన్నారు. వన్ డిస్ట్రిక్ట్.. వన్ ప్రొడక్ట్‌లో భాగంగా దేశంలోని ప్రతి జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మార్కెట్ కల్పించినట్లు తెలిపారు. ఇందులో అనకాపల్లి బెల్లం, అరకు కాఫీ వంటి ఉత్పత్తులు ఉన్నట్లు వెల్లడించారు. సేంద్రియ పంటలను ప్రోత్సహించే దిశగా ఆర్గానిక్ మేళా–2023ను ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు.
విశాఖ ఖ్యాతిని ప్రపంచవ్యాపితం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందులో భాగంగానే జీ–20 సదస్సుకు విశాఖ వేదిక కానుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యదర్శి జలగం కుమారస్వామి, మేళా గౌరవ అధ్యక్షుడు, జీఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ జీఎస్ఎన్ రాజు, కార్యదర్శి యుగంధర్‌రెడ్డి, విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త అశోక్‌కుమార్, రైతు మిత్రా టెర్రస్ గార్డెన్ నిర్వాహకుడు దాట్ల వర్మ, గ్రీన్ క్లైమేట్ అధ్యక్షుడు జేవీ రత్నం, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి షణ్ముఖరావు, సేంద్రియ పద్ధతిలో సాగుతు చేస్తున్న రైతులు పాల్గొన్నారు.