Visakhapatnam weather station
-
తీరంలో ఈదురుగాలులు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాష్ట్రంలో వచ్చే 48 గంటల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నాయన్నారు. మరోవైపు నైరుతి రుతుపవనాల జోరు తగ్గిందని, పశ్చిమ గాలుల వల్ల వాయవ్య భారతదేశంలో మిగిలిన భాగాల్లో వీటి పురోగతి నెమ్మదిగా ఉందని తెలిపారు. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హరియాణ, ఢిల్లీల్లో రుతుపవనాల ప్రవేశానికి అంత అనుకూలంగా లేదని చెప్పారు. తూర్పు ఉత్తరప్రదేశ్‌లో దిగువ స్థాయిలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా.. మరికొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు నెమ్మదిగా ప్రవేశించే అవకాశం ఉందని తెలిపారు. -
మూడు రోజుల పాటు వర్షాలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఆగ్నేయ అరేబియాలో నైరుతి రుతుపవనాలు బలపడుతున్నాయి. రుతుపవనాలు గురువారం కేరళను తాకనున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం బుధవారం తెలిపింది. కాగా, నైరుతి రుతుపవనాల రాక వల్ల అకాల వర్షాలు వస్తాయని, ఆ ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో ఉత్తర కోస్తాంధ్రా, దక్షిణ కోస్తాంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. బుధవారం రాష్టంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. కృష్ణా జిల్లా నూజివీడులో 122 మిల్లీమీటర్లు, అగిరిపల్లిలో 109, తోటపల్లిలో 99, శ్రీకాకుళం జిల్లా పాలకొండలో 98.5, పలాసలో 50, కంచిలిలో 48, మెళియాపుట్టి, రాజాంలలో 47, ఇచ్ఛాపురంలో 46.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లా బొండపల్లి, నెల్లిమర్లలో 44.25 మిల్లీమీటర్లు, సీతానగరంలో 41.5, విశాఖ జిల్లా కె.కోటపాడులో 34.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. ముంచంగిపుట్టు మండలంలోని బిరిగూడ, ముత్తగుమ్మి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. 23 పశువులు, 6 మేకలు మృత్యువాత పడగా.. ఓ పశువుల కాపరికి తీవ్ర గాయాలయ్యాయి. -
ఏపీలో చలిగాలులు పెరిగే అవకాశం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో చలి గాలులు ఇంకా పెరిగే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు శుక్రవారం తెలిపారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటోంది. దీనికి తోడు ఎత్తులో ఈశాన్య, తూర్పు దిశల నుంచి చల్లటి గాలులు వీస్తున్నాయి. రాత్రి పూట చల్లటి గాలులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. మన్యం ప్రాంతాల్లో మంచు కురుస్తోందని, ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు అవుతున్నాయని అధికారులు తెలిపారు. శుక్రవారం పాడేరులో 13.5 డిగ్రీలు, ఆరోగ్యవరంలో 17.5, చింతపల్లిలో 18.5, అరకులో 17.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అనేక ప్రాంతాల్లో మూడు డిగ్రీల వరకు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని, ఎక్కువ ప్రాంతాలు పొడిగా ఉంటాయని తెలిపారు. -
రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గాయ్
మహారాణిపేట (విశాఖ దక్షిణ): బంగాళాఖాతంలో ఈశాన్య, తూర్పు దిశల నుంచి చల్లటి గాలులు వీస్తున్నాయి. ఇవి తక్కువ ఎత్తులో వీయడం వల్ల వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. పట్టణ ప్రాంతాల్లో పెద్ద ప్రభావం లేకపోయినా.. గ్రామీణ ప్రాంతాల్లో కొద్దిగా, మన్యం ప్రాంతాల్లో ఎక్కువగా చలి పెరిగింది. మన్యంలో మంచు కురుస్తోంది. మేఘాలు ఆవరించడం వల్ల రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో రెండు నుంచి మూడు డిగ్రీల తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవు తున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఉత్తర తమిళనాడులో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి మాల్దీవుల నుంచి ఆగ్నేయ అరేబియా సముద్రం వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణిలో విలీనమైన సంగతి తెలిసిందే. ఈ ప్రభావంతోపాటు చల్లటి గాలుల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 48 గంటల్లో (గురు, శుక్రవారాల్లో) ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో ఒకటి రెండుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
ఫొని అప్డేట్స్: ఏపీకి తప్పిన గండం!
సాక్షి, విశాఖపట్నం : తుపాను ఫణి (ఫొనిగా కూడా వ్యవహరిస్తున్నారు) వణికిస్తోంది. మరికొద్ది గంటల్లో తీవ్ర తూఫాను గా మారనున్న ఫొని ప్రస్తుతం మచిలిపట్నం, చెన్నై మధ్య కేంద్రీకృతమై ఉంది. రాగల 24 గంటల్లో ఇది అతి తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణ విభాగం ఇప్పటికే వెల్లడించింది. అతి తీవ్ర తుపానుగా మారి.. ఫొని ఈ నెల 30 వరకు వాయువ్య దిశగా ప్రయాణిస్తుందని, అనంతరం రీకర్వ్ తీసుకొని ఈశాన్యం దిశగా వెళుతుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. క్రమంగా బలపడుతున్న ‘ఫొని’ అప్డేట్స్ ఇవి.. (చదవండి: పెను తుపాను! ) హమ్మయ్యా.. ఏపీకి తప్పిన ఫొని గండం! ఏపీకి ఫొని తుపాను గండం తప్పినట్టు కనిపిస్తోంది. రాష్ట్రంపై ఫొని తుఫాన్ ప్రభావం ఉండదని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ప్రస్తుతం మచిలిపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1,230 కిలోమీటర్ల దూరంలో ఫొని తుపాను కేంద్రీకృతమై ఉందని, ఈ సాయింత్రానికి మరింత బలపడి ఇది తీవ్ర తుపానుగా మారుతుందని అధికారులు వెల్లడించారు. రేపటికి ఇది అతి తీవ్ర తుపానుగా మరే అవకాశముందన్నారు. ఫొని ప్రస్తుతం వాయువ్య దిశగా పయనిస్తూ.. మే 1నుండి దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా పయనించనుందని చెప్పారు. రేపటి నుంచి తీరం వెంబడి గంటకు 45 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందని తెలిపారు. క్రమేణా మే 3వరకు గాలులు వేగం పెరగొచ్చునని తెలిపారు. విశాఖపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో జారీ చేసిన రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక ప్రస్తుతానికి కొనసాగుతోంది. కాకినాడ, గంగవరం పోర్టుల్లో డిడబ్ల్యూ-2, సెక్షన్ సిగ్నల్ 5 హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాకాడు వద్ద 15 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం నెల్లూరు జిల్లాలోనూ తీర ప్రాంత ప్రజలను ప్రభుత్వ అధికారులు అప్రమత్తం చేశారు. సముద్రంలో అలల ఉధృతి తీవ్రంగా ఉంది. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో ఎప్పుడేం జరుగుతుందోనని తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాకాడు వద్ద సముద్రం దాదాపు 15 మీటర్లు ముందుకొచ్చింది. విడవలూరు వద్ద సముద్రంలో అలలు ఉధృతంగా ఉన్నాయి. తూపిలిపాలెం, కొత్తకోడూరు, మైపాడు, రామతీర్థం, తుమ్మలపెంటలోనూ సముంద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. మత్స్యకార ప్రాంతాల్లో పోలీసులు, రెవెన్యూ అధికారులు పర్యటించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. తమిళనాడు భయపెడుతున్న ఫొని! ఫొని తుపాను తమిళనాడును భయపెడుతోంది. చెన్నైకి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఈశాన్య బంగాళాఖాతంలో ప్రస్తుతం ఈ తుపాను కేంద్రీకృతమైంది. దీంతో తమిళనాడు, కోస్తాంధ్ర తీరప్రాంతంలో సముద్ర అలలు ఎగిసిపడుతున్నాయి. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో చెన్నై, తిరువల్లూరు, కాంచీపురం, పుదుచ్చేరి, కడలూరు, కారైకాల్, నాగపట్నం తదితర తీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రకాశం జిల్లాలో కంట్రోల్ రూం ఏర్పాటు ప్రకాశం: ఫొని తుపాను ముంచుకొస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అధికారులను అప్రమత్తం చేశారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర సహాయం కోసం 222100, 281720, 231222 ఫోన్‌నెంబర్లకు కాల్ చేయవచ్చు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. నెల్లూరులో ఎగిసిపడుతున్న అలలు.. నెల్లూరు జిల్లా: బంగాళాఖాతంలో ఫొని తుపాను ప్రభావం కనిపిస్తోంది. దీంతో నెల్లూరు తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. తూపిలిపాలెం, కొత్త కోడూరు, మైపాడు, రామతీర్థం, తుమ్మలపెంట తదితర తీర ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ఫొని తుపాను నేపథ్యంలో మత్స్యకారులు, పర్యాటకులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారుల హెచ్చరించారు. తీరంలో మొదలైన ఈదురు గాలులు కృష్ణా జిల్లా: ఫొని తుపాను ప్రస్తుతం మచిలీపట్నానికి తూర్పు దిశగా 1265 దూరంలో కదులుతోంది. అటు చెన్నైకి 1,080 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. తుపాను కదలికలు వేగంగా ఉండటంతో తీరం వెంబడి ఈదురు గాలులు మొదలయ్యాయి. ఆదివారం 80-90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు మొదలవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఫొని తుపాను ప్రభావంతో తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. తుపాను తీరానికి దగ్గరయ్యే కొద్దీ కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడొచ్చునని వాతావరణ శాఖ తెలిపింది. ఫొని తుపాను నేపథ్యంలో విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో రెండు నంబరు ప్రమాద హెచ్చరికను జారీచేశారు. -
కోస్తాకు వర్ష సూచన : విశాఖ వాతావరణ కేంద్రం
విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో కోస్తాలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బంగ్లాదేశ్ వైపు తరలిందని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని వాయుగండం కేంద్రీకృతమైందన్నారు. ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని తెలిపారు. తీరం వెంబడి 45-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని...మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. -
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
విశాఖ: వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఒడిశా తీరానికి సమీపాన ఏర్పడిన అల్పపీడన ప్రాంతంలో 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు ఆదివారం విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తాకు చెదురుమదురు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. తెలంగాణలోనూ విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో కోస్తా తీరం వెంబడి పశ్చిమదిశగా గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయనీ, మత్య్సకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాగా, అయితే రాయలసీమలో మాత్రం వర్షాలు తగ్గుముఖం పట్టనున్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.