త్వరలోనే యాపిల్ స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్.. భారత్ రానున్న టిమ్‌కుక్!
యాపిల్ సీఈవో టిమ్‌కుక్ భారత్ వస్తారని, ఇక్కడ ఏర్పాటవుతున్న యాపిల్ స్టోర్ ఆయన చేతుల మీదుగానే ప్రారంభిస్తారని అంచనా వేస్తూ ఎకనమిక్ టైమ్స్ కథనం వెలువరించింది.
ఈ మేరకు టిమ్‌కుక్ భారత ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకునే అవకాశం ఉంది. కుక్ 2016లో భారత్ పర్యటనకు వచ్చినప్పుడు కూడా మోదీతో భేటి అయ్యారు. కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో ఉన్న యాపిల్ ప్రధాన కార్యాలయం కుక్ భారత పర్యటన ప్రణాళికను, ముంబై స్టోర్ ప్రారంభ తేదీని ఖరారు చేస్తోంది. కుక్ వెంట యాపిల్ రిటైల్ అండ్ పీపుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డీర్డ్రే ఓబ్రియన్ ఉంటారని తెలుస్తోంది.
టిమ్ కుక్ చివరి సారిగా 2016లో భారత్‌లో పర్యటించారు. బాలీవుడ్ స్టార్స్, టాప్ ఎగ్జిక్యూటివ్‌లతో సమావేశమయ్యారు. స్టేడియంకు వెళ్లి క్రికెట్ మ్యాచ్‌ను కూడా వీక్షించారు. ముంబై నగరంలోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్లో ఈ నెలాఖరున ప్రారంభించబోతున్న రీటైల్ స్టోర్‌కు సంబంధించిన ఫొటోలను యాపిల్ విడుదల చేసింది. నగరానికి ప్రత్యేకమైన కాళీ-పీలీ ట్యాక్సీ కళాకృతి ప్రేరణతో ముంబై స్టోర్ ముఖభాగాన్ని తీర్చిదిద్దారు.