ఉత్తమ కేంద్రీయ వర్సిటీకి రాష్ట్రపతి అవార్డు
న్యూఢిల్లీ: ఉన్నత విద్యలో అత్యుత్తమ ఫలితాలను సాధించేలా కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ‘విజిటర్స్’ అవార్డులను నెలకొల్పారు. ఉత్తమ వర్సిటీతోపాటు పరిశోధన, నూతన ఆవిష్కరణలకు సంబంధించీ ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. రాష్ట్రపతి సందర్శకుని(విజిటర్)గా ఉన్న కేంద్రీయ వర్సిటీలకు ఈ అవార్డు పొందేందుకు అర్హత ఉందని రాష్ట్రపతి భవన్ తెలిపింది. ఉత్తమ వర్సిటీకి ప్రశంసాపత్రం, పరిశోధనలకు రూ. లక్ష చొప్పున నగదు అందజేస్తారు.
ఓ గ్రామాన్ని దత్తత తీసుకోండి
‘సాంసద్ ఆదర్శ్ గ్రామ యోజన’ తరహాలో కనీసం ఒక గ్రామాన్ని అయినా దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలకు రాష్ట్రపతి ప్రణబ్ పిలుపునిచ్చారు. నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ)కి చెందిన డెరైక్టర్ల సదస్సును ఆయన బుధవారం ఢిల్లీలో ప్రారంభించి ప్రసంగించారు.