మోదీ ఇలాకాలో ఆ సీట్లు బీజేపీకి అందని ద్రాక్షే.. 75 ఏళ్లలో ఒక్కసారీ గెలవలే..!
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు కొద్ది రోజుల్లోనే జరగనున్నాయి. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు అందుకు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటి నుంచే ప్రచారం ముమ్మరం చేశాయి. మరోవైపు చూసుకుంటే గడిచిన 27 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గుజరాత్‌పై బీజేపీకి అంతటి పట్టు ఉన్నప్పటికీ.. 7 అసెంబ్లీ స్థానాలు మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయాయంటే నమ్మశక్యం కాదు కదా? అయితే, అది నిజమే. స్వాతంత్య్రం సాధించినప్పటి నుంచి చూసుకుంటే ఆ సీట్లలో కాషాయ పార్టీ పాగా వేయలేకపోతోంది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి 182 స్థానాలు వస్తాయని బీజేపీ చెబుతోంది. అయితే.. ఆ 7 స్థానాల్లో మాత్రం ఎందుకు గెలవలేకపోతోంది?
బోర్సాద్, ఝగ్డియా, అంకలావ్, దానిలిమ్దా, మహుధా, గర్బడా, వ్యారా అసెంబ్లీ స్థానాలను ఈసారి ఎలాగైనా గెలవాలని భావిస్తోంది బీజేపీ. మహారాష్ట్ర నుంచి గుజరాత్ 1960లో వేరుపడి రాష్ట్రంగా ఏర్పడింది. అక్కడ 1962లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ఆయా స్థానాల్లో కాంగ్రెస్, ఇతర పార్టీలు, స్వతంత్రులు విజయం సాధిస్తూ వస్తున్నారు.
► బోర్సాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో రెండు ఉప ఎన్నికలు ఉండగా.. తొలిసారి స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఆ తర్వాత ప్రతిసారీ కాంగ్రెస్ విజయఢంకా మోగిస్తోంది.
► ఝగ్డియా సీటులో 1962 నుంచి 2017 వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. అక్కడ కాంగ్రెస్, జనతా దళ్, జనతా దళ్ యునైటెడ్, బీటీపీ పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు. కానీ, బీజేపీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. ఇక్కడ 1990 నుంచి చోటు వాసవా గెలుస్తూ వస్తున్నారు.
► వ్యారా నియోజకవర్గంలో 14 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో ఓసారి ఉప ఎన్నికలు జరిగాయి. అన్నిసార్లూ కాంగ్రెస్ విజయం సాధించింది.
► మరో ఆసక్తికర అంశం ఏంటంటే అహ్మదాబాద్‌లోని దనిలిమ్దా నియోజకవర్గం సహా.. అన్ని స్థానాలు ట్రైబల్ ప్రాంతాలకు సంబంధించినవే. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రైబల్ ప్రాంతంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకును బీజేపీ చీల్చలేకపోతోంది.
► 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99, కాంగ్రెస్ 77, స్వతంత్రులు 3, బీటీపీ 2, ఎన్సీపీ 1 స్థానాన్ని గెలుచుకున్నాయి.
ఇదీ చదవండి: కేసీఆర్ సర్కార్ 15 రోజుల్లో కూలిపోతుంది.. రాజగోపాల్‌రెడ్డి