ప్రజా ఘోష
ఒంగోలు టౌన్: తమ సమస్యలు పరిష్కరించాలని జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు ఉన్నతాధికారులను వేడుకున్నారు. సోమవారం ఇక్కడి కలెక్టరేట్లోని సీపీఓ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.వినయ్‌చంద్, జాయింట్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, డీఆర్ఓ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
‘మాస్టర్‌మైండ్స్’ నిలువునా ముంచింది
ఒంగోలులోని మాస్టర్ మైండ్స్ డిఫెన్స్ అకాడమీ యాజమాన్యం తమను రూమ్‌లో నిర్బంధించి ఇబ్బందులకు గురిచేస్తోందని అక్కడ శిక్షణ పొందుతున్న అభ్యర్థులు వాపోయారు. తమ సమస్యలను చెప్పుకునేందుకు బయటకు రానీయకుండా గదిలో బంధించడంతో గోడ దూకి వచ్చామని పలువురు అభ్యర్థులు అధికారులకు తెలిపారు. మాస్టర్ మైండ్స్ అకాడమీలో ఆరు నెలల కోర్సు పూర్తిచేసిన వెంటనే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి 150 మందిని చేర్చుకున్నారని, అయితే తమకు ఉద్యోగాలు ఇవ్వకపోగా కోర్సు పూర్తయిందంటూ బలవంతంగా వెళ్లేగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు. కోర్సు ఫీజుగా ఒక్కో అభ్యర్థి నుంచి రూ.40 వేలు వసూలు చేశారని, తాము నష్టపోయామని తెలుసుకోవడంతో 150 మందికిగాను ప్రస్తుతం 65 మంది మాత్రమే ఉన్నామన్నారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ, ఎన్డీఏలో ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో.. కూలీనాలీ చేసుకుని బతికే తమ తల్లిదండ్రుల నుంచి రూ.40 వేలు తీసుకొచ్చి ఫీజులు చెల్లిస్తే యాజమాన్యం తమను మోసగించిందని వాపోయారు. తాము చెల్లించిన 40 వేల రూపాయాల్లో మెస్ ఫీజు మినహాయించుకుని మిగిలిన డబ్బు ఇప్పించాలని వేడుకున్నారు. తమ సమస్య మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన నాటి నుంచి తమతోపాటు మిగిలిన అభ్యర్థులను రూమ్‌లో బంధించారని, తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
దేవాదాయ భూమికి చెందిన చెరువులో నుంచి నీటిని తెచ్చుకోనీయకుండా అగ్ర కులస్తులు అడ్డుపడుతున్నారని నాగులుప్పలపాడు మండలం చేకూరపాడు ఎస్సీ కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. దేవాదాయ భూమిలోని చెరువు ఎండిపోయిన నేపథ్యంలో తాము అధికారులకు తమ గోడు చెప్పుకుని గుండ్లకమ్మ నుంచి నీటిని తెప్పించుకున్నామన్నారు. అయితే తమను చెరువు నుంచి నీటిని తెచ్చుకోనీయడం లేదన్నారు. చెరువులో ఉన్న బావిలోనూ నీటిని తోడుకునే హక్కు కూడా తమకు లేదంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. తమ కాలనీకి జలవాణి ద్వారా గత 70 రోజుల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారని, చెరువులో నీరు చేరడంతో 15 రోజుల నుంచి ట్యాంకర్లను ఆపివేశారన్నారు. ఎస్సీ కాలనీలో నివసిస్తున్న 150 కుటుంబాలు తాగునీటి కోసం అల్లాడిపోతున్నాయన్నారు. ఈ విషయాన్ని సర్పంచ్ ఎం.చిన్నయ్య దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాలనీలో అధిక శాతం కూలీనాలీ చేసుకుని బతుకుతున్నారని, ఒక్కో కుటుంబం రూ.13 పెట్టి బబుల్ నీళ్లు కొనాలంటే ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
చేయని నేరాల్ని ఒప్పుకోవాలని తుపాకీ బెదిరిస్తున్నారు
జీడి విత్తనాల §“ష్త్రöంగతనం కేసులో తమ భర్తలను పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లిన పోలీసులు చేయని నేరాల్ని కూడా వారిపై మోపి, ఒప్పుకోకపోతే చంపుతామని తుపాకీ నోట్లో పెట్టి మరీ బెదిరిస్తున్నారని ఇద్దరు మహిళలు వాపోయారు. బంధువులతో కలిసి వచ్చిన ఆ ఇద్దరు మహిళలు తమ భర్తలను పోలీసులు ఏవిధంగా చిత్రహింసలకు గురిచేస్తున్నారో ఉన్నతాధికారులకు వివరించి కన్నీటి పర్యంతమయ్యారు. వేటపాలెంలో మహాలక్ష్మయ్య, మస్తాన్ నివసిస్తున్నారు. ఇటీవల వీరు జీడి విత్తనాల చోరీ కేసులో ఇరుక్కున్నారు. వారితోపాటు మరో ముగ్గురిని పదమూడు రోజుల క్రితం వేటపాలెం పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే హత్యా నేరాలను ఒప్పుకోవాలంటూ పోలీసులు చిత్రహింసలకు గురి చేస్తున్నారని మహాలక్ష్మయ్య భార్య ఏసమ్మ, మస్తాన్ భార్య వెంకటేశ్వరమ్మ వాపోయారు. ‘చీరాల నుంచి పెద్దసారు వచ్చి తినే అన్నంలో పాన్‌పరాగ్ ఊయడంతోపాటు ఉచ్చ పోశార’ని అధికారులకు ఫిర్యాదు చేశారు. తమ భర్తలతోపాటు మరో ముగ్గురిని కూడా ఇదే మాదిరిగా పోలీసులు హింసిస్తున్నారని విలపించారు. తమ భర్తలను పోలీసులు ఏం చేస్తారో అని భయంగా ఉందని, వారిని విడిపించాలని వేడుకున్నారు.
మత్స్యకారులకు రూ.వెయ్యి పింఛను ఇవ్వాలి
సముద్రంలో వేట తప్ప ఇతరత్రా ఎలాంటి జీవనాధారం లేని 50 ఏళ్లు నిండిన మత్స్యకారులందరికీ 1000 రూపాయల చొప్పున పింఛను ఇవ్వాలని సముద్రతీర మత్స్యకార్మిక యూనియన్ జిల్లా నాయకులు కోరారు. జిల్లాలోని ç10 తీర ప్రాంత మండలాల్లో వేలాది మంది మత్స్యకారులు సముద్రంపై ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు. రోజుల తరబడి సముద్రంలో ఉండి వేట సాగించినప్పటికీ పెద్దగా ఆదాయం రావడం లేదని వాపోయారు. అనేక మంది మత్స్యకారులకు వయసు మీద పడే కొద్దీ వేట సాగించే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. కల్లు గీత కార్మికుల మాదిరిగా మత్స్యకారులకు రూ.1000 చొప్పున పింఛను ఇవ్వాలని వేడుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను సముద్రంలో వేట నిషేధించిన సమయంలో అందించే రూ.4 వేల జీవన భృతిని అర్హులైన మత్స్యకారులకు అందేలా చూడాలని కోరారు.