VVIP security
-
వీవీఐపీ భద్రతకు మహిళా కమెండోలు
న్యూఢిల్లీ: సుశిక్షితులైన కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం(సీఆర్పీఎఫ్)కు చెందిన తొలి మహిళా కమెండోల బృందం దేశంలోని వీవీఐపీలకు త్వరలో భద్రత కల్పించనుంది. హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ దంపతులు సహా పలువురు వీవీఐపీల భద్రతా బాధ్యతల్లో సీఆర్పీఎఫ్ మహిళా కమెండోలు పాలుపంచుకోనున్నారు. వీవీఐపీలు ఇంట్లో ఉన్నపుడు రక్షణ, నిఘా బాధ్యతలు చూస్తారు. త్వరలో 5 రాష్ట్రాల ఎన్నికల్లో అగ్రనేతలు పర్యటించినపుడు మహిళా కమెండోలు వీరి వెన్నంటే ఉండి బాధ్యతలు నిర్వర్తిస్తారు. మొత్తంగా 32 మందితో సిద్ధమైన కమెండోల దళాన్ని రంగంలోకి దింపనున్నారు. ఆయుధాలు లేకుండానే శత్రువుతో పోరాడటం, అన్ని రకాల ఆయుధాలను వాడే నైపుణ్యం, డేగ కళ్లతో చుట్టూరా చూస్తూ వీవీఐపీలకు పొంచి ఉన్న ముప్పును పసికట్టడం, భద్రత కల్పించడం తదతర అంశాల్లో వీరంతా 10 వారాల కఠోర శిక్షణను పూర్తిచేశారు. వచ్చే ఏడాది జనవరిలో వీరిని విధుల్లోకి తీసుకుంటారని సంబంధిత వర్గాలు బుధవారం వెల్లడించాయి. ముందుగా ఢిల్లీలో జెడ్+ కేటగిరీలో ఉన్న అమిత్, మన్మోహన్ దంపతులు తదితరుల రక్షణ బాధ్యతలను వీరికి అప్పగిస్తారు. రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లినపుడు వీవీఐపీలు బస చేసిన ఇంట్లో తనిఖీ బాధ్యతలు వీరివే. -
సుప్రీంకోర్టు అనూహ్య తీర్పు
న్యూఢిల్లీ: దేశరాజధానిలో విపరీతంగా పెరిగిపోతోన్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు చేస్తున్న అన్ని ప్రయత్నాలను సమర్థిస్తూ, డీజిల్ వాహనాలపై సైతం నిషేధం విధించిన సుప్రీంకోర్టు.. ఆ వాహనాలను మళ్లీ అనుమతిస్తూ శనివారం అనూహ్య తీర్పు ఇచ్చింది. ఢిల్లీ పోలీస్, ఢిల్లీ జలమండల్ లకు వాహనాల కొరత తీవ్రంగా ఉండటంతో 460 హెవీ డ్యూటీ డీజిల్ వాహనాలు కొనుగోలు చేసేందుకు అనుమతినిచ్చింది. దీంతో దాదాపు ఏడాదిన్నర తర్వాత ఢిల్లీ రోడ్లపై మళ్లీ డీజిల్ వాహనాలు దూసుకుపోనున్నాయి. వీవీఐపీల భద్రతతోపాటు విచారణ ఖైదీల తరలింపు, శాంతిభద్రతల పర్యవేక్షణకుగానూ పోలీస్ శాఖ 190 డీజిల్ వాహనాలు, నీటి సరఫరా కోసం జలమండలికి 290 ట్యాంకర్లు అవసరం ఉంది. ఈ మేరకు రూ.2000కోట్లతో ఆ వాహనాలు కొనుగోలుచేసేందుకు రంగం సిద్ధమైంది. అయితే ఢిల్లీలో డీజిల్ వెయికిల్స్ పై సుప్రీంకోర్టు నిషేధం విధించిన నేపథ్యంలో మళ్లీ కోర్టు అనుమతి తీసుకోవడం తప్పనిసరైంది. ఈ వాహనాలు సాధారణ డీజిల్ వాహనాలతో పోల్చుకుంటే తక్కువ కాలుష్యాన్ని వెదజల్లేవే అయినప్పటికీ ఢిల్లీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కాలుష్య నియంత్రణ మండలికి భారీ నష్టపరిహారాన్ని చెల్లించాలని పోలీస్ శాఖ, జలమండలిలను కోర్టు ఆదేశించింది. ఆ రెండు శాఖలు వాహనాల కొనుగోలుకు అయ్యే ఖర్చు (రూ.2000 కోట్ల)లో 30 శాతాన్ని(రూ.600 కోట్ల) పరిహారాన్ని చెల్లించనున్నాయి.