సుప్రీంకోర్టు అనూహ్య తీర్పు
న్యూఢిల్లీ: దేశరాజధానిలో విపరీతంగా పెరిగిపోతోన్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు చేస్తున్న అన్ని ప్రయత్నాలను సమర్థిస్తూ, డీజిల్ వాహనాలపై సైతం నిషేధం విధించిన సుప్రీంకోర్టు.. ఆ వాహనాలను మళ్లీ అనుమతిస్తూ శనివారం అనూహ్య తీర్పు ఇచ్చింది. ఢిల్లీ పోలీస్, ఢిల్లీ జలమండల్ లకు వాహనాల కొరత తీవ్రంగా ఉండటంతో 460 హెవీ డ్యూటీ డీజిల్ వాహనాలు కొనుగోలు చేసేందుకు అనుమతినిచ్చింది. దీంతో దాదాపు ఏడాదిన్నర తర్వాత ఢిల్లీ రోడ్లపై మళ్లీ డీజిల్ వాహనాలు దూసుకుపోనున్నాయి.
వీవీఐపీల భద్రతతోపాటు విచారణ ఖైదీల తరలింపు, శాంతిభద్రతల పర్యవేక్షణకుగానూ పోలీస్ శాఖ 190 డీజిల్ వాహనాలు, నీటి సరఫరా కోసం జలమండలికి 290 ట్యాంకర్లు అవసరం ఉంది. ఈ మేరకు రూ.2000కోట్లతో ఆ వాహనాలు కొనుగోలుచేసేందుకు రంగం సిద్ధమైంది. అయితే ఢిల్లీలో డీజిల్ వెయికిల్స్ పై సుప్రీంకోర్టు నిషేధం విధించిన నేపథ్యంలో మళ్లీ కోర్టు అనుమతి తీసుకోవడం తప్పనిసరైంది. ఈ వాహనాలు సాధారణ డీజిల్ వాహనాలతో పోల్చుకుంటే తక్కువ కాలుష్యాన్ని వెదజల్లేవే అయినప్పటికీ ఢిల్లీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కాలుష్య నియంత్రణ మండలికి భారీ నష్టపరిహారాన్ని చెల్లించాలని పోలీస్ శాఖ, జలమండలిలను కోర్టు ఆదేశించింది. ఆ రెండు శాఖలు వాహనాల కొనుగోలుకు అయ్యే ఖర్చు (రూ.2000 కోట్ల)లో 30 శాతాన్ని(రూ.600 కోట్ల) పరిహారాన్ని చెల్లించనున్నాయి.