నాన్న కారు డ్రైవర్...కూతురు ఎంబీఏ టాపర్
అమలాపురం, న్యూస్‌లైన్ : చదువులతల్లి వీవీవీడీఎస్ ప్రసన్నది సాధారణ కుటుంబం. ఆమె తండ్రి వెంకటేశ్వరరావు కారు డ్రైవర్. తల్లి రమాకుమారి గృహిణి. వారికి ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి ప్రసన్న. పెద్ద చదువులు చదివించాలంటే వారి ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే. అయినప్పటికీ ప్రసన్న మొక్కవోని దీక్షతో ఎంబీఏ ఫస్టియర్‌లో యూనివర్సిటీ టాపర్‌గా నిలిచింది. యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఈనెల 10న రాష్ట్ర గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకోనుంది. ప్రసన్న స్థానిక ఏఎస్ఎన్ పీజీ కళాశాలలో ఎంబీఏ చదువుతోంది. ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో గల 78 ఎంబీఏ కళాశాలలకు చెందిన 3,900 మంది విద్యార్థులు ఎంబీఏ తొలి సంవత్సరం పరీక్షలు రాయగా ప్రసన్న యూనివర్సిటీ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. సివిల్ పరీక్షలు రాసి విజయం సాధించాలని పట్టుదలతో చదువుతున్నానని ప్రసన్న చెబుతోంది. ప్రసన్నను ఏఎస్ఎన్ పీజీ కళాశాల అధినేత యేడిద రామనాథశాస్త్రి, ప్రిన్సిపాల్ ఎం.అరుణకుమార్, రెసిడెంట్ డెరైక్టర్ జి.ఫణిరాజా అభినందించారు.