W Fi
-
సమాఖ్య రాజకీయాల్లో పావులు కావద్దు
► సుశీల్, నర్సింగ్లకు కోర్టు సూచన ► రేపటికి విచారణ వాయిదా న్యూఢిల్లీ: ఒలింపిక్స్ క్రీడల్లో ఎవరు పాల్గొనాలనే కారణంతో భారత స్టార్ రెజ్లర్లు సుశీల్ కుమార్, నర్సింగ్ యాదవ్ రచ్చకెక్కడం విచారించదగ్గ విషయమని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. వీరిద్దరు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్ఐ) రాజకీయంలో పావులు కాకూడదని హితవు పలికింది. దేశానికి గౌరవ ప్రతిష్టలు అందించిన ఈ రెజ్లర్లకు అసలు తామేం చేస్తున్నామో అర్థమవుతోందా? అని జస్టిస్ మన్మోహన్ ప్రశ్నించారు. ‘ఈ పరిస్థితికి సమాఖ్యలో నెలకొన్న రాజకీయాలే కారణం. అందుకే వీరిద్దరు అధికారుల చేతిలో పావులు కారాదు. సుశీల్, నర్సింగ్ అంతర్జాతీయ స్థాయి రెజ్లర్లు. వీరి విషయంలోనే ఇలా జరగడం షాకింగ్‌గా అనిపిస్తోంది’ అని జస్టిస్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతకుముందు జరిగిన విచారణలో... దేశానికి ఒలింపిక్ బెర్త్ అందించిన అథ్లెటే పోటీలకు వెళతాడని, గతంలో కూడా ఇలాగే జరిగిందని నర్సింగ్ కౌన్సిల్ వాదించారు. అయితే 74 కేజీ విభాగంలో సెలక్షన్ ట్రయల్స్‌ను గతేడాది ఎందుకు నిర్వహించారని, ప్రపంచ చాంపియన్‌షిప్ సెప్టెంబర్‌లో జరిగిందని, ఆ నెలలోపు జరపాల్సిందని సుశీల్ కూమార్ తరపు న్యాయవాది వాదించారు. మరోవైపు తదుపరి విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. -
నర్సింగ్ యాదవే అర్హుడు
ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన రెజ్లింగ్ సమాఖ్య న్యూఢిల్లీ: స్టార్ రెజ్లర్లు సుశీల్ కుమార్, నర్సింగ్ యాదవ్‌ల విషయంలో కొన్ని రోజులుగా కొనసాగుతున్న వివాదానికి భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్ఐ) ముగింపు పలికేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో 74 కేజీ ఫ్రీస్టయిల్ విభాగంలో రియో ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు సుశీల్కన్నా నర్సింగ్ యాదవే అర్హుడని ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. గత రెండేళ్లుగా నర్సింగ్‌ను ట్రయల్స్‌లో ఎదుర్కొనేందుకు సుశీల్ కావాలనే తప్పించుకుంటున్నట్టు పేర్కొంది. గతేడాది జరిగిన ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన నర్సింగ్ యాదవ్ భారత్‌కు ఒలింపిక్ బెర్త్ సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇదే విభాగం నుంచి తాను ఒలింపిక్స్‌కు వెళతానని, గతంలో పతకం సాధించిన సుశీల్ కుమార్ వాదిస్తున్నాడు. ట్రయల్స్ నిర్వహించాలంటూ కోర్టుకెక్కాడు. ‘భారత్ తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు నర్సింగ్‌ను ఉత్తమ రెజ్లర్‌గా మేం భావిస్తున్నాం. ఈ నిర్ణయం పూర్తి పారదర్శకంగా జరిగింది. ఈ విషయంలో ఎవరికీ అనుకూలంగా, వ్యతిరేకంగా ప్రవర్తించలేదు. 2006 నుంచే నర్సింగ్ యాదవ్ 74కేజీ విభాగంలో మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఒలింపిక్స్‌లో పాల్గొనబోయే 18 మంది రెజ్లర్లలో నర్సింగ్ ఇప్పటికే ఆరుగురిని ఓడించాడు. సుశీల్ 2014 వరకు కూడా 66కేజీ విభాగంలోనే పోటీపడ్డాడు’ అని కోర్టుకు సమర్పించిన తమ అఫిడవిట్లో డబ్ల్యుఎఫ్ఐ పేర్కొంది. మరోవైపు ఈ సమయంలో వీరి మధ్య ట్రయల్స్ నిర్వహిస్తే క్వాలిఫికేషన్ ఈవెంట్ అర్థంలేనిదవుతుందని నర్సింగ్ యాదవ్ తరపు న్యాయవాది నిదేష్ గుప్తా తెలిపారు. మరోవైపు సుశీల్ కుమార్ దేశంలో అత్యుత్తమ రెజ్లర్ అని, తను ఒలింపిక్స్‌లో పాల్గొంటేనే పతకంపై ఆశలు పెట్టుకోవచ్చని అతడి తరపు న్యాయవాది అమిత్ సిబల్ వాదించారు. అందుకే ఎలాంటి అనుమానాలకు తావీయకుండా ఇద్దరి మధ్య ట్రయల్స్ నిర్వహించాలని కోరారు. ఇరువురి వాదనలు విన్న అనంతరం కోర్టు విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది