నర్సింగ్ యాదవే అర్హుడు
ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన రెజ్లింగ్ సమాఖ్య
న్యూఢిల్లీ: స్టార్ రెజ్లర్లు సుశీల్ కుమార్, నర్సింగ్ యాదవ్‌ల విషయంలో కొన్ని రోజులుగా కొనసాగుతున్న వివాదానికి భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) ముగింపు పలికేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో 74 కేజీ ఫ్రీస్టయిల్ విభాగంలో రియో ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు సుశీల్‌కన్నా నర్సింగ్ యాదవే అర్హుడని ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. గత రెండేళ్లుగా నర్సింగ్‌ను ట్రయల్స్‌లో ఎదుర్కొనేందుకు సుశీల్ కావాలనే తప్పించుకుంటున్నట్టు పేర్కొంది. గతేడాది జరిగిన ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన నర్సింగ్ యాదవ్ భారత్‌కు ఒలింపిక్ బెర్త్ సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇదే విభాగం నుంచి తాను ఒలింపిక్స్‌కు వెళతానని, గతంలో పతకం సాధించిన సుశీల్ కుమార్ వాదిస్తున్నాడు. ట్రయల్స్ నిర్వహించాలంటూ కోర్టుకెక్కాడు. ‘భారత్ తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు నర్సింగ్‌ను ఉత్తమ రెజ్లర్‌గా మేం భావిస్తున్నాం.
ఈ నిర్ణయం పూర్తి పారదర్శకంగా జరిగింది. ఈ విషయంలో ఎవరికీ అనుకూలంగా, వ్యతిరేకంగా ప్రవర్తించలేదు. 2006 నుంచే నర్సింగ్ యాదవ్ 74కేజీ విభాగంలో మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఒలింపిక్స్‌లో పాల్గొనబోయే 18 మంది రెజ్లర్లలో నర్సింగ్ ఇప్పటికే ఆరుగురిని ఓడించాడు. సుశీల్ 2014 వరకు కూడా 66కేజీ విభాగంలోనే పోటీపడ్డాడు’ అని కోర్టుకు సమర్పించిన తమ అఫిడవిట్‌లో డబ్ల్యుఎఫ్‌ఐ పేర్కొంది. మరోవైపు ఈ సమయంలో వీరి మధ్య ట్రయల్స్ నిర్వహిస్తే క్వాలిఫికేషన్ ఈవెంట్ అర్థంలేనిదవుతుందని నర్సింగ్ యాదవ్ తరపు న్యాయవాది నిదేష్ గుప్తా తెలిపారు.
మరోవైపు సుశీల్ కుమార్ దేశంలో అత్యుత్తమ రెజ్లర్ అని, తను ఒలింపిక్స్‌లో పాల్గొంటేనే పతకంపై ఆశలు పెట్టుకోవచ్చని అతడి తరపు న్యాయవాది అమిత్ సిబల్ వాదించారు. అందుకే ఎలాంటి అనుమానాలకు తావీయకుండా ఇద్దరి మధ్య ట్రయల్స్ నిర్వహించాలని కోరారు. ఇరువురి వాదనలు విన్న అనంతరం కోర్టు విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది