ముంబై: నాలుగేళ్ల క్రితం రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించినా... చివరి నిమిషంలో అనుమానాస్పదరీతిలో డోపింగ్‌లో పట్టుబడిన భారత స్టార్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌పై విధించిన నాలుగేళ్ల నిషేధం గడువు ముగిసింది. ఈ మేరకు ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నుంచి 30 ఏళ్ల నర్సింగ్‌కు అధికారికంగా ఈ–మెయిల్ ద్వారా సమాచారం వచ్చింది. దాంతో మహారాష్ట్రకు చెందిన నర్సింగ్ యాదవ్ రెజ్లింగ్ కెరీర్‌కు కొత్త ఊపిరి వచ్చింది. ఈ ఏడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ వచ్చే సంవత్సరానికి వాయిదా పడటంతో నర్సింగ్‌కు మళ్లీ ఒలింపిక్స్‌లో పాల్గొనే ద్వారాలు తెరుచుకున్నాయి. ‘గత శనివారం నాకు ‘వాడా’ నుంచి నా నిషేధం గడువు ముగిసినట్లు మెయిల్ వచ్చింది. ఇక నుంచి భవిష్యత్‌లో జరిగే అన్ని రెజ్లింగ్ టోర్నమెంట్‌లలో పాల్గొనేందుకు నాకు అర్హత ఉంది. (ఆర్‌సీబీతోనే నా ప్రయాణం)
74 కేజీల విభాగంలో నిర్వహించే జాతీయ శిక్షణ శిబిరానికి తన పేరును కూడా పరిగణనలోకి తీసుకోవాలని భారత రెజ్లింగ్ సమాఖ్యకు నేను లేఖ రాశాను’ అని నర్సింగ్ తెలిపాడు. ఈ ఏడాది డిసెంబర్‌లో సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌లో జరిగే ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యంగా ప్రాక్టీస్ మొదలుపెడతానని నర్సింగ్ పేర్కొన్నాడు. ‘నా జీవితలక్ష్యం ఒలింపిక్ పతకం సాధించడమే. ఒలింపిక్ పతకం సాధిస్తేనే నా కథకు సరైన ముగింపు లభించినట్టు. ఒలింపిక్ పతకం నెగ్గేందుకు మరో అవకాశం లభించడం నా తలరాతలో రాసి పెట్టుందనే నమ్ముతున్నాను’ అని నర్సింగ్ అన్నాడు. నర్సింగ్ రాకతో 74 కేజీల విభాగం మళ్లీ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికైతే టోక్యో ఒలింపిక్స్‌కు భారత్ నుంచి 74 కేజీల విభాగంలో ఎవరూ బెర్త్ సాధించలేదు. ఈ బెర్త్ రేసులో మరో స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్, జితేందర్, ప్రవీణ్ రాణాలతో కలిసి నర్సింగ్ కూడా చేరాడు.
2015 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నర్సింగ్ 74 కేజీల విభాగంలో కాంస్యం సాధించడంతో 2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. వాస్తవానికి ఈ విభాగంలోనే బరిలో ఉన్న రెండు ఒలింపిక్స్ పతకాల విజేత సుశీల్ కుమార్ గాయం కారణంగా 2015 ప్రపంచ చాంపియన్‌షిప్‌కు దూరంగా ఉన్నాడు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) నిబంధనల ప్రకారం తొలుత ఒలింపిక్స్‌కు అర్హత పొందిన వారే ఎలాంటి ట్రయల్స్ లేకుండా ఒలింపిక్స్‌లో పాల్గొనవచ్చు. కానీ తాను గాయం కారణం గా ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అందుబాటులో లేనని... రియో ఒలింపిక్స్‌కు ఎవరిని పంపించాలనే నిర్ణయం తనకు, నర్సింగ్‌కు మధ్య ట్రయల్ బౌట్ నిర్వహించి తీసుకోవాలని సుశీల్ కోరాడు. కానీ సుశీల్ విన్నపాన్ని డబ్ల్యూఎఫ్‌ఐ తోసిపుచ్చి నర్సింగ్‌కే రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అర్హత ఉందని స్పష్టం చేసింది. అయితే రియో ఒలింపిక్స్‌కు రెండు వారాలు ఉన్నాయనగా నర్సింగ్ డోపింగ్‌లో పట్టుబడటం, అతనిపై నిషేధం విధించడం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment