కనీసం టీ కూడా తాగడం లేదు..
వారణాసి:గత కొన్ని రోజులుగా డోపింగ్ వివాదంలో చిక్కుకున్న భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్కు ఉపశమనం లభించడంతో వారణాసిలో అతని ఇంటి వద్ద పండుగ వాతావారణం నెలకొంది. గత నెల్లో నర్సింగ్ పై వెలుగు చూసిన డోపింగ్ వివాదానికి జాతీయ డోపింగ్ ఏజెన్సీ(నాడా) ఎట్టకేలకు పుల్ స్టాప్ పెడుతూ క్లియరెన్స్ ఇవ్వడంతో అతని నివాసం సందడిగామారింది. పలువురు అభిమానులు స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకోగా, నర్సింగ్ యాదవ్ తల్లి భూల్నా దేవి ఆనందం వ్యక్తం చేశారు. నర్సింగ్ పై వచ్చిన డోపింగ్ ఆరోపణల్ని కొట్టిపారేసిన తల్లి.. ఈ వివాదం అనంతరం తన కుమారుడు కనీసం టీ కూడా తాగడం లేదన్నారు. నర్సింగ్ జీవితంలో అతి పెద్ద దుమారం రేపిన డోపింగ్ ఘటన తరువాత అతను దాదాపు అన్ని అలవాట్లను వదిలేసుకున్నాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
సోమవారం సాయంత్రం నర్సింగ్ కు డోపింగ్ వివాదంలో క్లీన్ చిట్ ఇస్తూ నాడా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అతను రియో ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు మార్గం సుగుమం అయ్యింది. నాడా-2015 యాంటీ కాపీయింగ్ నిబంధనల్లోని ఆర్టికల్ 10.4 ప్రకారం నర్సింగ్ కు ఉపశమనం లభించింది. దీంతో భారత్ నుంచి 74 కేజీల రెజ్లింగ్ విభాగంలో నర్సింగ్ ప్రాతినిథ్యం షురూ అయ్యింది.