నర్సింగ్పై కుట్రలో సుశీల్ హస్తం!
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్లో పాల్గొననున్న రెజ్లర్ నర్సింగ్ యాదవ్ భారత డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) డోప్ టెస్టుల్లో పట్టుబడిన తర్వాత తెరమీదకు కొత్త అంశాలు వస్తున్నాయి. డోప్ టెస్టులో పట్టబడ్డ నర్సింగ్ సోదరుడు వినోద్ యాదవ్ ఈ వివాదంపై తీవ్రంగా స్పందించాడు. ఇదంతా మరో రెజ్లర్ సుశీల్ కుమార్, అతని సన్నిహితులు పన్నిన కుట్ర అని ఆరోపించాడు.
సోనెపాట్ లోని సాయ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటున్న నర్సింగ్ తినే ఆహారంలో కావాలనే సుశీల్కు సంబంధించిన వ్యక్తులు ఏదైనా కలిపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. సాయ్ సెంటర్లో వంటలు చేసే వ్యక్తి సుశీల్ కుమార్ ప్రాక్టీస్ చేసే బృందానికి చెందిన వాడని, దీనిపై సుశీల్ హస్తం ఉంటుందని జాతీయ మీడియాకు వెల్లడించాడు. ఈ కుట్ర పన్నింది కచ్చితంగా సుశీల్ తరఫు వ్యక్తులేనని మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయని నర్సింగ్ సోదరుడు వినోద్ పేర్కొన్నాడు. మరోవైపు నర్సింగ్ స్థానంలో మరో రెజ్లర్ ప్రవీణ్ రాణాను రియోకు పంపించాలని భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ నిర్ణయించారు.