రెజ్లర్ నర్సింగ్కు ఊరట
రెజ్లర్ నర్సింగ్కు ఊరట
Published Mon, Aug 1 2016 5:44 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM
న్యూఢిల్లీ: డోపింగ్ వివాదంలో ఇరుక్కున భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ కు ఊరట లభించింది . గత కొన్ని రోజులుగా నర్సింగ్ చుట్టూ అలుముకున్న డోపింగ్ వివాదానికి జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ(నాడా) ఎట్టకేలకు పుల్ స్టాప్ పెట్టింది. డోపింగ్ వ్యవహారంలో నర్సింగ్ కు క్లీన్ చిట్ ఇస్తూ నాడా తుది నిర్ణయం తీసుకుంది. నాడా-2015 యాంటీ కాపీయింగ్ నిబంధనల్లోని ఆర్టికల్ 10.4 ప్రకారం నర్సింగ్ కు అవకాశం కల్పించింది. దీంతో రియో ఒలింపిక్స్లో 74 కేజీల రెజ్లింగ్ విభాగంలో నర్సింగ్ పాల్గొనేందుకు దాదాపు లైన్ క్లియరయ్యింది.
ఈ మేరకు తుది నిర్ణయాన్ని సోమవారం సాయంత్ర ప్రకటించిన నాడా.. డోపింగ్ వివాదంలో నర్సింగ్ తప్పిదం లేదని పేర్కొంది. ఎవరో చేసిన కుట్రకు నర్సింగ్ బలయ్యాడని స్పష్టం చేసింది. ఈ విషయంలో అసలు నర్సింగ్ ప్రమేయం లేదని నమ్మిన కారణంగానే అతనికి క్లీన్ చిట్ ఇచ్చినట్లు నాడా డైరెక్టర్ నవీన్ అగర్వాల్ తెలిపారు. అయితే ఈ విషయాన్ని వాడా (వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) కి నాడా నివేదించనుంది.
గత నెల్లో నర్సింగ్ పై డోపింగ్ వివాదం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. గత నెల 5న హరియాణాలోని సోనేపట్ భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో నర్సింగ్‌కు డోపింగ్ పరీక్ష నిర్వహించగా అతను నిషేధిత ఉత్ప్రేరకం మెథాన్‌డైనన్ వాడినట్లు తేలింది. అయితే దీనిపై నర్సింగ్ పలు ఆరోపణలు చేశాడు. తనను కావాలనే కుట్రలో ఇరికించారని పేర్కొన్నాడు. దీనిలో భాగంగా నాడాను ఆశ్రయించాడు. ఇప్పటికే నర్సింగ్ యాదవ్ వాదనలను పలుమార్లు విన్న నాడా చివరకు అతనికి ఊరటనిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ డోపింగ్ వివాదాన్ని భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్యూఎఫ్ఐ)కూడా సీరియస్ గా తీసుకుని నర్సింగ్ కు మద్దతుగా నిలిచింది.
Advertisement