భారత స్టార్ రెజ్లర్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పునియాకు భారీ షాక్ తగిలింది. డోపింగ్ టెస్ట్ కోసం శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించినందుకు పునియాను నాలుగేళ్లపాటు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) సస్పెండ్ చేసింది. నాడా యాంటీ డోపింగ్ నిబంధనలలోని ఆర్టికల్ 10.3.1ని ఉల్లంఘించిన కారణంగా పూనియాపై వేటు పడింది.
అసలేం జరిగిందంటే?
ఈ ఏడాది మార్చి 10న జాతీయ జట్టుకు ఎంపిక కోసం జరిగిన సెలక్షన్ ట్రయల్స్‌లో బజరంగ్ పునియా తన యూరిన్ శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో ఇదే నేరానికి సంబంధించి నాడా ఈ ఏడాది ఏప్రిల్ 23న బజరంగ్ పునియాను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ప్రపంచ రెజ్లింగ్ గవర్నింగ్ బాడీ (UWW) కూడా బజరంగ్‌పై నిషేధం విధించింది.
ఈ క్రమంలో బజరంగ్ ఎందుకు శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించాడో వివరణ కోరుతూ నోటీసు ఇవ్వమని ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ.. నాడాకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నాడా ఏప్రిల్ 26లోపు తన వివరణ ఇవ్వాలని పూనియాకు నోటీసు జారీ చేసింది.
అందుకు పూనియా స్పందించలేదు. అయితే నాడా మే 7లోపు వివరణ ఇవ్వాలని మళ్లీనోటీసు జారీ చేసింది. ఆ నోటీసులకు కూడా పూనియా సమాధానమివ్వలేదు. దీంతో ఈ ఏడాది మేలో నాడా అతడిపై తాత్కాలిక నిషేదం విధించింది.
అయితే నాడా నోటిసులకు స్పందించని బజరంగ్ పూనియా.. నాడా యాంటీ డిసిప్లినరీ డోపింగ్ ప్యానెల్ (ADDP)కు మాత్రం తన వివరణ ఇచ్చాడు. పరీక్షల కోసం నాడా అధికారులు గడువు దాటిన కిట్‌లను వాడడంతోనే నమూనాలను ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు. దీంతో మే 31న బజరంగ్‌పై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) విధించిన సస్పెన్షన్‌ను నాడా క్రమశిక్షణ సంఘం (ఏడీడీపీ) తాత్కాలికంగా ఎత్తివేసింది.
కాగా ఈ ఏడాది జూన్ 23న మరోసారి నాడా బజరంగ్ పునియాకు నోటీసులు ఇచ్చింది. జూలై 11 లోపు వివరణ ఇవ్వాలని నోటీసులో నాడా పేర్కొంది. ఈసారి మాత్రం తనపై వచ్చిన ఆరోపణలకు బజ్‌రంగ్ జులై 11న వ్రాతపూర్వకంగా సమాధనమిచ్చాడు. ఆ తర్వాత సెప్టెంబరు 20, అక్టోబరు 4న భజరంగ్ వివాదంపై ఏడీడీపీ ప్యానల్ విచారణ చేపట్టింది. ఈ విచారణలో అతడు డోపింగ్ నిబంధలు ఉల్లంఘించినట్లు ఏడీడీపీ గుర్తించింది. ఈ క్రమంలోనే అతడిపై నాడా నాలుగేళ్ల పాటు నిషేదం విధించింది.
Comments
Please login to add a commentAdd a comment