నర్సింగ్ యాదవ్ పై కుట్ర పన్నారు: కోచ్ జగ్మల్
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ నేపథ్యంలో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా) జరిపిన డోపింగ్ టెస్టుల్లో నర్సింగ్ యాదవ్ నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు కథనాలు రావడం కుట్ర పూరిత చర్యల్లో భాగమేనని అతని కోచ్ జగ్మల్ సింగ్ మండిపడ్డాడు. నర్సింగ్ యాదవ్ రియో అవకాశాలు దెబ్బతీయాలని ఇలాంటివి చేస్తున్నారని ఆయన ఆరోపించాడు.
నర్సింగ్ పరువు తీసి, అతన్ని వెనక్కి తగ్గేలా చేయడంలో భాగమే ఈ వార్తలని ఆయన విమర్శించారు. అసలు ఏం జరగుతుందో తమకు అర్థం కావడంలేదని, నర్సింగ్ ఎలాంటి నిషిద్ద ఉత్ప్రేరకాలు వాడలేదని జగ్మల్ సింగ్ వివరించాడు. తొలుత సుశీల్ కుమార్ తో రియో బెర్త్ కోసం వివాదాలు, ఇప్పుడు డోపింగ్ వివాదం నర్సింగ్ ను చుట్టుముట్టడం నిజంగా బాధాకరమన్నాడు. నర్సింగ్ యాదవ్ మొదట 'ఏ' శాంపిల్ టెస్టులో పాజిటివ్ రావడంతోపాటు రెండోసారి నిర్వహించిన 'బి' శాంపిల్ టెస్టుల్లో కూడా పాజిటివ్ నివేదిక వచ్చినట్లు మీడియాలో కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే.