
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు సోమవారం సీబీఐని తలంటింది. రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌ను రియో ఒలింపిక్స్ (2016)లో పాల్గొనకుండా డోపీగా మార్చిన ఉదంతంపై విచారణ ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించింది. ‘రియో’కు అర్హత పొందిన నర్సింగ్‌ను మెగా ఈవెంట్ నుంచి తప్పించాలనే దురుద్దేశంతో కొందరు అతను తినే ఆహారంలో డ్రగ్స్ కలిపినట్లు ఆరోపణలొచ్చాయి. ఏదేమైనా డోపీ మరకతో నర్సింగ్ చివరి నిమిషంలో ఒలింపిక్స్‌కు దూరమయ్యాడు. అనంతరం న్యాయపోరాటం చేస్తున్నాడు.
దీనిపై సీబీఐ విచారణ చేపట్టినప్పటికీ ఇంతవరకూ అతీగతీ లేకుండా ఉంది. దీంతో సీబీఐ తీరుపట్ల హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు విచారణ ఎప్పటికీ పూర్తి చేస్తారని, దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో తదుపరి కోర్టు విచారణ జరిగే ఫిబ్రవరి 1వ తేదీకల్లా తెలపాలని జస్టిస్ నజ్మీ వాజిరి ఆదేశించారు. ‘ఇప్పటి వరకు ఏం చేశారు. రెండున్నరేళ్లు గడుస్తున్నా ఎందుకు చర్యలు చేపట్టలేదు. ఇది సీబీఐ అనుకుంటున్నారా లేక మరేదైనా ఏజెన్సీనా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెజ్లింగ్, బాక్సింగ్ క్రీడాకారుల కెరీర్ నాశనమవడం భారత క్రీడల ప్రగతికి చేటని జస్టిస్ నజ్మీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment