న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో ఏర్పడిన సంక్లిష్ట పరిస్థితులు భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌కు కొత్త ఊపిరినిచ్చాయి. నాలుగేళ్ల క్రితం రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించి... చివరి నిమిషంలో డోపింగ్ కారణంగా ఈ విశ్వ క్రీడల నుంచి నర్సింగ్ తప్పుకోవాల్సి వచ్చింది. డోపింగ్‌లో పట్టుబడినందుకు ఈ మహారాష్ట్ర రెజ్లర్‌పై నాలుగేళ్ల నిషేధం విధించారు. కరోనా వైరస్ లేకపోయి ఉంటే ఈపాటికి 2020 టోక్యో ఒలింపిక్స్ ముగిసేవి. నిషేధం కారణంగా నర్సింగ్ ఒలింపిక్ ఆశలు ఆవిరయ్యేవి. కానీ కరోనా మహమ్మారితో టోక్యో ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. నర్సింగ్‌పై గత నెలాఖర్లో నాలుగేళ్ల నిషేధం కూడా ముగిసింది. దాంతో అతని ఒలింపిక్ ఆశలు సజీవమయ్యాయి. నిషేధం గడువు పూర్తి కావడంతో సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు హరియాణాలోని సోనెపట్‌లో మొదలయ్యే జాతీయ రెజ్లింగ్ శిబిరంలో తనకూ చోటు కల్పించాలని 31 ఏళ్ల నర్సింగ్ యాదవ్ చేసిన విన్నపాన్ని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మన్నించింది.
జాతీయ శిబిరానికి నర్సింగ్ హాజరు కావొచ్చంటూ అనుమతించింది. టోక్యో ఒలింపిక్స్‌కు భారత్ నుంచి ఇప్పటిదాకా పురుషుల ఫ్రీస్టయిల్ 74 కేజీల విభాగంలో ఎవరూ అర్హత సాధించలేదు. ఈ బెర్త్ కోసం ప్రస్తుతం స్టార్ రెజ్లర్, రెండు ఒలింపిక్ పతకాల విజేత సుశీల్‌కుమార్, జితేందర్, ప్రవీణ్ రాణా రేసులో ఉన్నారు. తాజాగా వీరి సరసన నర్సింగ్ యాదవ్ కూడా చేరాడు. ఫలితంగా 74 కేజీల విభాగంలో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో భారత్ తరఫున ఎవరు ప్రాతినిధ్యం వహించాలో తేల్చేందుకు తప్పనిసరిగా ట్రయల్స్ నిర్వహించే పరిస్థితి ఏర్పడింది. దాంతో 2016లో వివాదానికి కేంద్ర బిందువైన సుశీల్ కుమార్‌తో నర్సింగ్ యాదవ్ మళ్లీ ‘ఢీ’కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ‘డోపింగ్ విషయంలో భవిష్యత్‌లో చాలా జాగ్రత్తగా ఉంటానంటూ నర్సింగ్ హామీ ఇచ్చాడు. అతనిపై నిషేధం కూడా ముగిసింది. టోక్యో ఒలింపిక్స్ కోసం శిక్షణ పొందేందుకు నర్సింగ్‌కు కూడా అర్హత ఉంది. 74 కేజీల విభాగంలో భారత్‌కు ఇంకా బెర్త్ లభించలేదు. ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ కోసం ట్రయల్స్ నిర్వహిస్తాం. ఇందులో సుశీల్‌తోపాటు నర్సింగ్ ఇతర రెజ్లర్లు పాల్గొనాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సుశీల్, నర్సింగ్ మధ్య బౌట్ జరిగే అవకాశం కూడా ఉంది’ అని డబ్ల్యూఎఫ్‌ఐ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్ తెలిపారు.
నాడు ఏం జరిగిందంటే....
భారత రెజ్లింగ్ సమాఖ్య నిబంధనల ప్రకారం... ప్రపంచ చాంపియన్‌షిప్ ద్వారా ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన వారు ఎలాంటి ట్రయల్స్ లేకుండా ఒలింపిక్స్‌లో పాల్గొనే వీలుంది. 2015 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 74 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గి నర్సింగ్ యాదవ్ 2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. అయితే గాయం కారణంగా తాను 2015 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనలేకపోయానని... రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఎవరు ప్రాతినిధ్యం వహించాలో తనకు, నర్సింగ్‌కు మధ్య సెలెక్షన్ ట్రయల్స్ బౌట్ నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని ఆనాడు సుశీల్ కుమార్ డబ్ల్యూఎఫ్‌ఐను డిమాండ్ చేశాడు.
అయితే సుశీల్ డిమాండ్‌ను రెజ్లింగ్ సమాఖ్య తోసిపుచ్చి నర్సింగ్‌నే రియో ఒలింపిక్స్‌కు పంపించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై సుశీల్ కోర్టుకెళ్లినా ఫలితం లేకపోయింది. అయితే రియో ఒలింపిక్స్‌కు వారం రోజులముందు నర్సింగ్ యాదవ్ డోపింగ్‌లో పట్టుబడటం... నర్సింగ్‌పై కావాలనే సుశీల్ వర్గం కుట్ర చేసిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై సీబీఐ విచారణ చేపట్టినా సుశీల్‌కుమార్ కుట్ర చేశాడని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కేసును కొట్టివేశారు.
Comments
Please login to add a commentAdd a comment