సమాఖ్య రాజకీయాల్లో పావులు కావద్దు
► సుశీల్, నర్సింగ్‌లకు కోర్టు సూచన
► రేపటికి విచారణ వాయిదా
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ క్రీడల్లో ఎవరు పాల్గొనాలనే కారణంతో భారత స్టార్ రెజ్లర్లు సుశీల్ కుమార్, నర్సింగ్ యాదవ్ రచ్చకెక్కడం విచారించదగ్గ విషయమని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. వీరిద్దరు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) రాజకీయంలో పావులు కాకూడదని హితవు పలికింది. దేశానికి గౌరవ ప్రతిష్టలు అందించిన ఈ రెజ్లర్లకు అసలు తామేం చేస్తున్నామో అర్థమవుతోందా? అని జస్టిస్ మన్‌మోహన్ ప్రశ్నించారు. ‘ఈ పరిస్థితికి సమాఖ్యలో నెలకొన్న రాజకీయాలే కారణం. అందుకే వీరిద్దరు అధికారుల చేతిలో పావులు కారాదు. సుశీల్, నర్సింగ్ అంతర్జాతీయ స్థాయి రెజ్లర్లు.
వీరి విషయంలోనే ఇలా జరగడం షాకింగ్‌గా అనిపిస్తోంది’ అని జస్టిస్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతకుముందు జరిగిన విచారణలో... దేశానికి ఒలింపిక్ బెర్త్ అందించిన అథ్లెటే పోటీలకు వెళతాడని, గతంలో కూడా ఇలాగే జరిగిందని నర్సింగ్ కౌన్సిల్ వాదించారు. అయితే 74 కేజీ విభాగంలో సెలక్షన్ ట్రయల్స్‌ను గతేడాది ఎందుకు నిర్వహించారని, ప్రపంచ చాంపియన్‌షిప్ సెప్టెంబర్‌లో జరిగిందని, ఆ నెలలోపు జరపాల్సిందని సుశీల్ కూమార్ తరపు న్యాయవాది వాదించారు. మరోవైపు తదుపరి విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది.