రియోత్సవం ముగిసింది
ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి ముందు ఎన్నో సందేహాలు... ఆర్థికంగా చితికిపోయిన దేశం ఇంత పెద్ద క్రీడలను ఎలా నిర్వహిస్తుందనే అనుమానాలు... జికా వైరస్, దోపిడిలతో అవాంతరాలు... కానీ బ్రెజిల్ వీటన్నింటినీ అధిగమించింది. దక్షిణ అమెరికా ఖండంలో తొలిసారి ఒలింపిక్స్ క్రీడా సంబరాన్ని అత్యంత ఘనంగా నిర్వహించింది. ప్రారంభవేడుకలను మరిపించేలా ముగింపు వేడుకలు కూడా అదిరిపోయాయి. తమ దేశ చరిత్ర, భిన్నత్వంలో ఏకత్వాన్ని కళ్లకు కట్టినట్టుగా కళాకారులు తమ ప్రదర్శన ద్వారా చూపారు. రియో ఒలింపిక్ పతాకాన్ని 2020లో గేమ్స్ జరిగే టోక్యో గవర్నర్‌కు అందివ్వడంతో అధికారికంగా ఒలింపిక్స్ ముగిశాయి.
≈ అట్టహాసంగా ఒలింపిక్స్ ముగింపు వేడుకలు
≈ 2020లో టోక్యోలో క్రీడలు
రియో డి జనీరో: పదిహేడు రోజుల పాటు దిగ్గజ ఆటగాళ్ల విన్యాసాలతో పాటు కొత్తచాంపియన్లను అందించిన ఒలింపిక్స్ క్రీడలు ఘనంగా ముగిశాయి. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ 31వ గేమ్స్ ముగింపు వేడుకలు విశ్వ క్రీడాభిమానులను మరోసారి ఆకట్టుకున్నాయి. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ షోలో కళ్లు మిరుమిట్లు గొలిపే బాణసంచా వెలుగులకు తోడు కళాకారుల అబ్బుర పరిచే విన్యాసాలతో ప్రఖ్యాత మరకానా స్టేడియంలో ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. ఓ వైపు వర్షం కురుస్తున్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా వేడుకలు కొనసాగాయి. అథ్లెట్లు కూడా రెయిన్‌కోట్స్, గొడుగులు పట్టుకుని స్టేడియంలో కనిపించారు.
నృత్యాలు చేస్తూ సెల్ఫీస్ తీసుకుంటూ సందడి చేశారు. అయితే స్టేడియంలో ప్రేక్షకులు మాత్రం 70 శాతం మాత్రమే హాజరయ్యారు. 42 విభాగాల్లో 207 దేశాల నుంచి 11,544 మంది అథ్లెట్లు పాల్గొన్న రియో గేమ్స్ ముగిసినట్టుగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ అధికారికంగా ప్రకటించారు. 2020లో 32వ క్రీడా సంబరాలు జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతాయి. ఈమేరకు ఒలింపిక్ పతాకాన్ని టోక్యో గవర్నర్ యురికో కొయికేకు అందించారు.
ముగింపు ఉత్సవం హైలైట్స్
♦ మకావు చిలుక తరహాలో కళాకారులు దుస్తులు ధరించి స్టేడియంలోకి ప్రవేశించారు. రియోలోని ప్రఖ్యాత దర్శనీయ స్థలాలను ఏరియల్ ద్వారా వీక్షిస్తే ఎలా ఉంటుందో ప్రేక్షకులకు చూపించారు. చివర్లో ఒలింపిక్ రింగ్స్‌గా మారి ఆకట్టుకున్నారు.
♦ రియో సాంబా పితామహుడు మార్టిన్హో డా సిల్వా తన ముగ్గుకు కుమార్తెలు, మనవరాళ్లతో కలిసి ఆల్‌టైమ్ పాపులర్ సాంగ్స్‌ను ఆలపించాడు. అనంతరం 26 రాష్ట్రాలకు చెందిన 27 మంది పిల్లలు బ్రెజిల్ జాతీయ గీతాన్ని ఆలపించారు
♦ భారత్ తరఫున రెజ్లర్ సాక్షి మలిక్ త్రివర్ణ పతాకాన్ని చేతబట్టుకుని ముందు నడవగా దాదాపు 50 మంది అథ్లెట్లు తనను అనుసరించారు. ఇందులో భారత హాకీ జట్లు, బాక్సర్లు, రెజ్లర్లు ఉన్నారు.
♦ ఆ తర్వాత 11 నిమిషాల పాటు టోక్యో 2020కి కేటాయించారు. రాబోయే ఒలింపిక్స్‌ను తాము ఏవిధంగా నిర్వహించబోతున్నామో చిత్రరూపకంగా తెలిపారు. సూపర్ మరియో వస్త్ర ధారణలో జపాన్ ప్రధాని షింజో అబే స్టేడియంలో ప్రత్యక్షమయ్యారు.
♦ అనంతరం అధికారికంగా గేమ్స్ ముగిసినట్టు ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ ప్రకటించారు. 16 రోజులు మొత్తం ప్రపంచాన్ని బ్రెజిల్ ఆనందడోలికల్లో ముంచెత్తాయని, రాబోయే తరాలకు ఈ గేమ్స్ ఓ మధుర జ్ఞాపకంగా మిగులుతాయని ఆయన అన్నారు.
♦ రియో గేమ్స్ పతాకాన్ని కిందికి దించి టోక్యో మేయర్‌కు అప్పగించారు.
♦ చివర్లో కార్నివాల్ పరేడ్ అందరినీ ఉర్రూతలూగించింది. ప్రసిద్ధ సాంబా సాంగ్స్‌తో పాటు బ్రెజిల్ టాప్ మోడల్ ఇజబెల్ గౌలర్ట్ ప్రవేశంతో స్టేడియంలో జోష్ పెరిగింది. వందలాది సాంబా నృత్యకారులు రియో సిటీ థీమ్ సాంగ్ అయిన ‘సిడాడే మరివిల్హోసా’కు దుమ్మ రేపే రీతిలో చిందులు వేశారు.
♦ ఇక గేమ్స్ ముగింపు సూచకంగా మరకానా స్టేడియం పైకప్పు నుంచి భారీగా బాణసంచా కాల్చడంతో రియో ధగధగలాడింది.