Waqf Board land
-
బెంగళూరు ఈద్గాలో గణేష్ ఉత్సవాలకు బ్రేక్.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
బెంగళూరు: బెంగళూరులోని ఈద్గా మైదానంలో రెండు రోజుల పాటు గణేష్ ఉత్సవాలకు కర్ణాటక ప్రభుత్వం అనుమతులు ఇవ్వటంపై కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక వక్ఫ్ బోర్టు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ ఎంఎం సుందరేష్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. గణేష్ ఉత్సవాలకు బ్రేకులు వేసింది ధర్మాసనం. స్టేటస్ కో విధిస్తూ ఆదేశాలిచ్చింది. దీని ప్రకారం.. ఆ మైదానంలో ఎలాంటి మతపరమైన ఉత్సవాలు జరపకూడదు. విచారణ సందర్భంగా వక్ఫ్ బోర్డు తరపున వాదనలు వినిపించారు సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దావే. తమ హక్కులు అణచివేతకు గురవుతున్నాయనే భావన మతపరమైన మైనారిటీలకు కలుగకుండా చూడాలని కోరారు. ఈ మైదానంలో 200 ఏళ్లుగా ఇతర మతాల కార్యక్రమాలు నిర్వహించటం లేదని, చట్ట ప్రకారం ఇది వక్ఫ్ బోర్డు ఆస్తిగా తెలిపారు. 2022లో ఇది వివాదాస్పద స్థలమని ప్రకటించారని, ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించాలనుకుంటున్నారని ధర్మాసనానికి నివేదించారు. మరోవైపు.. ఇది ప్రభుత్వం పేరుతో ఉందని, చాలా ఏళ్లుగా పిల్లలు ఆడుకునే ఆట స్థలంగానే కొనసాగుతున్నట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. ఈద్గా మైదానంలో గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వటాన్ని అంతకు ముందు కర్ణాటక హైకోర్టు సైతం ఏకీభవించింది. ప్రభుత్వం అనుమతులు ఇవ్వవచ్చని తెలిపింది. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించింది కర్ణాటక వక్ఫ్‌బోర్డు. తాజాగా స్టేటస్ కో విధిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయటం వల్ల.. ప్రస్తుతం మరో కొత్త సమస్య తలెత్తింది. ఇప్పుడు ఆ స్థలం ప్రభుత్వానిదా లేక వక్ఫ్‌బోర్డుదా? అనే విషయం హైకోర్టు పరిధిలోకి వెళ్లింది. ఇదీ చదవండి: ఎక్కడికి పోతావు చిన్నవాడా? పరారైన వరుడిని వెంబడించి పట్టుకున్న వధువు -
జాగా కోసం జాతరలా..
ఖమ్మం అర్బన్: ఇంకా గురువారం తెల్లవారలేదు. ఓ పక్క మంచుతెరలు.. మరోపక్క వర్షం కురిసేలా ఉన్న మబ్బులు.. ఆ సమయానికే వేల సంఖ్యలో పేద ముస్లింలు ఖమ్మం 14వ డివిజన్లోని గొల్లగూడెంలోని వక్ఫ్‌బోర్డు భూముల్లో గుడిసెలు వేసుకునేందుకు చేరుకున్నారు. పోలీసులు కూడా పసిగట్టలేనంత రహస్యంగా పెద్దసంఖ్యలో సామగ్రితో సహా చేరుకున్నారు. ఇంటి జాగా కోసం జాతరలా వచ్చిన వారు హద్దులు ఏర్పాటుచేసుకుని గుడిసెలు వేసేందుకు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న ఏసీపీ ఆంజనేయులు సిబ్బందితో చేరుకుని నచ్చచెప్పినా వారు వెనక్కి వెళ్లలేదు. మతపెద్దలైన ముజావర్లను పిలిపించి మాట్లాడించినా వినలేదు. తామంతా నిరుపేదలమని, ఇళ్ల అద్దె కట్టలేక గుడిసెలు వేసుకుంటున్నామని చెప్పారు. మధ్యాహ్నం భారీ వర్షం పడినా వెళ్లకుండా అక్కడే ఉండిపోయిన వారు రాత్రి 9 గంటల కు వెనుదిరిగారు. గొల్లగూడెం రెవెన్యూ పరిధి లో ఈద్గాను ఆనుకుని సుమారు 80 ఎకరాల మేర వక్ఫ్ బోర్డు భూములున్నాయి. ఇందు లో ఇప్పటికే ఐదెకరాలకుపైగా ఆక్రమణకు గురైంది. వక్ఫ్‌బోర్డు అంటే ముస్లింలకు చెందిన భూములని, వాటిపై సర్వ హక్కులు ముస్లింలకే ఉంటాయని నమ్మబలికిన దళారులు డబ్బు వసూలు చేసి గుడిసెలు వేసేందుకు పురిగొల్పినట్లు తెలుస్తోంది. -
వక్ఫ్ భూములపై డిజిటల్ నిఘా
కర్నూలు (రాజ్‌విహార్): వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వక్ఫ్ భూములు, స్థలాలను రీ సర్వే చేసి, డిజిటలైజ్ చేసేందుకు చర్యలు చేపట్టింది. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల వేలాది ఎకరాల వక్ఫ్ భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. వాటిని పరిరక్షించేందుకు చర్యలు చేపట్టకపోవడంతో టీడీపీ నాయకులు ఎక్కువగా ఆక్రమించుకున్నారు. వక్ఫ్ గెజిట్, రికార్డుల్లో ఉన్నప్పటికీ సబ్ డివిజన్లు, సర్వే నంబర్లు మార్పు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మసీదులు, దర్గాల నిర్వహణ కోసం ముస్లిం పెద్దలు, దాతలు వక్ఫ్‌కు ఇనాంగా ఇచ్చిన ఆస్తులను అప్పనంగా కాజేసి సొంత ఆస్తుల్లా అనుభవిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22,553 ఎకరాల భూములు అన్యాక్రాంతం అయ్యాయి. విలువైన స్థలాలు కబ్జాకు గురయ్యాయి. వీటి విలువ రూ.2,500 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఆక్రమణల్లో చిత్తూరు ఫస్ట్ వక్ఫ్ ఆస్తులు కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఉండగా ఆక్రమణల్లో చిత్తూరు మొదటి స్థానంలో ఉంది. కర్నూలు జిల్లాలో 22,599.89 ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నట్లు గెజిట్‌లో పేర్కొన్నారు. గెజిట్‌లో లేని భూములు మరో పది వేల ఎకరాల దాకా ఉంటాయి. చిత్తూరు జిల్లాలో మొత్తం 6,671 ఎకరాలు ఉండగా ఏకంగా 5,162.99 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. రూ.2,500 కోట్ల ఆస్తుల అన్యాక్రాంతం గెజిట్–1963 ప్రకారం 13 జిల్లాల్లో 3,502 మసీదులు, దర్గాలు, ఇతర సంస్థలకు చెందిన భూములు 65,260.97 ఎకరాలున్నాయి. గెజిట్‌లో లేని భూములు మరో 20వేల ఎకరాల దాకా ఉంటాయి. ఒకసారి వక్ఫ్‌లోకి వస్తే శాశ్వతంగా వక్ఫ్‌లోనే అనే చట్టం ఉన్నా ఆక్రమణలు మాత్రం యథేచ్ఛగా కొనసాగాయి. రాష్ట్రంలో 22,553.06 ఎకరాలు అన్యాక్రాంతం అయినట్లు లెక్కలు చెబుతున్నాయి. వీటి విలువ రూ.2,500 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. పర్యవేక్షణ లేక.. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు సిబ్బంది కొరత వేధిస్తోంది. అక్రమార్కులు అడ్డదారుల్లో ఆక్రమించుకుని అనుభవిస్తున్నారు. కొందరు ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకుంటుండగా మరికొందరు అనుభవదారులమంటూ కోర్టుకెళ్తున్నారు. రీ సర్వే, డిజిటలైజేషన్ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు చేపట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం రీ సర్వే, డిజిటలైజేషన్ చేయిస్తోంది. ఇప్పటికే జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విధివిధానాలు జారీ చేసింది. ఇందుకు గ్రామ/వార్డు సచివాలయాల్లో సర్వేయర్లు, డిజిటల్ అసిస్టెంట్లు, రెవెన్యూ సెక్రటరీల సహకారం తీసుకోనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే ఆక్రమణలకు గురైన ఆస్తులు తిరిగి స్వాధీనం కావడంతో పాటు భద్రంగా ఉంటాయని భావిస్తున్నారు. తహసీల్దార్లకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలి వక్ఫ్ భూములను రీ సర్వే చేసి డిజిటలైజ్ చేయడానికి చర్యలు చేపట్టడం అభినందనీయం. అది పూర్తయ్యాక గెజిట్‌లో పొందుపర్చాలి. వాటిని పరిరక్షించేందుకు సీసీఎల్ఏకు అధికారమిచ్చి తహసీల్దార్లకు పర్యవేక్షణ బాధ్యతలివ్వాలి. కలెక్టర్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ సమీక్ష రెగ్యులర్‌గా నిర్వహించాలి. – ఎస్.రోషన్‌అలీ, రిటైర్డు తహసీల్దార్, కర్నూలు కరోనా వల్ల తాత్కాలికంగా ఆగింది రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్‌బోర్డు భూములు, స్థలాల రీ సర్వేకు చర్యలు చేపట్టాం. ఇప్పటికే సర్వే కమిషన్ ఆఫ్ వక్ఫ్ ద్వారా కర్నూలు, గుంటూరు జిల్లాల్లో సర్వే చేస్తున్నాం. కరోనా కారణంగా తాత్కాలికంగా నిలిపివేశాం. ఈ ప్రక్రియ పూర్తయితే గెజిట్‌లో పొందుపరుస్తాం. – అలీమ్ బాషా, సీఈవో, వక్ఫ్ బోర్డు -
వక్ఫ్‌బోర్డు భూముల ఆక్రమణపై కఠిన చర్యలు
సాక్షి, గజ్వేల్(సిద్ధిపేట) : వక్ఫ్‌బోర్డు భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ఓఎస్డీ మహ్మద్ ఖాసీమ్ హెచ్చరించారు. ఈనెల 12న జిల్లాలో సాగుతున్న వక్ఫ్‌భూముల దందాపై ‘అన్యాక్రాంతం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన ఆయన శుక్రవారం గజ్వేల్‌లో పర్యటించి వక్ఫ్‌భూముల ఆక్రమణపై విచారణ చేపట్టారు. ముందుగా పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించిన ఆయన ఆ తర్వాత వక్ఫ్‌భూములను పరిశీలించారు. సర్వే నంబర్ల వారీగా భూముల వివరాలు, వివాదాలపై ఆరా తీశారు. నిబంధనలు విరుద్ధంగా వక్ఫ్‌భూములను ఆక్రమిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తయిన తర్వాత చర్యలుంటాయని స్పష్టం చేశారు. ఇంకా ఆయన వెంట ఉమ్మడి మెదక్ జిల్లా వక్ఫ్‌బోర్డు ఇ¯Œ ్సస్పెక్టర్ ఖాదర్, సర్వేయర్లు సుజన్, నాగరాజు తదితరులు ఉన్నారు. -
వక్ఫ్ భూములు హాంఫట్
సాక్షి, హైదరాబాద్ : వక్ఫ్ భూములను కాపాడుకోవడంలో తెలంగాణ వక్ఫ్ బోర్డు ఘోరంగా విఫలమైందని సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ సభ్యుల తనిఖీ బృందం దుయ్యబట్టింది. 32,596 మసీదులు, దర్గాలు, ఆషర్ఖానాలు, ఇతర సంస్థలకు సంబంధించి రాష్ట్రంలో 77,677 ఎకరాల వక్ఫ్ భూములుండగా.. అందులో 89 శాతం భూములు అన్యాక్రాంతమయ్యాయని పేర్కొంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వక్ఫ్ బోర్డులకు సంబంధించి హైకోర్టులో 12,628 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అందులో 8 వేల కేసుల విషయంలో వక్ఫ్ బోర్డు కౌంటర్లు, అప్పీళ్లు కూడా దాఖలు చేయలేకపోయిందని తెలిపింది. రెండు రాజకీయ పార్టీల ప్రమేయంతో రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల వక్ఫ్ భూముల కుంభకోణం చోటుచేసుకుందని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని సిఫారసు చేసింది. ఈ మేరకు తనిఖీ బృందం కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ చైర్మన్‌కు ఈ నెల 23న నివేదిక సమర్పించింది. కౌన్సిల్ సభ్యుడు నౌషాద్ నేతృత్వంలోని బృందం ఇటీవల రాష్ట్ర వక్ఫ్ బోర్డులో తనిఖీలు జరిపి నివేదిక రూపొందించింది. వక్ఫ్ బోర్డు పనితీరుపై తనిఖీ బృందం అడిగిన ప్రశ్నలకు బోర్డు కమిటీ సభ్యులు హాస్యాస్పద సమాధానాలిచ్చారని పేర్కొంది. వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా ఎమ్మెల్సీ మహమ్మద్ సలీం పనితీరు ఏమాత్రం బాగోలేదని, ఆయన ఈ పదవికి అనర్హుడని స్పష్టంచేసింది. రాష్ట్ర వక్ఫ్ కమిటీలోని నలుగురు సభ్యులపై వక్ఫ్ భూముల ఆక్రమణకు సంబంధించి హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించింది. సాక్షాత్తూ వక్ఫ్ బోర్డు చైర్మన్, సభ్యులు నిధులు దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్నారని తెలిపింది. వక్ఫ్ చట్టంలోని 14(డి) నిబంధన ప్రకారం.. సున్నీ, షియా మత గురువులను నియమించాల్సి ఉండగా, వారి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ నాయకులను నియమించిందని తప్పుబట్టింది. వక్ఫ్ బోర్డుకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సూచించింది. నివేదికలోని ఇతర ముఖ్యాంశాలివీ.. – పని తీరు, ఆదాయ వ్యయాలు, సర్వే, వక్ఫ్ డీడ్లు, రెవెన్యూ రికార్డుల నిర్వహణ, ఆస్తుల ఆక్రమణలు, వార్షిక నివేదికలను తనిఖీ బృందానికి సమర్పించడంలో వక్ఫ్ బోర్డు విఫలమైంది – మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్టర్ షానవాజ్ ఖాసీంకు ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఇన్చార్జి సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది. రెగ్యులర్ సీఈవో లేకపోవడం వల్ల వక్ఫ్ బోర్డు పనితీరుపై ప్రభావం పడింది – వక్ఫ్ ఆస్తుల కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్ర మైనారిటీ కమిషన్ సైతం 2016లో హైకోర్టులో కేసు వేసింది – హైదరాబాద్ ఐటీ హబ్ పరిధిలో ఉన్న అత్యంత విలువైన వక్ఫ్ భూములను అభివృద్ధిపరచడంలో వక్ఫ్ బోర్డు విఫలమైంది. ఈ భూములను అభివృద్ధి పరిస్తే బోర్డు వార్షిక ఆదాయంలో 40 శాతం వృద్ధి ఉంటుంది – వక్ఫ్ బోర్డులోని రెంట్లు, లీజుల విభాగం పనితీరు సందేహాస్పదంగా ఉంది. కమర్షియల్ ఏరియాల్లో మార్కెట్ విలువతో పోలిస్తే కేవలం 3 శాతం అద్దెతోనే కీలకమైన ఆస్తులను అద్దెకిచ్చారు. మార్కెట్ విలువ ప్రకారం రూ.25,000 అద్దె వచ్చే షాపులను కేవలం రూ.150 అద్దెకు ఇచ్చారు – వక్ఫ్ బోర్డులో సూపరింటెండెంట్లు, క్లర్కులు, ఆఫీస్ సబార్డినేట్, ఇతర పోస్టుల్లో అర్హతలు లేని ఎంతో మంది ఉద్యోగులు పని చేస్తున్నారని మైనారిటీల సంక్షేమ శాఖపై ప్రభుత్వం నియమించిన సభా కమిటీ అసెంబ్లీకి నివేదించింది. వీరిలో కొందరు ఇంకా ఉద్యోగాల్లో ఉండగా, మరికొందరు ఇప్పటికే పదవి విరమణ చెంది ప్రయోజనాలు అందుకుంటున్నారు. కొందరు ఉద్యోగులు పలుకుబడితో తమ బంధువులకు సైతం ఉద్యోగాలు ఇప్పించుకున్నారు. మైనారిటీ సంక్షేమ శాఖ అభ్యంతరం తెలిపినా.. వక్ఫ్ బోర్డు తన స్వయం ప్రతిపత్తిని ఉపయోగించుకొని ఎలాంటి రాత పరీక్ష జరపకుండానే నియామకాలు జరిపింది – వక్ఫ్ బోర్డులో ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో పని చేసేందుకు 200 మందికిపైగా ఉద్యోగులను తక్షణమే నియమించాలి. పదవీ విరమణ చేసి ఏడేళ్లు గడుస్తున్నా ఇంకా ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారిని తొలగించాలి. ఉన్న 106 మంది ఉద్యోగుల్లో 60 మంది అటెండర్లు, తొమ్మిది మంది సూపర్వైజర్లు. సీనియర్ ఉద్యోగులకు కనీసం ఒక లేఖ రాయడం కూడా రాదు. – మొహర్రం కోసం ఆషుర్ఖానాలు, ఇమాంబాడలకు వక్ఫ్ బోర్డు నిధులు ఇవ్వడం లేదు – హైదరాబాద్‌లోని అత్యంత విలువైన వక్ఫ్ భూములు, ఆస్తులను తనిఖీ బృందం సందర్శించింది. సికింద్రాబాద్‌లోని కోహే మౌలాలి దర్గాకు చెందిన 384 ఎకరాలు, సికింద్రాబాద్ తిరుమలగిరిలోని కొహే ఇమామ్ జామిన్ దర్గాకు చెందిన రూ.200 కోట్లు విలువ చేసే 210 ఎకరాలు, కార్వాన్‌లోని టోలీ మసీదుకు చెందిన 27.30 ఎకరాలు, చార్మినార్, పత్తర్‌గట్టీలోని ఆషూర్ఖానా నాల్–ఏ–ముబారక్‌కు చెందిన 1300 ఎకరాలు, మణికొండలోని దర్గా హుస్సేన్ షావలీ దర్గాకు చెందిన 1,654 ఎకరాలు పూర్తిగా కబ్జాకు గురయ్యాయి. శంషాబాద్ విమానాశ్రయం కోసం బాబా షర్ఫొద్దీన్ పహాడీ దర్గాకు చెందిన 1100 ఎకరాలను సేకరించగా, ఇంకా వక్ఫ్ బోర్డుకు ప్రభుత్వం పరిహారం చెల్లించలేదు. -
కబ్జాలకు చెక్!
బాన్సువాడ, న్యూస్‌లైన్ : సర్కారు భూములను కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ప్రభుత్వ భూమి ఎంత ఉంది, అటవీ శాఖకు చెందిన భూమి ఎంత, అసైన్మెంట్ భూమి ఎంత, శిఖం భూమి ఎంత, దేవాదా య, వక్ఫ్‌బోర్డు భూములు ఎన్ని ఉన్నాయి.. తదితర వివరాలను సర్వే నెంబర్లతో సహా ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 50 శాతం వివరాలను పొందుపర్చినట్లు సమాచారం. ఈ వివరాలన్నీ త్వరలో వెబ్సైట్లో దర్శనమివ్వనున్నాయి. జిల్లాలో 7.95 లక్షల హెక్టార్ల భూ విస్తీర్ణం ఉండగా, అందులో అటవీ భూమి 1.69 లక్షల హెక్టార్లలో ఉంది. అసైన్మెంట్ భూములు, దేవాదాయ, వక్ఫ్‌బోర్డు భూములు, శిఖం భూములు భారీగానే ఉన్నాయి. వీటికి సంబంధించిన సమగ్ర వివరాలు ప్రభుత్వ రికార్డుల్లోనూ లేవు. దీంతో ఇప్పటికే వేలాది హెక్టార్ల భూమి కబ్జాకు గురైంది. ఈ నేపథ్యంలో సర్కారు భూములను రక్షించేందుకోసం అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. పూర్తి స్థాయి రికార్డులను తయారు చేయడానికి కసరత్తు చేస్తోంది. రెవెన్యూ అధికారులు మండలాల వారీగా ప్రభుత్వ భూములకు సంబంధించిన వివరాలను తెప్పిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. నెల రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసి సర్కార్ భూమి.కామ్‌లో వివరాలను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిసింది. ప్రభుత్వ భూములకు రక్షణ భూముల వివరాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచితే కబ్జాలను నిరోధించవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. దీని వల్ల ప్రభుత్వ, దేవాలయ, వక్ఫ్‌బోర్డు, ఇరిగేషన్, అటవీ భూములకు రక్షణ ఉంటుందని భావిస్తోంది. సర్వే నెంబర్లతో సహా వెబ్సైట్లో పొందుపర్చుతున్నందున ఇతరులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉండదని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. శాఖల అనుసంధానంతో.. రిజిస్ట్రేషన్లలో అవకతవకలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలను అనుసంధానం చేస్తూ వెబ్ ల్యాండ్‌ను ఏర్పాటు చేసింది. వెబ్ ల్యాండ్‌లో ఉన్న వివరాల ఆధారంగానే రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల అక్రమాలు, అవకతవకలు లేకుండా భూముల క్రయవిక్రయాలు జరుగుతాయని భావిస్తున్నారు. అయితే వెబ్ ల్యాండ్ పద్ధతి బాలారిష్టాలను ఎదుర్కొంటోంది. రెవెన్యూ శాఖలో భూములకు సంబంధించి తాజా వివరాలు లేవు. కొన్నేళ్లుగా క్రయవిక్రయాలకు సంబంధించిన వివరాలను అప్డేట్ చేయలేదు. రిజిస్ట్రేషన్ చేసే సమయంలో దస్తావేజు వివరాలు వెబ్ ల్యాండ్‌లో ఉన్నప్పుడే రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉంటుంది. లేదంటే రిజిస్ట్రేషన్ చేయలేమంటూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చేతులెత్తేస్తున్నారు. అలాంటి సందర్భాల్లో దస్తావేజుకు సంబంధించిన భూమి తాజా వివరాలను రెవెన్యూ శాఖలో నమోదు చేసుకొని వారి నుంచి సర్టిఫికెట్ తీసుకున్నట్టయితేనే రిజిస్ట్రేషన్లు చేస్తామంటూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్పష్టం చేస్తున్నారు. తహశీల్దార్ కార్యాలయాలకు వెళ్లి తమ డాక్యుమెంట్ల వివరాలను వెబ్ ల్యాండ్‌లో పొందుపర్చాలని విన్నవించుకుంటున్న కక్షిదారులకు చుక్కెదురవుతోంది. వివరాలను రెవెన్యూ శాఖ సిబ్బంది తక్షణమే వెబ్‌ల్యాండ్‌లో పెట్టే సాహసం చేయలేకపోతున్నారు. రెండు శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, చివరి రిజిస్ట్రేషన్ల వివరాలను సేకరించినట్లయితే సమస్యకు పరిష్కారం చూపే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పూర్తి వివరాలతో వెబ్సైట్ ప్రభుత్వ భూములకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన వెబ్సైట్ త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే మండలాల వారీగా ప్రభుత్వ భూముల వివరాలను సేకరించి, ఆన్లైన్లో పొందుపరుస్తున్నాం. ఇలా చేస్తే భూ అక్రమాలను అడ్డుకోవచ్చు. కబ్జాలను అరికట్టవచ్చు. -శ్రీకాంత్, బోధన్ తహశీల్దార్