బాన్సువాడ, న్యూస్‌లైన్ : సర్కారు భూములను కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ప్రభుత్వ భూమి ఎంత ఉంది, అటవీ శాఖకు చెందిన భూమి ఎంత, అసైన్‌మెంట్ భూమి ఎంత, శిఖం భూమి ఎంత, దేవాదా య, వక్ఫ్‌బోర్డు భూములు ఎన్ని ఉన్నాయి.. తదితర వివరాలను సర్వే నెంబర్లతో సహా ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 50 శాతం వివరాలను పొందుపర్చినట్లు సమాచారం. ఈ వివరాలన్నీ త్వరలో వెబ్‌సైట్‌లో దర్శనమివ్వనున్నాయి.
జిల్లాలో 7.95 లక్షల హెక్టార్ల భూ విస్తీర్ణం ఉండగా, అందులో అటవీ భూమి 1.69 లక్షల హెక్టార్లలో ఉంది. అసైన్‌మెంట్ భూములు, దేవాదాయ, వక్ఫ్‌బోర్డు భూములు, శిఖం భూములు భారీగానే ఉన్నాయి. వీటికి సంబంధించిన సమగ్ర వివరాలు ప్రభుత్వ రికార్డుల్లోనూ లేవు. దీంతో ఇప్పటికే వేలాది హెక్టార్ల భూమి కబ్జాకు గురైంది. ఈ నేపథ్యంలో సర్కారు భూములను రక్షించేందుకోసం అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. పూర్తి స్థాయి రికార్డులను తయారు చేయడానికి కసరత్తు చేస్తోంది. రెవెన్యూ అధికారులు మండలాల వారీగా ప్రభుత్వ భూములకు సంబంధించిన వివరాలను తెప్పిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. నెల రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసి సర్కార్ భూమి.కామ్‌లో వివరాలను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిసింది.
ప్రభుత్వ భూములకు రక్షణ
భూముల వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచితే కబ్జాలను నిరోధించవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. దీని వల్ల ప్రభుత్వ, దేవాలయ, వక్ఫ్‌బోర్డు, ఇరిగేషన్, అటవీ భూములకు రక్షణ ఉంటుందని భావిస్తోంది. సర్వే నెంబర్లతో సహా వెబ్‌సైట్‌లో పొందుపర్చుతున్నందున ఇతరులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉండదని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు.
శాఖల అనుసంధానంతో..
రిజిస్ట్రేషన్లలో అవకతవకలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలను అనుసంధానం చేస్తూ వెబ్ ల్యాండ్‌ను ఏర్పాటు చేసింది. వెబ్ ల్యాండ్‌లో ఉన్న వివరాల ఆధారంగానే రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల అక్రమాలు, అవకతవకలు లేకుండా భూముల క్రయవిక్రయాలు జరుగుతాయని భావిస్తున్నారు.
అయితే వెబ్ ల్యాండ్ పద్ధతి బాలారిష్టాలను ఎదుర్కొంటోంది. రెవెన్యూ శాఖలో భూములకు సంబంధించి తాజా వివరాలు లేవు. కొన్నేళ్లుగా క్రయవిక్రయాలకు సంబంధించిన వివరాలను అప్‌డేట్ చేయలేదు. రిజిస్ట్రేషన్ చేసే సమయంలో దస్తావేజు వివరాలు వెబ్ ల్యాండ్‌లో ఉన్నప్పుడే రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉంటుంది. లేదంటే రిజిస్ట్రేషన్ చేయలేమంటూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చేతులెత్తేస్తున్నారు. అలాంటి సందర్భాల్లో దస్తావేజుకు సంబంధించిన భూమి తాజా వివరాలను రెవెన్యూ శాఖలో నమోదు చేసుకొని వారి నుంచి సర్టిఫికెట్ తీసుకున్నట్టయితేనే రిజిస్ట్రేషన్లు చేస్తామంటూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్పష్టం చేస్తున్నారు.
తహశీల్దార్ కార్యాలయాలకు వెళ్లి తమ డాక్యుమెంట్ల వివరాలను వెబ్ ల్యాండ్‌లో పొందుపర్చాలని విన్నవించుకుంటున్న కక్షిదారులకు చుక్కెదురవుతోంది. వివరాలను రెవెన్యూ శాఖ సిబ్బంది తక్షణమే వెబ్‌ల్యాండ్‌లో పెట్టే సాహసం చేయలేకపోతున్నారు. రెండు శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, చివరి రిజిస్ట్రేషన్ల వివరాలను సేకరించినట్లయితే సమస్యకు పరిష్కారం చూపే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పూర్తి వివరాలతో వెబ్‌సైట్
ప్రభుత్వ భూములకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన వెబ్‌సైట్ త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే మండలాల వారీగా ప్రభుత్వ భూముల వివరాలను సేకరించి, ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నాం. ఇలా చేస్తే భూ అక్రమాలను అడ్డుకోవచ్చు. కబ్జాలను అరికట్టవచ్చు. -శ్రీకాంత్, బోధన్ తహశీల్దార్
కబ్జాలకు చెక్!
Published Sat, Feb 15 2014 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 3:42 AM
Advertisement