హక్కుల సాధనకు ఐక్య ఉద్యమం
కంకిపాడు : హక్కుల సాధనకు రజక వృత్తిదారులు ఐక్యంగా ఉద్యమించాలని ఏపీ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మన్నూరు భాస్కరయ్య పిలుపునిచ్చారు. రజకవృత్తిదారుల సంఘం తూర్పు కృష్ణా జిల్లా 3వ మహాసభలు కంకిపాడులోని కోదండ రామ కల్యాణ మండపంలో ఆదివారం జరిగాయి. చిక్కవరపు వెంకట రెడ్డియ్య అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో భాస్కరయ్య మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పాలకులు విస్మరించారని విమర్శించారు. రజక ఫెడరేషన్‌కు బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేయాలని రూ.వెయ్యి కోట్ల బడ్జెట్‌ను కేటాయించాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్లు పైబడిన వృత్తిదారులకు నెలకు రూ.2,500 పింఛను ఇవ్వాలన్నారు. ఆర్థిక వివక్ష, రాజకీయ, సామాజిక వెనుకబాటులో రజకులు ఉన్నారన్నారు. రజకుల సంక్షేమాన్ని పాలకులు పట్టించుకోకపోతే బంగాళాఖాతంలో కలిపేయాలని సూచించారు. హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా ఉద్యమించాలని కోరారు. నిర్ధిష్టమైన ప్రణాళిక రూపొందించుకుని ఆందోళనలు చేపట్టాలని సూచించారు. మహాసభలో రజకవృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నమరివేడు గురుశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాటూరి నాగభూషణం, బాపట్ల సుబ్బారావు, విజయవాడ నగర కార్యదర్శి కె.శ్రీనివాసరావు, జిల్లా కమిటీ సభ్యురాలు కాకర్ల బుజ్జి, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నర్సింహారావు పాల్గొన్నారు.
నూతన కమిటీ ఎన్నిక
రజక వృత్తిదారుల సంఘం తూర్పు కృష్ణా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చిక్కవరపు వెంకట రెడ్డియ్య (మచిటీపట్నం), ప్రధాన కార్యదర్శిగా కాటూరి నాగభూషణం (మచిలీపట్నం), ఉపాధ్యక్షులుగా బాపట్ల సుబ్బారావు(ఉయ్యూరు), బోగిరెడ్డి వెంకట శ్యామ్ (మచిలీపట్నం), వెంట్రప్రగడ వెంకటేశ్వరరావు(అవనిగడ్డ)ను ఎన్నుకున్నారు. సహాయ కార్యదర్శిగా పెడసనగంటి పాండురంగారావు (తాడిగడప), సత్యకోలు శ్రీనివాసరావు (ముదినేపల్లి), పి.రాంబాబు (గుడ్లవల్లేరు), కోశాధికారిగా కోడూరు పరశురామయ్య (ఉయ్యూరు), మరో 39 మందితో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నూతన అధ్యక్షుడు వెంకట రెడ్డియ్య తెలిపారు.