Waste waters
-
కొల్లేరు కొర్రమీను.. కనుమరుగయ్యేను
సాక్షి, అమరావతి బ్యూరో/కైకలూరు: తెల్ల చేప రకాల్లో గోదావరి పులసకు ఎంత పేరుందో.. నల్ల చేప రకాల్లో ఒకటైన కొర్రమీనుకూ అంతే గుర్తింపు ఉంది. అందులోనూ కొల్లేరు సరస్సులో పెరిగే కొర్రమీనుకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడా కొల్లేరు కొర్రమీనులకు కష్టకాలం దాపురించింది. సరస్సులో వాటి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది. కృష్ణా, గోదావరి నదీ తీర ప్రాంతాలు, పంట కాలువలు, గుంతలు, వరి చేలల్లో కొర్రమీను చేపలు పుట్టి పెరుగుతుంటాయి. ప్రాంతాలను బట్టి పూమేను, కొర్రమీను, మట్టమీను, బురద మట్ట వంటి పేర్లతో పిలుచుకునే ఈ జాతి చేపలు సహజంగా నీటి అడుగున బురదలో జీవిస్తుంటాయి. నీరు లేనప్పుడు భూమి పొరల్లోకి కూడా చొచ్చుకుపోయి అక్కడి తేమను ఆధారం చేసుకుని జీవించగలిగే మొండి జాతి ఇది. కాలుష్యమే అసలు సమస్య కొల్లేరు సరస్సులోకి చేరుతున్న వ్యర్థ జలాలు సరస్సు గర్భంలో పురుడు పోసుకుంటున్న సహజ నల్ల జాతి చేపల ఉసురుతీస్తున్నాయి. స్వచ్ఛమైన నీటితో కళకళలాడిన కొల్లేరు నీరు కాలకూట విషంగా మారింది. సరస్సులో ఉప్పు శాతం ప్రమాదకర స్థాయికి చేరడం అందోళన కలిగిస్తోంది. సరస్సులోకి ఏటా 17 వేల టన్నుల వ్యర్థ జలాలు చేరుతున్నట్టు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంచనా వేసింది. కేవలం పెద్ద కర్మాగారాల నుంచే రోజుకు 7.2 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలు కొల్లేరులో కలుస్తున్నాయి. విజయవాడ, ఏలూరు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల నుంచి చేరుతున్న వ్యర్థ రసాయనాలు మత్స్య సంపదపై మృత్యు పాశం విసురుతున్నాయి. దీనికి తోడు సముద్రపు నీరు కొల్లేరులోకి ఎగదన్నుతోంది. కొర్రమీను చేప ‘జీరో’ సెలినిటీ (ఉప్పు శాతం లేని) మంచినీటిలో పెరిగే చేప. ప్రస్తుతం కొల్లేరులో ఉప్పు శాతం 3–15 శాతంగా ఉంది. దీంతో సరస్సులో చేపల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత నీటి కాలుష్యం వల్ల కొర్రమీను ఎపిజూటిక్ అల్సరేటివ్ సిండ్రోమ్ (ఈయూఎస్) వ్యాధులకు గురవుతోంది. దీనివల్ల శరీరంపై పుండ్లు, రక్తస్రావం కావడం, ఎదుగుదల లోపించడం, సంతానోత్పత్తి నశించడం వంటి పరిణామాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే కొల్లేరులో బొమ్మిడాయి, మట్టగిడస, గురక, ఇంగిలాయి, మార్పు, జెల్ల వంటి నల్ల చేప జాతులు కనుమరుగయ్యాయి. ఇప్పుడు మొండి జాతి రకమైన కొర్రమీను సైతం వాటి జాబితాలో చేరుతోంది. నీటి కాలుష్యాన్ని అరికట్టాలి కొల్లేరు సరస్సులోకి ఫ్యాక్టరీల నుంచి వ్యర్థ జలాలు రాకుండా నియంత్రించాలి. కర్మాగారాల నుంచి శుద్ధి చేసిన నీటిని మాత్రమే విడిచిపెట్టేలా చర్యలు తీసుకోవాలి. కొల్లేరులో నిత్యం నీరు నిల్వ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. – ఎండీ ఆసిఫ్‌పాషా, జాతీయ ఉత్తమ చేపల రైతు, కైకలూరు కృత్రిమ సాగు మేలు కొర్రమీను రకం చేపలను కృత్రిమ పద్ధతిలో సాగు చేయడానికి రైతులు ముందుకొస్తున్నారు. కొర్రమీను సీడ్‌ను కొల్లేరు సరస్సుతోపాటు, కృష్ణా, గోదావరి నదుల నుంచి సేకరిస్తున్నారు. కొర్రమీను సాగుకు నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (ఎన్ఎఫ్డీబీ) ప్రోత్సాహకాలు అందిస్తోంది. – పి.ఈశ్వరచంద్ర విద్యాసాగర్, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, కైకలూరు -
మోక్షం!
► జంట జలాశయాలకు వ్యర్థ జలాల నుంచి విముక్తి ► త్వరలో మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణం ► 11 గ్రామాలను గుర్తించిన జలమండలి ► శుద్ధి జలాలు స్థానిక అవసరాలకు వినియోగం సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లోని చారిత్రక జంట జలాశయాల పరిరక్షణ దిశగా మరో ముందడుగు పడింది. సమీప గ్రామాల నుంచి నిత్యం వెలువడుతున్న వ్యర్థ జలాలు జలాశయాల్లో కలుస్తుండడంతో మురుగుకూపాల్లా మారుతున్న విషయం విదితమే. విషం నుంచి వీటికి విముక్తి కల్పించేందుకు 11 గ్రామాల పరిధిలో మురుగు శుద్ధి కేంద్రాలు(ఎస్టీపీ) నిర్మించాలని జలమండలి సంకల్పించింది. సుమారు రూ.40.50 కోట్ల అంచనా వ్యయంతో వీటిని నిర్మించనున్నారు. ఉస్మాన్ సాగర్ (గండిపేట్)కు ఆనుకొని ఉన్న ఖానాపూర్, వట్టినాగులపల్లి, జన్వాడ, అప్పోజిగూడ, చిలుకూరు, బాలాజీ దేవాలయం, హిమాయత్ నగర్ గ్రామాల పరిధిలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇక హిమాయత్ సాగర్ పరిధిలో హిమాయత్ సాగర్, అజీజ్ నగర్, ఫిరంగినాలా, కొత్వాల్‌గూడ పరిధిలో ఎస్టీపీలు నిర్మించనున్నారు. వీటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను పీబీఎస్ సంస్థ సిద్ధం చేసింది. నిర్మాణ వ్యయంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రూ.13 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖ రూ.27.50 కోట్లు వెచ్చించనున్నాయి. నిర్మాణ, నిర్వహణ పనులను జలమండలి పర్యవేక్షి స్తుంది. ఈ గ్రామాల నుంచి రోజు వారీ ఇక్కడికి వచ్చే గృహ, పారిశ్రామిక, వాణిజ్య సం స్థల వ్యర్థ జలాలను శుద్ధి చేసిన అనంతరం స్థానికంగా వన సంరక్షణకు వినియోగించనున్నట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఎట్టకేలకు విముక్తి సుమారు తొమ్మిది దశాబ్దాలుగా భాగ్యనగరి దాహార్తిని తీరుస్తున్న జంట జలాశయాలను మురుగు నుంచి విముక్తి చేసే పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. పర్యావరణ ఇంజినీరింగ్ సంస్థ ‘నీరి’ నిపుణులు 2011లో సమగ్ర అధ్యయనం చేసి.. తీసుకోవాల్సిన పరిరక్షణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వా నివేదిక సమర్పించారు. ఈ సిఫారసులకు ఐదేళ్లుగా మోక్షం లభించలేదు. దీంతో సమీప గ్రామాల మురుగు నీరు జంట జలాశయాల్లో కలుస్తుండడంతో అవి హుస్సేన్‌సాగర్‌లా కాలుష్య కాసారంగా మారుతాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, జలమండలి స్పందించి మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణానికి ముందుకురావడం శుభ పరిణామమని వారు చెబుతున్నారు. శుద్ధి చేసిన నీరు తిరిగి జలాశయాల్లో చేరకుండా స్థానికంగా గార్డెనింగ్, టాయ్‌లెట్ ఫ్లషింగ్ వంటి అవసరాలకు వినియోగించాలని సూచిస్తున్నారు. ఇన్‌ఫ్లో చానల్స్‌ను ప్రక్షాళన చేయాలి ఎగువ ప్రాంతాల్లో ఉన్న సుమారు 84 గ్రామాల నుంచి జలాశయాలకు వరద నీటిని చేర్చే కాల్వలు (ఇన్‌ఫ్లో చానల్స్) కబ్జాకు గురవడం... ఇటుక బట్టీలు... ఇసుక మాఫియాకు అడ్డాలుగా మారడం... ఫాంహౌస్‌లు, ఇంజినీరింగ్ కళాశాలలు, గోడౌన్లు, ఇతర వాణిజ్య కార్యకలాపాలకు నిలయంగా మారడంతో రోజురోజుకూ ఇవి చిన్నబోతున్నాయి. ప్రస్తుత ఎండలకు ఈ జలాశయాల్లో నీరు అడుగంటిపోయింది. ఈ నేపథ్యంలో ఇన్‌ఫ్లో చానల్స్‌ను ఈ వేసవిలోనే ప్రక్షాళన చేయాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను తొలగించాలని కోరుతున్నారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్, జలమండలి విభాగాలు సమన్వయంతో పనిచేస్తే ఈ జలాశయాలు పది కాలాల పాటు మహానగర దాహార్తిని తీరుస్తాయని పేర్కొంటున్నారు. ఇవి పూర్వపు స్థాయిలో జలకళను సంతరించుకుంటే నగరానికి రోజువారీగా 40 మిలియన్ గ్యాలన్ల తాగునీటిని పొందే అవకాశం ఉంటుందని.. దాదాపు పాత నగరం (ఓల్డ్‌సిటీ) దాహార్తి తీరుతుందని అంటున్నారు. -
మిఠీనది పరిరక్షణకు బీఎంసీ కసరత్తు
- జలశుద్ధీకరణ కేంద్రం నిర్మాణానికి ఆమోదం - నదిపై అక్రమంగా వెలసిన కట్టడాలు, పరిశ్రమలపై చర్యలు సాక్షి, ముంబై: మిఠీనది పరిరక్షణ, జలాల శుద్ధికి మహానగర పాలక సంస్థ (బీఎంసీ) శ్రీకారం చుట్టింది. నదిలో పెరిగిపోయిన కాలుష్యకారకాలను తక్షణమే తొలగించేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నదిపై జల శుద్ధీకరణ కేంద్రాన్ని నిర్మించాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. మీఠీనది పరిరక్షణ చర్యలు చేపట్టాలని, కాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని బీఎంసీకి ఆర్నెళ్ల కిందటే మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నోటీసు జారీ చేసింది. ఇందుకు స్పందించిన బీఎంసీ పరిపాలన విభాగం ఈ మేరకు జలశుద్ధీకరణ కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించింది. మిఠీనదిలోకి ఎక్కడెక్కడి నుంచి మురికి కాల్వలు, నాలాలు వచ్చి కలుస్తున్నాయో, జల శుద్ధీకరణ కేంద్రం ఎక్కడ నిర్మించాలనే విషయాలను అధ్యయనం చేయడానికి ఐటీఐకి చెందిన నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ బీఎంసీ పరిపాలన విభాగానికి సూచనలు చేయనుంది. కుచించుకుపోయిన నది మీఠీనదిలోకి నగరం, శివారు ప్రాంతాల్లోని అనేక మురికి కాల్వలు, నాలాలు వచ్చి కలుస్తాయి. నగర ప్రజలు దైనందిన పనులకు వాడే నీటితోపాటు పరిశ్రమల నుంచి వెలువడే రసాయనాలు కూడా ఇందులోనే కలువడంతో నది కాలుష్యకాసారంగా మారింది. ఫలితంగా 2005 జూలై 26న కురిసిన భారీ వర్షాలకు నగరంతోపాటు శివారు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. అప్పట్లో వచ్చిన వరదలకు 200పైగా మంది చనిపోయారు. ఆస్తి నష్టం కూడా భారీగా సంభవించింది. ఈ ఘటనతో కళ్లు తెరిచిన ప్రభుత్వం వరదలకు ప్రధాన కారణాలను అధ్యయనం చేసేందుకు చితలే కమిటీని నియమించింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన ఈ కమిటీ మిఠీనది కుచించుకుపోవడంతో వర్షపు నీరు సాఫీగా వెళ్లడం లేదని, దీంతోపాటు నదికి ఇరువైపులా మట్టిపోసి అందులో వెలసిన అక్రమ కట్టడాలే వరదముప్పునకు ప్రధాన కారణంగా తేల్చి చెప్పింది. అప్పటి నుంచి మిఠీనది అభివృద్ధి అంశం తెరమీదకు వచ్చింది. సుమారు 500 పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలు ఈ నదిలో సుమారు 500పైగా పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలు వచ్చి చేరుతున్నాయని కాలుష్యనియంత్రణ మండలి విడుదల చేసిన జాబితాలో స్పష్టం చేసింది. ఇందులో నుంచి ఏ పరిశ్రమ నుంచి ఎంతమేర కలుషిత నీరు చేరుతుందనేది పరిశీలించాల్సి ఉంది. ఆ తరువాత ఆయా యజమానులపై చర్యలు తీసుకుంటామని బీఎంసీ డిప్యూటీ కమిషనర్ అశోక్ ఖైరే వెల్లడించారు. అదే విధంగా మిఠీనదిని ఆక్రమించుకొని రెండు వైపులా వెలసిన అక్రమ కట్టాడాలు, పరిశ్రమలపై చర్యలు తీసుకొనున్నట్లు చెప్పారు. మీఠినది పరిరక్షణకు అవసరమైన అన్నిచర్యలను తీసుకొంటామని ఆయన చెప్పారు.