బినామీలతో విధులా..!
పుల్లంపేట: నేడు టీడీపీలో చక్రం తిప్పుతున్న ఓ చోటా నాయకుడి అండతో 2013లో మండలంలోని వత్తలూరు పంచాయతీలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో అదే గ్రామానికి ఓ వ్యక్తి వాచ్‌మెన్‌గా ఉద్యోగం సంపాదించాడు. ఆ తరుణంలో తనకు ఏమి తక్కువ అనుకున్నాడో.. నన్నెవరు ప్రశ్నిస్తారని అనుకున్నాడోగానీ జాయిన్ సంతకం చేయకుండానే విధుల్లో చేరాడు. ఏడాది గడిచిన తర్వాత 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో సదరు వ్యక్తిని ప్రశ్నించేవారు కరువయ్యారు. అప్పటి నుంచి దాదాపు ఆరేళ్లపాటు ఆ వాచ్మెన్ సబ్‌స్టేషన్ ముఖం కూడా చూడలేదు. ఆయన విధులు సక్రమంగా నిర్వర్తించకపోవడంతో సబ్‌స్టేషన్ అపరిశుభ్రంగా మారింది. కంపచెట్లు ఏపుగా పెరిగిపోయాయి. మందు బాబులకు నిలయంగా సబ్‌స్టేషన్ మారిందనడానికి నిదర్శం.. అక్కడ మద్యం సీసాలు దర్శనమివ్వడమే. ఒక్కరోజు కూడా విధులుకు హజరుకాకుండానే జీతం అందుకుంటున్నాడు. సబ్‌స్టేషన్‌లో ప్రతి రోజు నీటి తొట్టికి, తాగేందుకు నీరు నింపేందుకు ఒక వ్యకిని నెలకు రూ.300 ఇచ్చి వాచ్మెన్ తనకు అసిస్టెంట్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే నెలకు రూ.1500 ఇచ్చి తన స్థానంలో వాచ్‌మెన్‌గా మరోవ్యక్తిని నియమించుకున్నాడు. టీడీపీ నాయకుల అండతో బినామీలతో రోజులు వెళ్లదీస్తున్న ఈ ఖరీదైన వాచ్మెన్పై మండలస్థాయిలో చర్చనీయాంశమైంది. కడుపు నిండని దిగువ తరగతి వారికి ఇవ్వవలసిన వాచ్మెన్ కొలువు కడుపు నిండిన వారికి ఇవ్వడంతో సబ్‌స్టేషన్ ఆలనా పాలనా చూసే వాడే కరువయ్యాడని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాచ్మెన్పై విచారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అర్హతగల స్థానిక ఎస్సీ, ఎస్టీలకు వాచ్మెన్ ఉద్యోగం ఇప్పించాలని పంచాయతీలోని పలువురు సూచిస్తున్నారు.
మా వంటి వారికి ఉద్యోగం ఇవ్వాలి
అర్హత ఉన్న మాలాంటి వారికి వాచ్మెన్ ఉద్యోగం ఇవ్వాలి. సబ్‌స్టేషన్ వైపు కన్నెత్తి చూడని సిద్దవటం మల్లికార్జున వంటి వారికి ఉద్యోగం ఇస్తే సబ్‌స్టేషన్ ఆవరణ అధ్వానంగా ఉంటుంది. నిరుద్యోగులకు అన్యాయం చేయడం బాధాకరం. – మూరముట్ల గణేష్, మూరముట్లపల్లి, వత్తలూరు
వాచ్‌మెన్‌ను విచారించరా..?
బినామీలతో విధులు నిర్వహింపజేస్తున్న వాచ్మెన్ ను విద్యుత్‌శాఖ అధికారులు ఇదేమిటని కూడా ప్రశ్నించరా. అగ్రవర్ణాలకు ఒక న్యాయం.. దళితులకు ఒక న్యాయమా. మేము వాచ్‌మెన్‌గా ఉండి విధులకు హజరు కాకుంటే జీతం ఇచ్చేవారా. ఉద్యోగంలో ఉండనిచ్చేవారా.– కుప్పం అమరయ్య, వత్తలూరు