వాచ్ మన్ ఉద్యోగానికి నిర్వహించిన పరుగు పందెంలో పాల్గొన్న ఎంబీఏ అభ్యర్థుల్లో కొందరు..
విశాఖపట్నం: ఆ మధ్య ఉత్తరప్రదేశ్ లో ప్యూన్ ఉద్యోగానికి పీహెచ్ డీ హోల్డర్లు సహా లక్షల మంది అభ్యర్థులు పోటీపడటం విన్నాం. ఇప్పుడిక ఆంధ్రప్రదేశ్ వంతు. విశాఖపట్టణం జిల్లా విద్యుత్ శాఖలో రెండు నైట్ వాచ్ మన్ పోస్టులకుగానూ శుక్రవారం నిర్వహించిన పరుగు పందెంలో డిగ్రీ ఏం ఖర్మ.. ఎంబీఏ పాసైన అభ్యర్థులు కూడా పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. బాబు వస్తే.. మంచి జాబు వచ్చేమాట దేవుడెరుగు.. అమ్మకు రోగం వస్తేనో, నాన్నకు కష్టం కలిగితేనో కాస్తంత ఆసరగా ఉండొచ్చనుకున్నారో ఏమో.. చిన్న ఉద్యోగమనికూడా తలచకుండా పరుగు పందెంలో పాల్గొన్నారు. నిజానికి ఈ ఉద్యోగానికి పదో తరగతి పాస్ లేదా ఫెయిల్ విద్యార్హత.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉద్యోగాల నోటిఫికేషన్ ఎంతకూ రాకపోవడంతో వీరు అర్హత తగ్గ ఉద్యోగం కాకపోయినా పరుగు పోటీలో సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. జిల్లా విద్యుత్ శాఖ డిపార్టుమెంట్ విభాగంలో ఒక పోస్టు, ఏపీఈపీడీసీఎల్ జిల్లా హెడ్ ఆఫీస్‌లో మరో పోస్టు ఖాళీగా ఉన్నాయి. ఈ రెండు పోస్టులకు 462 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. విద్యుత్ శాఖ డిపార్టుమెంట్ విభాగంలో ఉద్యోగం కోసం ముడసర్లోవ వద్ద బీఆర్‌టీఎస్ రోడ్డులో శుక్రవారం ఉదయం ఆ శాఖ అధికారులు అభ్యర్థులకు పరుగు పోటీలు నిర్వహించారు. శనివారం హెడ్ ఆఫీస్‌లో వాచ్‌మన్ ఉద్యోగం కోసం పరుగు జరగనుంది.