water bowl
-
చిన్నారిని మింగిన నీటిపాత్ర
చెన్నేకొత్తపల్లి (రాప్తాడు) : నీటిపాత్ర ఓ చిన్నారిని మింగేసింది. కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. ఈ విషాద ఘటన చెన్నేకొత్తపల్లి మండలం హరియాన్చెరువులో జరిగింది. గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, కిష్టప్ప దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, వారిని అవ్వ వద్ద మంగళవారం సాయంత్రం వదిలేసి దంపతులిద్దరూ గొర్రెలను చూసొచ్చేకి వెళ్లారని గ్రామస్తులు తెలిపారు. రెండో సంతానమైన చందు(2)ఆడుకుంటూ వెళ్లి కొళాయి వద్ద గల నీటి పాత్రలో ప్రమాదవశాత్తు పడిపోయాడన్నారు. కాసేపటికి గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారొచ్చి బిడ్డను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రాత్రి బాగా పొద్దుపోయింది. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికే బిడ్డ మరణించి ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో కన్నవారు కన్నీరుమున్నీరయ్యారు. -
ఆడుకుంటూ అనంత లోకాలకు..
నీళ్లున్న పాత్రలో పడి చిన్నారి మృతి మొలగవల్లి (ఆలూరు రూరల్): ఆడుకుంటూ నీళ్లున్న చిన్న పాత్రలో పడి ఏడాది చిన్నారి మృత్యువాత పడింది. ఈ ఘటన మండలంలోని మొలగవల్లి గ్రామంలో శనివారం సాయంత్రం 7గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆనంద్, ఈరమ్మలకు ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె రాజేశ్వరికి ఏడాది వయస్సు. తండ్రి ఆనంద్ 5ఏళ్ల పెద్ద కుమార్తెతో కలిసి బజారుకెళ్లాడు. ఈరమ్మ చిన్న కూతురు రాజేశ్వరిని కట్టపైన బొమ్మలు వేసి ఆడించుకుంటూ దుస్తులు ఉతుకుతోంది. ఉతికిన దుస్తులను మిద్దెపైన ఆరబెట్టేందుకు వెళ్లగా.. చిన్నారి రాజేశ్వరి ఆడుకుంటూ చిన్న కట్టపైన నుంచి కింద భాగంలో నీళ్లున్న చిన్న పాత్రలోనికి దొర్లిపడింది. తల పూర్తిగా నీటిలోకి ఉండిపోయింది. తల్లి మిద్దెపైన నుంచి కిందికి వచ్చి చిన్నారి రాజేశ్వరి నీళ్లున్న పాత్రలోకి పడి ఉండటంతో వెంటనే ఆ చిన్నారిని బయటకు తీసింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న చిన్నారిని ఆలూరు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ఆ చిన్నారి మృతి చెందింది. -
నీటితొట్టెలో పడి చిన్నారి మృతి
అశ్వరావుపేట: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తూ నీటితొట్టిలో పడి మృతిచెందింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం గుర్రాల చెరువు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కంపసాటి పూజిత(3) ఇంటి ముందు ఆడుకుంటు వెళ్లి ప్రమాదవశాత్తు నీటితొట్టెలో పడింది. తల్లిదండ్రులు ఇది గుర్తించకపోవడంతో నీట మునిగి మృతిచెందింది. తల్లిదండ్రులు గమనించేసరికి తమ ముద్దుల కూతురు నీటితొట్టెలో శవమై కనిపించడంతో వారు కన్నీరు మున్నీరవుతున్నారు.