చెన్నేకొత్తపల్లి (రాప్తాడు) : నీటిపాత్ర ఓ చిన్నారిని మింగేసింది. కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. ఈ విషాద ఘటన చెన్నేకొత్తపల్లి మండలం హరియాన్‌చెరువులో జరిగింది. గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, కిష్టప్ప దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, వారిని అవ్వ వద్ద మంగళవారం సాయంత్రం వదిలేసి దంపతులిద్దరూ గొర్రెలను చూసొచ్చేకి వెళ్లారని గ్రామస్తులు తెలిపారు. రెండో సంతానమైన చందు(2)ఆడుకుంటూ వెళ్‌లి కొళాయి వద్ద గల నీటి పాత్రలో ప్రమాదవశాత్తు పడిపోయాడన్నారు. కాసేపటికి గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారొచ్చి బిడ్డను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రాత్రి బాగా పొద్దుపోయింది. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికే బిడ్డ మరణించి ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో కన్నవారు కన్నీరుమున్నీరయ్యారు.