ఆడుకుంటూ అనంత లోకాలకు..
Published Sun, Apr 23 2017 12:01 AM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
నీళ్లున్న పాత్రలో పడి చిన్నారి మృతి
మొలగవల్లి (ఆలూరు రూరల్): ఆడుకుంటూ నీళ్లున్న చిన్న పాత్రలో పడి ఏడాది చిన్నారి మృత్యువాత పడింది. ఈ ఘటన మండలంలోని మొలగవల్లి గ్రామంలో శనివారం సాయంత్రం 7గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆనంద్, ఈరమ్మలకు ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె రాజేశ్వరికి ఏడాది వయస్సు. తండ్రి ఆనంద్ 5ఏళ్ల పెద్ద కుమార్తెతో కలిసి బజారుకెళ్లాడు. ఈరమ్మ చిన్న కూతురు రాజేశ్వరిని కట్టపైన బొమ్మలు వేసి ఆడించుకుంటూ దుస్తులు ఉతుకుతోంది. ఉతికిన దుస్తులను మిద్దెపైన ఆరబెట్టేందుకు వెళ్లగా.. చిన్నారి రాజేశ్వరి ఆడుకుంటూ చిన్న కట్టపైన నుంచి కింద భాగంలో నీళ్లున్న చిన్న పాత్రలోనికి దొర్లిపడింది. తల పూర్తిగా నీటిలోకి ఉండిపోయింది. తల్లి మిద్దెపైన నుంచి కిందికి వచ్చి చిన్నారి రాజేశ్వరి నీళ్లున్న పాత్రలోకి పడి ఉండటంతో వెంటనే ఆ చిన్నారిని బయటకు తీసింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న చిన్నారిని ఆలూరు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ఆ చిన్నారి మృతి చెందింది.
Advertisement
Advertisement