Water evacuation
-
ముందుకా.. వెనక్కా?
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి నదుల అనుసంధాన ప్రక్రియపై మళ్లీ కదలిక వచ్చింది. జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) తెరపైకి తెచ్చిన ఇచ్ఛంపల్లి నుంచి కావేరి గ్రాండ్ ఆనకట్టకు నీటి తరలింపుపై పరీవాహక రాష్ట్రాల అభ్యంతరాలు, నీటి లభ్యతపై భిన్న వాదనలు జరుగుతున్న నేపథ్యంలో దీనిపై మరోమారు సమావేశం నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ నెల 17న ఎన్‌డబ్ల్యూడీఏ గవర్నింగ్ బాడీ నదుల అనుసంధాన ప్రక్రియపై కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలతో చర్చించనుంది. మిగులు జలాల తరలింపు విషయంలో ఛత్తీస్‌గఢ్ లేవనెత్తుతున్న అభ్యంతరాలు, రాష్ట్ర అవసరాలు తీరాకే నీటిని తరలించాలంటున్న తెలంగాణ, ఏపీ వాదనల నేపథ్యంలో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా ఉంది. ఇంద్రావతిలో మిగులుందని ముందుకు పోవద్దు.. గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై ఇప్పటికే జనంపేట, అకినేపల్లి, తుపాకులగూడెం నుంచి నీటిని తరలించే ప్రణాళికలు తెరపైకి తెచ్చిన కేంద్రం వాటిపై తెలంగాణ ఆమోదం లేని నేపథ్యంలో మళ్లీ ఇచ్ఛంపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి అటునుంచి నీటిని కావేరికి తరలిస్తామన్న ప్రతిపాదనకు ప్రాణం పోస్తోంది. ఇంద్రావతి, గోదావరి జలాలు కలిపి మొత్తంగా ఇచ్ఛంపల్లి వద్ద 324 టీఎంసీల మేర లభ్యత ఉందని, ఇందులో 247 టీఎంసీల నీటిని రోజుకు 2.2 టీఎంసీల చొప్పున తరలిస్తామని కేంద్రం చెబుతోంది. దీనికి రూ.86వేల కోట్ల అంచనాతో ఇదివరకే రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను రాష్ట్రాలకు పంపింది. అయితే ఇందులో ఇంద్రావతిలో లభ్యతగా ఉన్నాయని చెబుతున్న 273 టీఎంసీల నీటిపై ఛత్తీస్‌గఢ్ తీవ్రంగా ఆక్షేపిస్తోంది. ఇంద్రావతిలో మిగులు జలాలున్నాయంటూ వాటి ఆధారంగా దిగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు చేపట్టవద్దని సూచించింది. ఇంద్రావతిపై తమ ప్రభుత్వం బ్యారేజీలు, ప్రాజెక్టులు నిర్మిస్తోందని, వీటి ద్వారా 273 టీఎంసీలు వినియోగిస్తామని అంటోంది. ఒకవేళ మిగులు ఉందని చెప్పి వేల కోట్ల ఖర్చుతో అనుసంధాన ప్రక్రియ చేపడితే, భవిష్యత్తులో తాము నీటి వినియోగం మొదలుపెట్టేలా ప్రాజెక్టుల నిర్మాణం చేస్తే నీళ్లే ఉండవని, అప్పుడు శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరేనని హెచ్చరిస్తోంది. ఛత్తీస్‌గఢ్ వాదనతో తెలంగాణ సైతం ఏకీభవిస్తోంది. ఏ నదీ బేసిన్‌లోని నీటిని ఆ బేసిన అవసరాలు తీరాకే ఇతర బేసిన్లకు తరలించాలని ట్రిబ్యునల్స్, చట్టాలు చెబుతున్నాయని అంటోంది. ఛత్తీస్‌గఢ్ అవసరాలు తీరకుండా, వాటికి హక్కు ఇవ్వకుండా మిగులు నీటిని ఇతర బేసిన్లకు తరలించడం కష్టమేనని చెబుతోంది. ఇంద్రావతి జలాలపై స్పష్టత ఇచ్చాకే ముందుకెళ్లాలని అంటోంది. -
పైప్‌లైన్ ద్వారానే అదనపు టీఎంసీ
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులో మూడో టీఎంసీ నీటి తరలింపునకు గాను ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సొరంగ మార్గాల ద్వారా కాకుండా పూర్తిగా పైప్‌లైన్ వ్యవస్థ ద్వారానే నీటిని తరలించాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పైప్‌లైన్ వ్యవస్థకు అయ్యే వ్యయ అంచనాలతో మళ్లీ పరిపాలనా అనుమతులు మంజూరు చేసి పనులు మొదలు పెట్టాలని సూచించారు. తక్కువ సమయం..అధిక వ్యయం.. కాళేశ్వరం ప్రాజెక్టుల్లో భాగంగా ప్రస్తుతం రెండు టీఎంసీల నీటిని తరలించేలా పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నీటితో ప్రాజెక్టు కింద నిర్ణ యించిన సాగు అవసరాలు తీరే అవకాశం లేకపోవడంతో అదనంగా మరో టీఎంసీ నీటిని ఎత్తిపోసే లా సీఎం కేసీఆర్ నిర్ణయించి, అందుకు అనుగుణం గా ప్రణాళిక వేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. ఇందుకు గాను ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో అదనపు మోటార్ల ఏర్పాటు పనులు మొదలయ్యాయి. ఎల్లంపల్లి దిగువన మిడ్‌మానేరు వరకు కొత్తగా అప్రోచ్‌ఛానల్, గ్రావిటీ కాల్వ ద్వారా రూ. 10,500కోట్లతో నీటిని తరలించే ప్రత్యామ్నాయం సిద్ధమైంది. ఇక మిడ్‌మానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు ఒక టీఎంసీ నీటిని గ్రావిటీ కాల్వలు, సొరంగాల ద్వారా తరలించాలని నిర్ణయించారు. మొత్తం గా 11 కి.మీల మేర గ్రావిటీ కాల్వ, మరో 24 కి.మీ. ల సొరంగాలు తవ్వాల్సి ఉంటుందని, 3 పంప్‌హౌస్ ల నిర్మాణం చేయాల్సి ఉంటుందని లెక్కగట్టారు. వీటికోసం రూ.12,594 కోట్లు అంచనా వేశారు. దీనికి సంబంధించి జీవోలు సైతం ఇచ్చారు. వాటిని ఎన్నికల కోడ్ దృష్ట్యా ప్రభుత్వ వెబ్సైట్లో పెట్ట లేదు. మంగళవారం సమీక్షలో దీనిపై చర్చించారు. సొరంగాల నిర్మాణానికి భూసేకరణ అవసరమని, ఇప్పటికే మల్లన్నసాగర్ రిజర్వాయర్ పరిధిలో సేకరణ సమస్యను అధిగమించలేక, కోర్టు ల చుట్టూ తిరగాల్సి వస్తోందన్న అభిప్రాయం ప్రభు త్వ పెద్దల నుంచి వ్యక్తమయింది. దీనికి తోడు సొరంగాల నిర్మా ణానికి రెండేళ్లకు మించి సమయం పట్టే అవకాశాల దృష్ట్యా, దాన్ని పక్కన పెట్టాలని సీఎం సూచించారు. పైప్‌లైన్ ద్వారా అయితే భూసేకరణ అవసరాలు తగ్గుతాయని, నిర్మాణాన్ని సైతం ఏడాది నుంచి ఏడాదిన్నరలో పూర్తి చేసే అవకాశం ఉంటుందని అన్నట్లుగా అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ నిర్మా ణాలకు అదనంగా సొరంగాల నిర్మాణానికి అయ్యే ఖర్చుకన్నా అదనంగా రూ. 1,400 కోట్ల నుంచి రూ.1,600 కోట్లు అవుతుందని అంచనా. అంటే పైప్‌లైన్ వ్యవస్థ నిర్మాణ వ్యయం రూ.14 వేల కోట్లను దాటే అవకాశం ఉంది. దీనిపై ప్రణాళిక సిద్ధం చేశాక కొత్త అంచనాలతో అనుమతులు ఇవ్వనున్నారు. -
కాళేశ్వరంలో ఎత్తిపోతలు తగ్గిద్దామా..?
తమ్మిడిహెట్టి నుంచి నీటి తరలింపుపై పరిశీలన వ్యాప్కోస్‌కు ప్రభుత్వ ఆదేశం హైదరాబాద్: ప్రభుత్వ ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టులో గణనీయంగా ఉన్న విద్యుత్ అవసరాలను తగ్గించే అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఎత్తిపోతలను తగ్గించి.. ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా ఉన్న తమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీటిని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న సుందిళ్ల వరకు తరలించే మార్గాలపై అన్వేషణ చేయాలని నిర్ణయించింది. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించే బాధ్యతను ప్రభుత్వం వ్యాప్కోస్‌కు కట్టబెట్టింది. పెరిగిన విద్యుత్ అవసరాలను తగ్గించడంలో భాగంగా తమ్మిడిహెట్టి రెగ్యులేటర్ ఎత్తును 145 మీటర్ల నుంచి మరో మీటర్‌కు తగ్గించి, వీలైనంత ఎక్కువ నీటిని గ్రావిటీ ద్వారా 72వ కిలోమీటర్ వరకు తేవడం, అక్కడి నుంచి వేరే కాల్వ ద్వారా సుందిళ్ల బ్యారేజీలో కలపడం అనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. అయితే దీని సాధ్యాసాధ్యాలను పూర్తి స్థాయిలో పరిశీలించాల్సి ఉన్న దృష్ట్యా, ఆ బాధ్యతను వ్యాప్కోస్‌కు కట్టబెట్టింది. వారు తేల్చిన అనంతరమే ఏదైనా నిర్ణయానికి రానుంది. సబ్స్టేషన్ల నిర్మాణంపై చర్చలు కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమయ్చే విద్యుత్‌ను సమకూర్చే బాధ్యతను తీసుకున్న ట్రాన్స్‌కో డెరైక్టర్ సూర్యప్రకాశ్‌తో ప్రాజెక్టు సీఈలు హరిరామ్, వెంకటేశ్వర్లు భేటీ అయ్యారు. విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం, టెండర్లు, ఇతర సాంకేతిక అంశాలపై ఆయనతో చర్చించారు. ప్రాజెక్టుకు విద్యుత్ సరఫరా చేసే సబ్స్టేషన్ల నిర్మాణానికి 4,100 కోట్లు ఖర్చవుతుందని తేల్చారు. నిర్మాణ పనులపై స్పష్టత వచ్చిన తర్వాత ఈ పనులను త్వరగా ప్రారంభించి 18 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు.