నీటి చౌర్యానికి ఇక అడ్డుకట్ట
న్యూఢిల్లీ: నీటి చౌర్యానికి ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ) ఇక అడ్డుకట్ట వేయనుంది. ఇందులోభాగంగా ఆయా ప్రాంతాలకు సరఫరా అవుతున్న నీరు, బిల్లు రూపంలో లెక్కలోకి వస్తున్న నీటి మధ్య వ్యత్యాసాన్ని కనుగొనేందుకు సరికొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఈ విషయాన్ని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు.
‘కొత్త వ్యవస్థలో భాగంగా జిల్లా మీటరింగ్ ఏరియా (డీఎంఏ)లను ఏర్పాటు చేస్తాం. ఈ ప్రాం తాలకు సరఫరా అవుతున్న నీటి పరిమాణంపై నిఘా ఉంచుతాం. మీటర్ల ద్వారా సరఫరా అవుతు న్న నీటి పరిమాణం లెక్కల్లోకి వస్తుందన్నారు. అయితే ఆయా ప్రాంతాలకు నీటి సరఫరా కోసం ఏర్పాటుచేసిన కనెక్షన్లలను కూడా ఇకమీదట పరిగణనలోకి తీసుకుంటాం. ఇందువల్ల ఈ రెండింటి మధ్య వ్యత్యాసం తెలిసిపోతుంది. తద్వారా ఎంత నీరు చౌర్యానికి గురవుతున్నదనే విషయం కూడా తేలిగ్గా అర్థమవుతుందన్నారు. చౌర్యానికి గురవుతున్న నీటిని నాన్ రెవెన్యూ వాటర్ (ఎన్ఆర్డబ్ల్యూ) కింద తాము పరిగణిస్తామన్నారు.
ఢిల్లీలాంటి మహానగరంలో ఎన్ఆర్డబ్ల్యూ అనేది అత్యంత కీలకమైనదన్నారు. ఇటువంటి నగరాల్లో ప్రజలకు అవసరమైన నీటి పరిమాణం, సరఫరాల మధ్య వ్యత్యాసం ఎంతో ఉంటుందన్నారు. ఆ డిమాండ్‌ను అందుకోవడం అంత తేలికైన విషయం కాదన్నారు. ద్వారక లాంటి కీలక ప్రాంతాలు కూడా నీటి కొరతతో సతమతమవుతున్నాయన్నారు. ముడి జలాల కొరతే ఇందుకు కారణమన్నారు.ముడిజలాల కోసం పరిసర రాష్ట్రాల్లోని జలాశయలపై ఆధారపడక తప్పడం లేదన్నారు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో 11 నుంచి 12 శాతం నీరు సరఫరా సమయంలో వథా అవుతుందన్నారు. ట్యాం కులు నిండిపోయిన సమయంలో కూడా నీరు వృ థా అవుతుందని, మరో 40 శాతం జలాలు చౌర్యానికి గురవుతున్నాయన్నారు.
డీజేబీ గణాంకాల ప్రకారం నగరానికి ప్రతిరోజూ 1,080 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరమవుతుంది. అయితే ఆయా జలశుద్ధీకరణ కేంద్రాల్లో ప్రతిరోజూ 850 మిలియన్ గ్యాలన్లనీటిని సంబంధిత సిబ్బంది శుద్ధి చేస్తారు. అయితే శుద్ధి చేసి సరఫరా చేస్తున్న జలాల్లో సగం మేర కూడా రాబడి రావడం లేదు. ఆయా ప్రాంతాల్లో డీఎంఏలను ఏర్పాటు చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించామన్నారు. నగరంలో 5.25 లక్షల ఆటోమేటిక్ మీటర్లు ఇప్పటికే పనిచేస్తున్నాయి.2015 నాటికి వీటి సంఖ్యను ఎనిమిది నుంచి తొమ్మిది లక్షలకు పెంచాలనేది తమ లక్ష్యమన్నారు. కొంతమంది వినియోగదారులకు రెండు కనెక్షన్లు కూడా ఉన్నాయన్నారు. అందులో ఒకటి మీటర్ కలిగినది కాగా మరొకటి మీటర్ లేనిదని అన్నారు. ఈ తరహా వినియోగదారులు అనేకమంది ఉన్నారన్నారు. నిరుపేదలు నివసించే కాలనీల్లోనే కాకుండా ధనవంతులు జీవించే ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందన్నారు.