నగర పోలీసు కమిషనరేట్‌లో కీలక నిర్ణయం.. ఇకపై ఆ లైసెన్సుల జారీ కఠినతరం
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఆయుధ లైసెన్సుల జారీ విధానాన్ని మరింత కఠినతరం చేస్తూ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దరఖాస్తుదారుడిని ఇంటర్వ్యూ చేసిన తర్వాతే దరఖాస్తును ఆమోదించనున్నారు. లైసెన్సుల జారీలో లోపాలను సరిచేయడం, పారదర్శకత పెంచడం, దుర్వినియోగాన్ని తగ్గించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు. అనునిత్యం బిజీ షెడ్యూల్లో ఉండే కొత్వాల్ ఆనంద్ ఈ ఇంటర్వ్యూల కోసం ప్రతి రోజూ నిర్ణీత సమయాన్ని కేటాయిస్తున్నారు.
మూడు కేటగిరీలుగా జారీ..
►సాధారణంగా తుపాకీ ఖరీదు చేసుకోవడానికి, కలిగి ఉండటానికి లైసెన్సును మూడు కేటగిరీల్లో జారీ చేస్తుంటారు. వ్యక్తిగత భద్రత, సెక్యూరిటీ గార్డులు, ఫైరింగ్ వంటి క్రీడలకు సంబంధీకులకు వీటిని ఇస్తుంటారు. నగర పరిధిలో నివసిస్తున్న క్రీడాకారులతో పాటు వ్యాపారులు, ప్రముఖులు, సెక్యూరిటీ గార్డులకు వీటి జారీ అధికారి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాలు ఉన్న పోలీసు కమిషనర్‌కు ఉంది.
►ఆయుధ చట్టంలో 2020లో వచ్చిన సరవణ ప్రకారం వ్యక్తిగత భద్రత కేటగిరీలో గరిష్టంగా రెండు తుపాకులు మాత్రమే కలిగి ఉండాలి. అంతకుమించి ఉన్న వారి నుంచి నగర పోలీసులు రెండేళ్ల క్రితం డిపాజిట్ చేయించారు. వ్యక్తిగత భద్రత కేటగిరీలో ఆయుధ లైసెన్సు తీసుకున్న కొందరు దాన్ని క్రీడలు లేదా సెక్యూరిటీ విధులు వంటి వాటికి వినియోగిస్తుంటారు. ఇలా చేయడం ఆయుధ చట్టం ప్రకారం నేరమే అవుతుంది. గతంలో ఇలాంటి ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి.
నేర చరిత్ర లేనివారికే..
►ఆయుధ లైసెన్సు కోసం నగరవాసి చేసుకున్న దరఖాస్తు దస్త్రంపై పోలీసుస్టేషన్, ఏసీపీ కార్యాలయం, డీసీపీ కార్యాలయం, సంయుక్త పోలీసు కమిషనర్ కార్యాలయాలు తొలుత ఆమోదముద్ర వేస్తాయి. ఎలాంటి నేరచరిత్ర లేని వారికే మంజూరుకు అనుమతిస్తాయి. ఇప్పటి వరకు ఇలా వస్తున్న దరఖాస్తు ఫైళ్లపై కొత్వాల్ ప్రాథమిక పరిశీలన చేసి సంతకం చేస్తూ లైసెన్సు జారీ చేస్తారు. దీని ఆధారంగా అనుమతి పొందిన క్యాలిబర్, సంఖ్యలో ఆయుధాలను లైసెన్సుదారు ఖరీదు చేసుకుంటారు.
►ఇటీవల కాలంలో లైసెన్స్డ్ ఆయుధాలు కలిగి ఉడటమనేది అవసరమున్నా లేకపోయినా స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. ఇదే కొన్నిసార్లు అపశ్రుతులకు దారి తీస్తోంది. ఏదైనా ఉదంతం జరిగినప్పుడు మాత్రమే ఈ వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయుధ లైసెన్సులకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో వివిధ స్థాయిల్లో పోలీసులపై ఒత్తిళ్లు, ప్రలోభాలకు ఆస్కారం ఏర్పడుతోంది. వీటిని అన్ని సందర్భాల్లోనూ కింది, మధ్య స్థాయి అధికారులు పట్టించుకోకుండా ఉండలేరు. ప్రలోభాల కంటే ఒత్తిళ్లే ఎక్కువగా పని చేస్తుంటాయి.
పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాతే..
►ఇలాంటి అంశాలకు ఆస్కారం లేకుండా నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయుధ లైసెన్సు దస్త్రం వివిధ స్థాయిలను దాటి తన వద్దకు చేరాక దాన్ని పరిశీలించే సమయంలో దరఖాస్తుదారుడిని ముఖాముఖీ ఇంటర్వ్యూ చేస్తున్నారు.
►దరఖాస్తు చేసుకున్నది ఎవరు? ఏ అవసరం కోసం అప్లై చేశారు? నిజంగా వారికి ఆయుధం కలిగి ఉండాల్సిన అవసరం ఉందా? తదితర అంశాలను ఆయనే స్వయంగా ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకుంటున్నారు. పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే లైసెన్సు జారీ చేస్తున్నారు.
►నగరవాసులు పోలీసు కమిషనర్‌ను నేరుగా కలవడానికి ప్రతి రోజూ విజిటింగ్ అవర్స్ ఉంటాయి. వీటిని కొత్వాల్ సీవీ ఆనంద్ పక్కాగా అమలు చేస్తున్నారు. ఆ సమయంలోనే ఆయుధ లైసెన్స్ దరఖాస్తుదారులనూ ఇంటర్వ్యూ చేయడానికీ కొంత కేటాయిస్తున్నారు.