పాలు పోసి పెంచారు.. అనుభవిస్తున్నారు
పాముకు పాలు పోసి పెంచినా విషం విషమే. మరి కోరలు పీకితేనో!. నిజమే కానీ.. పరిస్ధితి చేయిదాటిపోయాక ఆ పని చేస్తే ఏం? చేయకపోతే ఏం?. ప్రస్తుతం పాకిస్తాన్ పని నూతిలో పడిన ఎలుకలా తయారైంది. ఉగ్రవాదమనే గడ్డిదుబ్బును పెంచి పోషిస్తూ హఫీజ్ సయీద్‌లాంటి వందలాది విష పురుగులను చేరదీసింది పాక్. ఇప్పుడు ఆ పాపమే దేశంలో గడిచిన 10 రోజులుగా జరుగుతున్న మారణకాండలకు కారణం. దాదాపు 100 మంది పాకిస్తానీ పౌరులు ఈ పదిరోజుల్లో జరిగిన ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.
గత నెల 30 తేదీన సయీద్, అతని సంస్ధలకు చెందిన మరో నలుగురి 90 రోజుల పాటు పాకిస్తాన్ హౌస్ అరెస్టు చేసింది. విదేశాలకు పారిపోకుండా ఎగ్జిట్ కంట్రోల్ లిస్టులో కూడా వీరి పేరును చేర్చింది. అయితే, యూఎన్ భద్రతా కౌన్సిల్ ఇచ్చిన ఆదేశాల మేరకే సయీద్, అతని అనుచరులను నిర్భందించామని చెప్పుకుంటున్న పాక్.. గతంలో యూఎన్ కౌన్సిల్ ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పట్టించుకోలేదో దానికే తెలియాలి. సయీద్ సంస్ధలైన జమాత్ ఉద్ దవా, ఫలాహా-ఈ-ఇన్సాన్యత్‌లపై కూడా చర్యలకు దిగుతున్నట్లు పంజాబ్‌కు చెందిన ఓ అధికారి చెప్పారు.
ఉగ్రదాడులతో వణుకుతున్న పాకిస్తాన్ సయీద్‌కు ఉన్న 44 రకాల ఆయుధాల లైసెన్స్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. హఫీజ్ నిర్భంధం అనంతరమే పాకిస్తాన్‌లో కల్లోలం ప్రారంభమైంది. పాకిస్తాన్‌లో ఆర్మీకి అత్యధికంగా ప్రాధాన్యం ఉంది. ఇలాంటి సమయంలో పేట్రేగుతున్న ఉగ్రవాదాన్ని అణిచేందుకు అక్కడ ఆర్మీ ఎలాంటి చర్యలకు దిగుతుందో కూడా చూడాలి.