కలెక్టరేట్లో ఈవీఎం వేర్‌హౌస్
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల(ఈవీఎం)ను భద్రపర్చడానికి కలెక్టరేట్లో గొడౌన్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం రూ.1.15 కోట్లను మంజూరు చేసింది. వాస్తవానికి కలెక్టరేట్లో ఈవీఎం వేర్‌హౌస్ నిర్మాణానికి 2012, జూలై 19న ప్రభుత్వం అనుమతిచ్చింది. దీనికి రూ.99 లక్షలు ఖర్చవుతుందని ప్రతిపాదనలు రూపొందించగా ఇందులో రూ.49.5 లక్షలను అదే ఏడాది ఆగస్టు 31న విడుదల చేసింది. నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను ఆర్‌అండ్‌బీకి అప్పగించింది.
ఆ ప్రాజెక్టును రూపకల్పన చేసిన ఆర్అండ్బీ అధికారులు నిర్మాణ ఖర్చు రూ.1.15 కోట్లు అవుతుందని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఈ ఏడాది ఆగస్టు 13న ప్రభుత్వానికి సమర్పించారు. తొలి దశలో విడుదల చేసిన రూ.49.5 లక్షలను ఖర్చు చేయలేదని విన్నవించారు.
కలెక్టర్ పంపించిన సవరణ ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం ఆ మేరకు రూ.1.15 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈవీఎంలను పెట్టడానికి జిల్లాలో ఇప్పటి వర కు సరైన స్థలం లే దు. ప్రతిసారి కళాశాలలు, ఆడిటోరియాల్లో భద్రపరుస్తూ వస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఈవీఎంలు మరమ్మత్తులకు గరవుతున్నాయి. కలెక్టరేట్లో శాశ్వత గిడ్డంగుల నిర్మాణంతో సమస్య తీరనుంది.