అందుబాటులో పీహెచ్ఎల్వీ ’ 94949 33233
పోలీస్ ఫేస్బుక్ కూడా
ఆవిష్కరించిన ఎస్పీ విశాల్ గున్ని
కాకినాడ క్రైం: ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు, సమస్యల సత్వర పరిష్కారం కోసం జిల్లా పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. పోలీస్ హెల్ప్‌లైన్ వాట్సప్ (పీహెచ్ఎల్వీ) ను ప్రారంభిస్తున్నట్టు జిల్లా ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఆయన వాట్సప్ హెల్ప్‌లైన్ తూర్పు గోదావరి జిల్లా పోలీస్ నం. 94949 33233ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీంతో పోలీస్ సేవల సరళీకృతం, పారదర్శక పాలన అందించేందుకు వీలవుతుందన్నారు. అందరి చేతుల్లో ఆధునికమైన ఫోన్లు ఉంటున్నాయని, ఎక్కడైనా సమస్య, సంఘటన సంభవిస్తే తక్షణమే వాట్సప్ నంబర్‌కు పోస్టింగ్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలా పోస్ట్ చేసిన మరుక్షణమే జిల్లా పోలీస్ కార్యాలయంలోని కంట్రోల్ రూం నుంచి సంబంధిత ఎస్సై, సీఐ, డీఎస్పీలకు క్షణాల్లో సమాచారం చేరుతుందన్నారు. వెనువెంటనే సమస్య పరిష్కారానికి పోలీసులు చర్యలు తీసుకుంటారన్నారు. ఎమర్జెన్సీ సంఘటనలపై పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు వీలు లేనప్పుడు వాట్సప్ ద్వారా సమాచారం అందించవచ్చన్నారు. శాంతిభద్రతలకు విఘాతం వాటిల్లే సంఘటనలు, నేరాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి వివరాలను వాట్సప్ చేస్తే వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. సాంకేతికతను అందుపుచ్చుకుంటూ నేరాల నియంత్రణకు సామాజిక స్పృహతో పోలీసులతో కలసి పనిచేసేందుకు యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఫేస్బుక్లో యువతతో పోలీసింగ్, ప్రజా సంబంధాలు, పారదర్శనపై సలహాలు, సూచనలను పంచుకుంటామన్నారు. పలు ఫిర్యాదులపై ఎస్పీ, సీఐ, ఎస్సైలను కలసి ఫిర్యాదు చేయలేకపోయామనే భావన రాకుండా వాట్సప్, ఫేస్బుక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాతీయ రహదారుల్లో సంభవిస్తున్న రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు.
ప్రత్యేక కంట్రోల్ రూమ్
పోలీస్ హెల్ప్‌లైన్ వాట్సప్ ద్వారా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి, సంబంధిత పోలీస్ అధికారులకు పంపించేందుకు ఇరవై నాలుగు గంటల పాటూ మూడు ఫిప్టుల్లో పని చేసేందుకు ముగ్గురు కానిస్టేబుళ్లను నియమించినట్టు ఎస్పీ తెలిపారు. వీరు నిరంతరం కంట్రోల్ రూమ్‌లో ఉంటూ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను రిజిస్టర్లో నమోదు చేసుకుని సంబంధిత పోలీస్ అధికారులకు పంపుతారన్నారు. ఫిర్యాదుదారులకు వాట్సప్‌లో ఆన్లైన్లో ఎఫ్ఐఆర్/రసీదు ఇస్తారన్నారు. సమస్య పరిష్కారం తర్వాత పోలీసులు తీసుకున్న చర్యలపై సమాచారం అందజేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.