కూపన్ సరే..రేషన్ ఏదీ?
మిర్యాలగూడ, న్యూస్‌లైన్: లబ్ధిదారులకు రేషన్‌కార్డులు ఉన్నా సరుకులు అందని పరిస్థితి నెలకొంది. టెంపరరీ రేషన్‌కార్డులు, కూపన్ల పంపిణీపై శ్రద్ధ వహించిన అధికారులు వాటికి రేషన్ కోటాను జారీ చేయడాన్ని విస్మరించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 43వేల మంది లబ్ధిదారులు రేషన్ కోసం నిరీక్షిస్తున్నారు. రెండో విడత రచ్చబండ కార్యక్రమంలో దరఖాస్తులు చేసుకున్న వారిలో 43వేల మందిని అర్హులుగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. వీరి నుంచి ఫొటోలు సేకరించారు. మూడో విడత రచ్చబండ కార్యక్రమంలో వీరికి టెంపరరీ కార్డులతో పాటు రేషన్ కూపన్లు పంపిణీ చేశారు.
డిసెంబర్ నెలతో పాటు 2014 జూన్ వరకు గాను రేషన్ దుకాణాల్లో సరుకులు తెచ్చుకోవడానికి వీలుగా కూపన్లు పంపిణీ చేశారు. కానీ అధికారులు రేషన్ కోటా జారీ చేయడం మరిచారు. దాంతో లబ్ధిదారులు డిసెంబర్ నెల కూపన్‌ను తీసుకుని రేషన్‌దుకాణానికి వెళ్తే కోటా రాలేదని డీలర్లు చెబుతుండడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. కొత్త కార్డులకు డిసెంబర్ నెల కోటాకు సంబంధించి డీలర్లు డీడీలు చెల్లించకపోవడం వల్ల రేషన్‌ను పంపిణీ చేయడం లేదు. దాంతో డిసెంబర్ నెల కూపన్ ఇచ్చినా ఎలాంటి ప్రయోజనమూ లేదని లబ్ధిదారులు వాపోతున్నారు.
దుకాణాల్లో నిండుకున్న సరుకులు
ఇప్పటికే జిల్లాలో 9.35 లక్షల తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి. కాగా కొత్తగా రెండవ రచ్చబండలో దరఖాస్తులు చేసుకున్న వారిలో 65,962 మందిని అర్హులుగా గుర్తించారు. కానీ సుమారు 43 వేల మంది కుటుంబాలకు సంబంధించిన ఫొటోలను రెవెన్యూ అధికారులు సేకరించారు. కాగా వారందరికీ డిసెంబర్ నెల నుంచే రేషన్ సరుకులు ఇవ్వడానికి కూపన్లు ఇచ్చారు. కానీ ఈ నెల గడువు ముగుస్తున్నా సరుకులు మాత్రం దుకాణాలలో లేవు. ఈ నెల కూపన్లకు లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేయాల్సి ఉందని అధికారులకు తెలిసినా డీడీలు కట్టేలా డీలర్లను ఆదేశించకపోవల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.