గోరంత ప్రీమియం.. టర్మ్ ఇన్సూరెన్స్..
బేసిక్స్.. బీమా
బీమా పాలసీల్లో రకరకాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఇందులో టర్మ్ పాలసీల విషయానికొస్తే.. నిర్దిష్ట కాలానికి నిర్దిష్ట కవరేజీని అందిస్తాయి ఇవి. బీమా ప్రధానోద్దేశ్యానికి చక్కగా సరిపోయే సిసలైన పాలసీలు ఇవి. తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజి అందిస్తాయివి. పాలసీ వ్యవధిలో గానీ పాలసీదారు మరణిస్తే.. కవరేజి మొత్తాన్ని వారి కుటుంబ సభ్యుల (నామినీ)కు అందిస్తుంది కంపెనీ.
ఒకవేళ అలాంటిదేమీ జరగకపోతే .. అప్పటిదాకా కట్టిన ప్రీమియం మొత్తం తిరిగి రాదు. ఉదాహరణకు పదిహేనేళ్ల పాటు కవరేజీ తీసుకున్న పక్షంలో.. ఏటా ప్రీమియం కడుతూనే ఉండాలి. ఈ పదిహేనేళ్ల లోపు పాలసీదారు గానీ మరణిస్తే.. ఎంత కవరేజీకి పాలసీ తీసుకున్నారో..అంత మొత్తమూ కుటుంబ సభ్యులకు వస్తుంది. ఒకవేళ పదిహేనేళ్ల తర్వాత కూడా జీవించి ఉన్నా.. కట్టిన ప్రీమియం వెనక్కి రాదు, పాలసీ వ్యవధీ ముగిసిపోతుంది. అయినా కూడా బీమా ప్రధానోద్దేశ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే అత్యంత తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ ఇచ్చే ఈ తరహా పాలసీలే కరెక్ట్ అంటుంటారు నిపుణులు. సాధారణంగా 10,15,20,30 ఏళ్ల వ్యవధికి సంబంధించి ఈ పాలసీలు లభిస్తాయి.
హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ..
ప్రీమియాలు సరిగ్గా కట్టుకుంటూ వెడితే .. ఇది శాశ్వత ప్రాతిపదికన , జీవితాంతం బీమా కవరేజీ కల్పిస్తుంది. దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు ఈ పాలసీలు ఉపయోగపడతాయి. అయితే టర్మ్ ఇన్సూరెన్స్‌తో పోలిస్తే ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ప్యూర్ హోల్ లైఫ్ అనీ లిమిటెడ్ పేమెంట్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనీ రెండు రకాలు ఉంటాయి. ప్యూర్ హోల్ లైఫ్ పాలసీల్లో చివరిదాకా ప్రీమియాలు కట్టాల్సి ఉంటుంది. అదే రెండో రకం దాంట్లో ప్రీమియాలు కొంత కాలం దాకానే కట్టాల్సి ఉంటుంది. కవరేజీ మాత్రం చివరిదాకా కొనసాగుతుంది. యవ్వనంలో ఉన్నప్పుడే ఇలాంటివి తీసుకుంటే వార్షిక ప్రీమియాలు తక్కువ ఉంటాయి.
ఎండోమెంట్ ప్లాన్లు ..
టర్మ్, హోల్ లైఫ్ ప్లాన్ల కన్నా ఇవి మరింత ఖరీదైనవి. పాలసీ వ్యవధి ముగిసిపోయిన తర్వాత కూడా పాలసీదారు జీవించి ఉన్న పక్షంలో సమ్ అష్యూర్డ్‌తో పాటు అప్పటిదాకా పోగుపడిన బోనస్‌లు కూడా కంపెనీ చెల్లిస్తుంది. అదే పాలసీ వ్యవధిలో పాలసీదారు మరణించిన పక్షంలో ఆ మొత్తాన్ని నామినీకి చెల్లిస్తుంది. ఇందులో రివర్షన రీ, టర్మినల్ అని రెండు రకాల బోనస్‌లు ఉంటాయి.
రివర్షనరీ విధానంలో ఏటా బోనస్‌ను కలిపి, పాలసీ వ్యవధి చివర్లో చెల్లిస్తారు. అదే టర్మిన ల్ విధానంలో పాలసీ వ్యవధి ఆఖర్న అదనంగా లాయల్టీ బోనస్ లభిస్తుంది. ఇక ఎండోమెంట్ పాలసీల్లో తీవ్ర అనారోగ్యం పాలైనా, ప్రమాదవశాత్తు మరణం సంభవించినా, తాత్కాలికంగా లేదా శాశ్వత అంగ వైకల్యం సంభవించినా ఎదుర్కొనేందుకు ఉపయోగపడేలా రైడర్లను తీసుకోవచ్చు.
వివిధ అవసరాలకు వివిధ రకాల ఎండోమెంట్ ప్లాన్లు తీసుకోవచ్చు. చదువుకోసమని, పెళ్లి కోసమని, యూనిట్ లింక్డ్ అని వివిధ రకాల ప్లాన్లు ఉంటాయి. టర్మ్ ఇన్సూరెన్స్‌లో పాలసీదారు మరణిస్తే మాత్రమే నామినీకి పాలసీ మొత్తం లభిస్తుంది. అదే పాలసీ వ్యవధి దాటిన తర్వాత జీవించి ఉన్నా కంపెనీ ఏమీ చెల్లించదు.
కానీ ఎండోమెంట్ ప్లాన్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ క్లెయిము చెల్లిస్తుంది. అలాగే, రాబడులు కూడా అందించాల్సినందువల్ల ప్రీమియాలను బీమా కంపెనీ వివిధ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. కనుక టర్మ్ పాలసీలతో పోలిస్తే దీని ప్రీమియాలు ఎక్కువగానే ఉంటాయి. ఏదైతేనేం.. ఒకవైపు లైఫ్ కవరేజీతో పాటు ఇతరత్రా ప్రయోజనాలు కూడా పొందాలనుకుంటున్న వారు వీటిని తీసుకోవచ్చు.
వచ్చే వారం .. మనీ బ్యాక్ తదితర ప్లాన్ల గురించి..