భార్యకు టికెట్ ఇవ్వలేదని ఎమ్మెల్యే రాజీనామా
తన భార్యకు సీటవ్వలేదని ఓ ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేసిన ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. లఖింపూర్ జిల్లాలోని నౌబోయిచా నియోజకవర్గ ఎమ్మెల్యే భరత్ చంద్ర నారా.. తన భార్యకు లోక్సభ టికెట్ నిరాకరించడంతో తక్షణమే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
లఖింపూర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి తన సతీమణి, మాజీ ఎంపీ రాణీ నారాకు పార్టీ టికెట్ నిరాకరించడంతో భరత్ చంద్ర నారా రాజీనామా చేశారు. ఏప్రిల్ 19న ఇక్కడ లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.ఈమేరకు ఆదివారం సాయంత్రం భరత్ చంద్ర నారా తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపారు.
భరత్ చంద్ర నారా రాజీనామాను అస్సాం సీఎల్పీ నాయకుడు దేబబ్రత సైకియా ధ్రువీకరించారు. అంతకుముందు నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం హిమంత బిస్వా శర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. వీరిలో ఒక ఎమ్మెల్యే షెర్మాన్ అలీ అహ్మద్ సస్పెండ్ అయ్యారు. మిగిలిన శాసనసభ్యులు శశికాంత దాస్, సిద్ధిక్ అహ్మద్, కమలాఖ్య డే పుర్కాయస్థ, బసంత దాస్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదు.
అస్సాంలోని 14 లోక్సభ నియోజకవర్గాలకు మూడు దశల్లో ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో అస్సాంలోని 14 స్థానాల్లో బీజేపీ 7 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ చెరో మూడు స్థానాలను దక్కించుకున్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ తన సీట్ల సంఖ్యను తొమ్మిదికి పెంచుకోగలిగింది. కాంగ్రెస్ తన మూడు స్థానాలను నిలుపుకొంది. ఏఐయూడీఎఫ్ ఒక్క సీటును మాత్రమే గెలుచుకుంది.
Assam Congress MLA Bharat Chandra Narah tenders his resignation from the party. pic.twitter.com/3aauZNQFYm
— ANI (@ANI) March 25, 2024