పోలీసులకు భయపడి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ముంగిమళ్ల (కోస్గి):
భార్య ఆత్మహత్య కేసులో 45 రోజులపాటు జైలుశిక్ష అనుభవించి వచ్చిన ఓ వ్యక్తి మరోసారి పోలీసు కేసు నమోదవుతుందని భయపడి కిరోసిన్‌తో నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన మండలంలోని ముంగిమళ్ల గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి సాయప్ప (22) భార్య ఉమాదేవి రెండు నెలల క్రితం ఆత్మహత్య చేసుకోవడంతో గృహహింస చట్టం కింద భర్తతోపాటు అత్త, మామలపై కేసు నమోదైంది.
ఈ కేసులో తల్లిదండ్రితోపాటు సాయప్ప జైలుకెళ్లాడు. 45 రోజులపాటు జైలుశిక్ష అనుభవించి వారంరోజుల క్రితమే విడుదలై గ్రామానికి వచ్చారు. ఇదిలా ఉండగా గురువారం గ్రామంలో మద్యం విక్రయించే ఓ బెల్టు దుకాణానికి వెళ్లగా అక్కడ గొడవ చోటుచేసుకుంది. ఈ క్రమంలో దుకాణదారులు కొందరు గ్రామస్తులతో కలిసి సాయప్పపై దాడిచేయడంతోపాటు దొంగతనం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు గురువారం రాత్రి గ్రామానికి వెళ్లి సంఘటనపై విచారణ జరిపి శుక్రవారం ఉదయం పోలీస్‌స్టేషన్‌కు రావాలని ఆదేశించి వెళ్లిపోయారు. దీంతో మరోసారి జైలుకెళ్లాల్సి వస్తుందేమోనని భయపడి సాయప్ప శుక్రవారం ఉదయం కిరోసిన్ తీసుకొని వ్యవసాయ పొలానికి వెళ్లి నిప్పంటించుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించి అతన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ఇదే విషయమై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వివరణ కోరగా.. అలాంటిదేమీ జరగలేదంటూ సమాచారం ఇవ్వడానికి నిరాకరించారు.