సికింద్రాబాద్ స్టేషన్లో వైఫై
♦ దశల వారీగా ఎ-1,బి స్టేషన్లకు విస్తరణ
♦ ఎయిర్‌పోర్టు కనెక్టివిటీకి జీఎమ్మార్ ససేమిరా
♦ వేసవి ప్రత్యేక రైళ్లకు మౌలాలిలో హాల్టింగ్
♦ దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ
సాక్షి, సిటీబ్యూరో : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నాలుగైదు రోజుల్లో వైఫై సదుపాయం అందుబాటులోకి రానుంది. ప్రయాణికులు అరగంట పాటు తమ మొబైల్ ఫోన్లలో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఈ ఏడాది బడ్జెట్లో ప్రతిపాదించిన విధంగా ఎ, ఎ-1, బి కేటగిరీ రైల్వేస్టేషన్లకు దశల వారీగా దీన్ని విస్తరించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ తెలిపారు. ఈ నెల 10 నుంచి 16వ తేదీ వరకు జరుగనున్న రైల్వే వారోత్సవాలను దృష్టిలో ఉంచుకొని బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రయాణికుల సదుపాయా లు, భద్రత, రైళ్ల నిర్వహణ, ఇప్పటి వరకు చేపట్టిన ప్రాజెక్టుల పురోగతి, బోగీల కొరత, తదితర అంశాలను వివరించారు.
ఎయిర్‌పోర్టు కనెక్టివిటీకి అడ్డంకి
ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టును శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు విస్తరించేందుకు అనేకసార్లు జీఎమ్మార్ ప్రతినిధులతోనూ, ప్రభుత్వ ఉన్నతాధికారులతోనూ సంప్రదించినట్టు జీఎం వెల్లడించారు. కానీ జీఎమ్మార్ నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. దీనిపై మూడుసార్లు ప్రభుత్వ ఉన్నతాధికారులకు లేఖలు రాసినట్లు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో ఎయిర్‌పోర్టు, ట్రైన్, రోడ్డు కనెక్టివిటీ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. హైదరాబాద్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రోడ్డు మార్గంలో వెళితే రూ.400 నుంచి రూ.800 వరకు ఖర్చవుతుందని... గంటన్నరకు పైగా సమయం వెచ్చించాల్సి వస్తుందని చెప్పారు.
రైలు అందుబాటులోకి వస్తే కేవల రూ.20 చార్జీతో, అరగంట వ్యవధిలో ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చునన్నారు. రూ.850 కోట్లతో చేపట్టిన రెండో దశ ప్రాజెక్టులోనే ఎయిర్‌పోర్టు వరకు రైలు మార్గం విస్తరణ పూర్తయితే ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. ఉందానగర్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు 6 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మించేం దుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎంఎంటీఎస్‌తో కాకుం డా విడిగా ఆ ప్రాజెక్టు పూర్తి చేయడం కష్టమన్నారు. 2017 జూన్ నాటికి రెండో దశ పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. మల్కాజిగిరి ప్రాంతంలోని 4 కిలోమీటర్ల కంటోన్మెంట్ మార్గంలో ఆర్మీ నుంచి అభ్యంతరాలు వచ్చాయని, త్వరలో రక్షణ శాఖతో సంప్రదించి పనులు కొనసాగించనున్నట్లు చెప్పారు.
కాజీపేట్ వ్యాగన్ ఫ్యాక్టరీకి బ్రేక్
కాజీపేట్‌లో నిర్మించ తలపెట్టిన వ్యాగన్ ఫ్యాక్టరీకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. త్వరలో రైల్వే బోర్టు నూతన వ్యాగన్ విధానాన్ని రూపొందించనున్న దృష్ట్యా దీనిని నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ‘ఏపీ ఎక్స్‌ప్రెస్’కు ‘తెలంగాణ ఎక్స్‌ప్రెస్’గా త్వరలోనే మార్పు వస్తుందని, కాజీపేట్ డివిజన్ ఏర్పాటుకూ రైల్వే శాఖ సుముఖంగా ఉందని చెప్పారు.
అదనపు రైళ్లు నడపలేం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అదనపు రైళ్లు నడపడం చాలా కష్టంగా ఉందని జీఎం చెప్పారు. వేసవి ప్రత్యేక రైళ్లను మౌలాలి నుంచి నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మౌలాలీ నుంచి సిటీ బస్సులు నడపాలని, రోడ్డు వెడల్పు చేయాలని, వీధి లైట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ప్రభుత్వం ఈ సదుపాయాలను అందుబాటులోకి తెచ్చిన వెంటనే కాజీపేట్, బల్లార్ష, విజయవాడ మార్గాల్లో రాకపోకలు సాగించే కొన్ని ప్రత్యేక రైళ్లను మౌలాలీ నుంచి నడుపుతామనీ జీఎం చెప్పారు. ప్రయాణికుల విశ్రాంతి గదులు, ఫుడ్‌స్టాళ్లు ఏర్పాటు చేయడంతో పాటు స్టేషన్‌ను విస్తరించనున్నట్లు తెలిపారు. వట్టినాగులపల్లి, మౌలాలీలో టెర్మినళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదిస్తున్నామని పేర్కొన్నారు.
సేవలు సంతృప్తికరం
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌గా మూడేళ్లుగా విధులు నిర్వహిస్తున్న శ్రీవాస్తవ మరి కొద్ది నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు. తన పదవీ కాలంలో ప్రయాణికుల, ఉద్యోగుల సంక్షేమానికి తాను చేపట్టిన కార్యక్రమాలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. రూ.80 కోట్లతో ప్రయాణికుల సదుపాయాలను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు.
భద్రతకు ప్రాధాన్యం
ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిచ్చినట్లు జీఎం శ్రీవాస్తవ చెప్పారు. అన్ని రైల్వేస్టేషన్లు, రైళ్లలో ఆర్పీఎఫ్, జీఆర్పీ బలగాలను పెంచామన్నారు. అయినప్పటికీ ఎక్కడో ఒక చోట చైన్‌స్నాచింగ్‌లు, అక్రమ రవాణా, దొంగతనాలు చోటుచేసుకుంటున్నాయని విచారం వ్యక్తం చేశారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాపలా లేని రైల్వే గే ట్లన్నింటినీ 2016 నాటికి తొలగించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కాపలా లేని 88 చోట్ల ‘గేట్ మిత్ర’లను నియమించామన్నారు.