దారి దీపం
జెన్ పథం
సాయంత్రం దాటింది. చీకటి మొదలైంది. ఒక కుర్రాడు తన చేతిలో ఒక లాంతరు పట్టుకుని ఓ చెట్టుకింద దిగాలుగా కూర్చున్నాడు. ఆ దారిలో వెళ్తున్న ఒక పెద్దాయన దిగులు పడుతూ కూర్చున్న కుర్రాడిని చూసి అతని వద్దకు వెళ్లాడు. కుర్రాడి బాధేంటో తెలుసుకోవాలనుకున్నాడు.
కుర్రాడు ‘‘నేను పొరుగూరికి వెళ్లాల్సి ఉంది. చీకటి పడింది. నాదగ్గరున్న ఈ లాంతరు దీపం వెలుగు ఓ మూడడుగుల దూరం వరకే కనిపిస్తుంది. కనుక కొన్ని మైళ్ల దూరంలో ఉన్న మా పల్లెకు ఎలా వెళ్లాలో తెలియడం లేదు. భయంగా ఉంది...’’ అని వాపోయాడు.
అతను చెప్పినదంతా విన్న పెద్దాయన ‘‘నీ దగ్గరున్న లాంతరు దీపం వెలుగు మూడడుగుల దూరం వరకే కనిపిస్తుందనేది నిజమే కావచ్చు. కానీ నువ్వీ చెట్టు కింద కూర్చుని అలా అనుకోవడం సరికాదు. ఆ దీపాన్నే నువ్వు చేత్తో పట్టుకుని నడిచే కొద్దీ ఒక్కో అడుగు ముందుకు వెళ్తున్నట్టే అవుతుంది కదా? వేసే ప్రతి అడుగు వల్ల ఆ దీపం వెలుగు దారిపొడవునా ఉన్నట్టే అవుతుంది కదా? కనుక దిగులు మాని లేచి అడుగులు వెయ్యి...’’ అన్నాడు.
కుర్రాడు పెద్దాయన చెప్పినట్లే చేశాడు. తన చేతిలో ఉన్న లాంతరు వెలుగులో నమ్మకంతో నడిచి తన పల్లెకు చేరుకున్నాడు.
ఉపయోగపడేదేదో మన దగ్గర ఉంటే సరిపోదు. దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం అవసరం.
- సమయ